కెవిపిఎస్ నేత జిన్నా లచ్చయ్య
మరిపెడ నేటి ధాత్రి.
మహాత్మా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనుల పెండింగ్ బిల్లు ల ను వెంటనే చెల్లించాలని కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) మహబూబాద్ జిల్లా ఉపాధ్యక్షులు జిన్నా లచ్చయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం అబ్బాయి పాలెం గ్రామంలో కొమ్ముకుంట రాళ్ల దగ్గర జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఆయన పరిశీలించారు. ఉపాధి కూలీలతో మాట్లాడగా గత సంవత్సరం చేసిన పనులకు బిల్లులు రాలేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారనీ లచ్చయ్య పేర్కొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఉపాధి కూలీలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. గత బడ్జెట్ లో 80 వేలకోట్లు కేటాయించగా, ఈ సంవత్సరం బడ్జెట్ లో కేవలం 60 వేల కోట్లు మాత్రమే కేటాయించడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఉపాధి కూలీలకు రావలసిన బిల్లులను సకాలంలో చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తుందని కేంద్ర ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. అంతేగాక మున్సిపాలిటీ కేంద్రంలో ఉన్న కూలీలు ఇప్పటికే పనులు లేకుండా నష్టపోగ, గ్రామీణ ప్రాంతకూలీలకు రావలసిన నిధులను వారికి రాకుండా దారి మళ్లిస్తుందని ఆరోపించారు. పెరుగుతున్న ధరలకు అనుకూలంగా 200 రోజుకు పని దినాలు పెంచాలని, రోజుకు 267 దినసరి కూలి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ 2005 లో వామపక్షాల సహకారంతో ఆనాటి యూపీఏ ప్రభుత్వంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ఈ చట్టాన్ని తీసుకురాగా ,ఆ చట్టానికి తూట్లు పొడుస్తూ బిజెపి ప్రభుత్వం నిధులను ఇతర రంగాలకు దారి మళ్ళిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోపక్క వ్యవసాయ రంగం సంక్షోభంలో నెట్టు వేయగా రియల్ ఎస్టేట్ వ్యాపారంతో వ్యవసాయ భూములన్నీ వ్యాపార కేంద్రాలుగా మారాయాన్నారు. సంవత్సరానికి సరిపోను పనులు లేక కూలీలు ఇతర ప్రాంతాలకు వలసలు పోతున్న పరిస్థితి నెలకొందన్నారు. ఉపాధి కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించాలని, వారికి రావలసిన గడ్డపార, పారా, తట్టలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బి సంధ్య, అర్ శోభారాణి, కౌసల్య, ఊరుకొండ వెంకన్న, అలవాల సీతారాములు, జినక కృష్ణమూర్తి, సువార్త, కత్తుల మహేష్ ఎల్లమ్మ, కోల మన్సూర్, తోపాటు వందలాది మంది కూలీలు పాల్గొన్నారు.