# మోడీ ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే పతనం తప్పదు
# ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్
నర్సంపేట,నేటిధాత్రి :
చారిత్రాత్మక ఢిల్లీ రైతాంగ ఉద్యమానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని చలో ఢిల్లీకి తరలిన వేలాదిమంది రైతులను ముళ్ళకంచెలతో అడ్డుకొని నానా బీభత్సం సృష్టించి నియంతృత్వంగా వ్యవహరిస్తున్న మోడీ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని ఏఐకెఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ హెచ్చరించారు. నర్సంపేట ముఖ్య కార్యకర్తల సమావేశం కేశెట్టి సదానందం అధ్యక్షతన స్థానిక ఓంకార్ భవన్ లో జరిగింది. ఈ సందర్భంగా పెద్దారపు రమేష్ మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం భారత వ్యవసాయ రంగాన్ని దివాలా తీయించి విదేశీ పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి మూడు నల్ల చట్టాలను రూపొందించిందని ఈ క్రమంలో వన్ నేషన్ వన్ మార్కెట్ అంటూ ప్రభుత్వ మార్కెట్లకు పోటీగా ప్రైవేటు మార్కెట్లకు అనుమతించి రైతుల పంటలను దోచుకోవడానికి సిద్ధమయ్యారని అన్నారు. అలాగే సన్న చిన్న కారు రైతులకు భూమి లేకుండా చేసి కూలీలుగా మార్చేందుకు కార్పొరేట్ శక్తులకు కట్టు బానిసలను చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుందని ఈ క్రమంలో ఆదాని అంబానీలకు ఇచ్చిన రాయితీలు సబ్సిడీలు పేద రైతులకు ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దుచేసి రైతులు పండించిన పంటలకు మద్దతు ధర చట్టాన్ని చేయాలని సంవత్సరం పైగా రైతాంగం ఢిల్లీ సరిహద్దుల్లో చారిత్రాత్మక ఉద్యమం చేపడితే దిగివచ్చిన ప్రభుత్వం హామీలు ఇచ్చి మూడు సంవత్సరాలు కావస్తున్న నేటికీ అమలు చేయకపోవడం వారి చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు. పైగా రామ మందిరం నిర్మాణం పేరుతో రాజకీయాలు చేస్తూ మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ ఎన్నికల లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్న మోడీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని దఫ దఫాలుగా పోరాడుతున్న రైతులపై నిర్బంధాన్ని ప్రయోగించి ప్రశ్నించే హక్కు లేకుండా అణిచివేస్తున్నదని ఈ క్రమంలో చలో ఢిల్లీకి తరలిన వేలాది మంది రైతులపై విచక్షణారహితంగా లాఠీ చార్జీలు జరిపి ముళ్లకంచెలు భాష్పావాయివులు మేకులు కాంక్రీట్ దిమ్మలు ఇసుక సంచులు భారీకేడ్లను ఏర్పాటుచేసి 144 సెక్షన్ ప్రయోగించి జాతీయ రహదారులను మూసివేసి నియంతృత్వానికి నిదర్శనంగా మోడీ ప్రభుత్వం నిలుస్తున్నదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానికి రైతాంగంపై చిత్తశుద్ధి ఉన్నా కనీస మద్దతు ధర చట్టాన్ని, రుణమాఫీ, పింఛన్లు రైతు ఉద్యమంలో చనిపోయిన కుటుంబాలకు ఉద్యోగాలు, గాయాలైన వారికి పది లక్షల రూపాయలు ఇచ్చి రైతు వ్యతిరేక చట్టాల రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రైతాంగానికి అండగా పెద్ద ఎత్తున ఉద్యమం ఉదృతం అవుతుందని బిజెపి మోడీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం హెచ్చరించారు.
రైతులపై జరిగిన అమానుష దాడులకు నిరసనగా ఎక్కడికక్కడ ఆందోళన చేపట్టాలని ఈనెల 16న జరిగే దేశవ్యాప్త గ్రామీణ బంద్ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో సీనియర్ నాయకులు నాగేల్లి కొమురయ్య, డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి, రైతు సంఘం నాయకులు శివకుమార్, రాజన్న, ప్రభు, యాదగిరి, సురేష్, సదానందం, రమేష్, కోటి తదితరులు పాల్గొన్నారు.