
ఎస్సిడబ్ల్యూయు బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ
మందమర్రి, నేటిధాత్రి:-
సింగరేణి యాజమాన్యం ఉత్పత్తిపై చూపెడుతున్న శ్రద్ధ కార్మికుల రక్షణ పై చూపించడం లేదని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసి) బ్రాంచ్ కార్యదర్శి కార్పొరేట్ చర్చలు కమిటీ సభ్యుడు శైలేంద్ర సత్యనారాయణ ఆరోపించారు. శుక్రవారం ఏరియాలోని కేకే 5 గనిని ఆయన సందర్శించి, కార్మికుల సమస్యలు అడిగి, తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గనిలో రూఫ్ బోల్టర్ యంత్రాలు సరిగ్గా పనిచేయడం లేదని, అదేవిధంగా కార్మికులకు చేతి గ్లౌజులు సైతం ఇవ్వడం లేదని ఆరోపించారు. యాజమాన్యం కార్మికుల రక్షణ కొరకు వాడే ప్రతి వస్తువు కార్మికులకు అందజేయాలని డిమాండ్ చేశారు. సింగరేణికి లాభాలు రావడానికి కారణమైన కార్మికుల రక్షణ కోసం యాజమాన్యం రక్షణ పనిముట్లు, రక్షణ పరికరాలు అందించి, కార్మికులకు ప్రాణహాని లేకున్నా చూసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యానిదే అని గుర్తు చేశారు. ఇప్పటికైనా యాజమాన్యం కార్మికులకు రక్షణ పరికరాలు అందజేయాలని లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు భీమానాథుని సుదర్శన్, జాయింట్ కార్యదర్శి కంది శ్రీనివాస్, గని ఫిట్ కార్యదర్శి గాండ్ల సంపత్,నాయకులు గుమ్మడి సంపత్, జవ్వాజి శ్రీనివాస్, మారం రాజు, తేజావత్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.