ఫిబ్రవరి 11న ఉమ్మడి వరంగల్ జిల్లా రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం

నేటిధాత్రి, వరంగల్

తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్, (టీజీటీఏ) ఆధ్వర్యంలో, ఉమ్మడి వరంగల్ జిల్లా రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం గూర్చి శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో, టీజీటీఏ సంఘం ప్రతినిధులు బండి నాగేశ్వరరావు, మహమ్మద్ ఇక్బాల్ కె.విక్రమ్ కుమార్ ఉమ్మడి వరంగల్ జిల్లా రెవెన్యూ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ, మిత్రులారా, ఎన్నో ఉద్యమాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. స్వరాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన చేసి నాటి పాలకుల మెప్పు పొందాం. కానీ అదే పాలకులు మనల్ని, మన రెవెన్యూ శాఖను ప్రజలకు దూరం చేసే విధానాలను చూశాం. చిన్నా భిన్నమైన మనమంతా ఆత్మీయంగా కలుసుకొని మాట్లాడుకోవాల్సిన సందర్భం ఏర్పడింది అని అన్నారు. కొత్త రెవెన్యూ చట్టం అంటూ సర్దుబాటు, సర్వీసు క్రమబద్ధీకరణ పేర్లతో క్షేత్రస్థాయిలో పని చేసే ఉద్యోగులను రెవెన్యూ శాఖకు దూరం చేసిన విషయం తెలిసిందే అని, ఇలాంటి పరిస్థితుల్లో దెబ్బ తిన్న మన మనోభావాలను, మిగతా వారిలో ఉన్న ఆందోళనను, నష్టపోయిన ‘పే, సర్వీస్ ప్రొటెక్షన్, కోల్పోయిన పదోన్నతులు, వివిధ హోదాలలో రెవెన్యూ శాఖలోనే కొనసాగుతూ నిత్యం ఎదుర్కొంటున్న ఇబ్బందులు, బాధలను, ఇతర సమస్యలపై మాట్లాడుకుందాం అని, చెట్టుకొకరు, పుట్టకొకరమైనా రెవెన్యూ కుటుంబ సభ్యులను, ఉద్యోగ సంఘాలను ఏకతాటిపైకి తెద్దాం అని, ఉద్యోగులలో భరోసాను నింపుదాం అని పిలుపునిచ్చారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఉమ్మడి వరంగల్ రెవెన్యూ విభాగంలోని అన్ని ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొననున్నారు అని తెలిపారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఉమ్మడి ముఖ్య అతిథులుగా రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ చైర్మన్, డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, టీజీటీఏ వ్యవస్థాపక అధ్యక్షులు వి.లచ్చిరెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారని తెలిపారు. ఫిబ్రవరి 11న భీమారంలోని “కేఎల్ఎన్” కన్వెన్షన్ లో ఉదయం 11గంటలకు ప్రారంభం కానుంది అని, ప్రతి ఒక్క రెవెన్యూ ఉద్యోగి పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!