ఇంటర్మీడియట్ పరీక్షలకు సర్వం సిద్ధం

మందమర్రి, నేటిధాత్రి:-

ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం నుండి ప్రారంభం కానుండడంతో పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం నుండి మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభం అవుతుండగా గురువారం నుండి ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. బుధవారం నుండి మార్చి 19వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని పరీక్షా కేంద్రాల వద్ద అవసరమైన తాగునీరు అందుబాటులో ఉంచారు. పట్టణంలో ప్రభుత్వ ఆదర్శ (మోడల్) పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల రెండు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. బుధవారం నిర్వహించూ మొదటి సంవత్సరం పరీక్షకు మోడల్ స్కూల్ 289, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 322మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు. కాగా పరీక్షా కేంద్రాలలోకి మొబైల్ ఫోన్లు, క్యాలిక్ లేటర్లు, వాచెస్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకువెళ్లేందుకు అనుమతి లేదని, పరీక్ష ప్యాడ్, పెన్నులు, హాల్ టికెట్ తో మాత్రమే పరీక్షకు హాజరు కావాలని సూచించారు. ఇన్విజిలేటర్లు, ఇతర పరీక్షల అధికారులకు సైతం ఇది వర్తిస్తుందని పరీక్ష నిర్వహణ అధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రాలకు కనీసం అర్ధగంట ముందుగా చేరుకోవాలని, ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా లోనికి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. ఇంటర్ పరీక్షలు జరిగే కేంద్రాల వద్ద 144 సెక్షన్ ను అమలులో ఉంచారు. అదేవిధంగా సమీపంలోని జిరాక్స్ సెంటర్ లను పరీక్ష ముగిసే వరకు మూసి వేయాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా మోడల్ పాఠశాల పరీక్ష కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్ గా ఆ పాఠశాల ప్రిన్సిపల్ కేంద్రానికి జయకృష్ణారెడ్డి, ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్ గా ఆ కళాశాల ప్రిన్సిపల్ కృష్ణయ్య నియమితులయ్యారు. బుధవారం ఆయా పరీక్ష కేంద్రాలను అధికారులు పరిశీలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!