
జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి :
జమ్మికుంట పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలోని 688 సర్వే నెంబర్ లో అక్రమ కట్టడాలతో పాటు అక్రమణకు గురైన స్థలాన్ని వరంగల్ హౌసింగ్ బోర్డ్ డిప్యూటీ ఈఈ రవిప్రసాద్, ఏఈ పృథ్వీరాజులు శుక్రవారం పరిశీలించారు. హౌసింగ్ బోర్డ్ కు సంబంధించిన స్థలం తమదే అంటూ మున్సిపల్ అధికారులు పాతిపెట్టిన బోర్డులను తొలగించారు. ఈ సందర్భంగా హోసింగ్ బోర్డు డిఈఈ రవిప్రసాద్ మాట్లాడుతూ, హౌసింగ్ బోర్డ్ మొత్తం స్థలం 11 ఎకరాల 36 గుంటలు ఉందని. ఇందులో మున్సిపాలిటీకి ఎకరం ఆరు గుంటల స్థలాన్ని అప్పగించడం జరిగిందన్నారు. ఎంఐజి గృహాలకు 24, ఎల్ఐజి ఒకటి, 111 ఎల్ఐజి రెండు 38 గా స్థలాలను రోడ్డు మరియు డ్రైనేజీలతో కలిపి కేటాయించడం జరిగిందన్నారు. ప్రస్తుతం హౌసింగ్ బోర్డ్‌లో ఉన్న స్థలంలో కొంత మంది ఆక్రమించుకొని గృహాలు నిర్మించుకున్నారని. వాటి వివరాలను మొత్తం సేకరించి నివేదిక ఉన్నతాధికారులకు అప్పగిస్తామని. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు చేపడతామని అన్నారు. మున్సిపాలిటీకి కేటాయించిన స్థలంలో పలుచోట్ల అక్రమణకు గురైందని. అయినప్పటికీ వారు పట్టించుకోలేదని పేర్కొన్నారు. హౌసింగ్ బోర్డ్ స్థలాన్ని ఎవరైనా ఆక్రమించి, గృహలు నిర్మించినట్లయితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.