ఘనంగా దుద్దిల్ల శ్రీపాదరావు 87వ జయంతి

జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

భూపాలపల్లి నేటిధాత్రి

శనివారం కలెక్టర్ కార్యాలయపు సమావేశ మందిరంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు 87వ జయంతి వేడుకలకు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ముఖ్య అతిథిగా హాజరై దుద్దిల్ల శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ
ప్రజాభిమానాన్ని చూరగొన్న మహానేత
దుద్దిల్ల శ్రీపాదరావు అన్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన ఆయన ప్రముఖ రాజకీయ నాయకునిగా ఎదిగి పేద ప్రజలకు సేవకుడిగా పేరు సంపాదించుకున్నారని చెప్పారు. శ్రీపాదరావు మార్చి 2, 1935న అప్పటి కరీంనగర్ జిల్లా ఇప్పటి జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోని ధన్వాడ గ్రామంలో జన్మించారని చెప్పారు. న్యాయ విద్యను అభ్యసించిన శ్రీపాదరావు
రాష్ట్రంలోని రాజకీయ ప్రముఖులలో ఒకరని, ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన తన చివరి శ్వాస వరకు పేద ప్రజలకు సేవలు అందించారని చెప్పారు. ప్రజా సేవకు తన జీవితాన్ని అంకితం చేశారని చెప్పారు. ఓ బహిరంగ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా తీవ్రవాదుల చేతిలో హతులయ్యారని అన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలులో పార్టీలకతీతంగా సేవలు అందించారని చెప్పారు. సర్పంచ్‌గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి క్రమ, క్రమంగా ఎదిగి 1991-95లో అన్ని పార్టీల మద్దతుతో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఏకగ్రీవంగా స్పీకర్‌గా ఎన్నికయ్యారని చెప్పారు. అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేసిన సమయంలో మార్గదర్శిగా మన్ననలు పొందారని చెప్పారు. తన సేవా కాలంలో కొత్త ప్రమాణాలు నెలకొల్పారని, ఒక్క మాటలో చెప్పాలంటే, రాజీపడకుండా రాజకీయ విలువలను తిరుగులేని విధంగా ఆచరించడం ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచు కున్నారన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు సన్నిహితుడిగా ఉంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకున్నారని చెప్పారు. రాజకీయ పరంగానే కాకుండా సామాజిక సేవలో విరివిగా పాల్గొన్నారని తెలిపారు.
కాటారం మండల ధన్వాడ గ్రామానికి చెందిన మౌళి పటేల్ రాధాకిష్టయ్య, కమలా బాయి దంపతులకు జన్మించిన
శ్రీపాదరావును ఆప్రాంత వాసులు బుచ్చి పంతులు అని ఎంతో ప్రేమగా పిలిచేవారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, ఏ ఓ మహేష్ బాబు, అన్ని శాఖల జిల్లా అధికారులు, తదితరులు  పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *