మందమర్రి, నేటిధాత్రి:-
పట్టణంలోని సింగరేణి ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా నిర్వహించిన పాఠశాల 49వ వార్షికోత్సవ వేడుకలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏరియా జిఎం ఏ మనోహర్, సింగరేణి సేవాసమితి ఏరియా అధ్యక్షురాలు ఏ సవిత మనోహర్, ఏరియా ఎస్ఓటు జిఎం ఏ రాజేశ్వర్ రెడ్డి, పాఠశాల కరస్పాండెంట్, ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్ లు హాజరై, ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఏరియా జిఎం ఏ మనోహర్ మాట్లాడుతూ, సింగరేణి కార్మికుల సంక్షేమానికి యాజమాన్యం ఎంతగానో కృషి చేస్తుందని తెలిపారు. సింగరేణి కార్మికులతో పాటు చుట్టుపక్కల గ్రామాల పిల్లలకు ఉన్నతమైన విద్యను అందించేందుకు సింగరేణి యాజమాన్యం పాఠశాలను నెలకొల్పి నిర్వహిస్తుందని తెలిపారు. ఈ పాఠశాల విద్యను అభ్యసించిన ఎంతోమంది విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగారని, వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క విద్యార్థి కష్టపడి చదివి, జీవితంలో పైకి ఎదిగి సింగరేణి సంస్థకు పట్టణానికి, పాఠశాలకు, వారి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఎంతో ఘనత చరిత్ర కలిగిన పాఠశాల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని, ఇదేవిధంగా ముందుకు సాగుతూ, మరింత మంది విద్యార్థులకు దారి చూపించి, వారిని ప్రయోజకులు చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జె పురుషోత్తం, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.