
లక్కీ డ్రా ద్వారా కుల సంఘాలకు భవనాలు అప్పగింత….
మిగిలిన కుల సంఘాలకు నిర్మించి ఇస్తామని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హామీ….
నేటిధాత్రి కమలాపూర్ (హన్మకొండ)కేసిఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కులాలకు సమాన ప్రాధాన్యత ఇచ్చారని హుజురాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.మంగళవారం హుజరాబాద్ నియోజకవర్గం లోని కమలాపూర్ లో కుల సంఘాలకు గత ప్రభుత్వ హయాములో నిర్మించి,ప్రారంభించిన భవనాలను లక్కీ డ్రా ద్వారా అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన మాట ప్రకారమే నియోజకవర్గంలోని దాదాపు అన్ని మండలాల్లో కుల సంఘాల భవనాలు కట్టించారని అన్నారు. కుల సంఘాల భవనాలను గతంలోనే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభోత్సవం చేశారని, కుల సంఘాల భవనాల కేటాయింపులో ఎలాంటి తారతమ్యం ఉండకుండా చూసేందుకే లక్కీ డ్రా నిర్వహించామన్నారు. ఇందులో భాగంగా మహిళా సంఘం భవనానికి కూడా శంకుస్థాపన చేశారు. వీటితోపాటు మరికొన్ని కులాల కోసం మరో పది కుల సంఘాల భవనాలు కూడా కట్టిస్తానని హామీ ఇచ్చారు. కుల భవనాల నిర్మాణాల కోసం కోటి 20 లక్షలు వెచ్చించామని అన్నారు. కమలాపూర్ లోని 10 కుల సంఘాల భవనాలను లక్కీ డ్రా తీయగా వరుసగా ట్రాలీ ఆటో, కమ్మరి, హమాలి, ఆర్ఎంపి, చాకలి, శ్రీ కంఠ మహేశ్వర కళామండలి, కురుమ,గొల్ల, విశ్వబ్రాహ్మణ,ఎస్టి కుల భవనాలు ఎంపిక చేశారు. కుల భవనాలను ప్రతి ఒక్క కులస్తులు సరిగా వినియోగించుకోవాలని అన్నారు. వారికి వారి కులాల వారీగా కులాల అభివృద్ధి కోసం సమస్యల పరిష్కారం కోసం వేదికగా వీటిని ఉపయోగించుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో కమలాపూర్ సర్పంచ్ విజయ తిరుపతిరెడ్డి, సీనియర్ నాయకుడు సత్యనారాయణ రావు, చంద్రరెడ్డి ,వైస్ ఎంపీపీ అశోక్, ఉప సర్పంచ్ మోటం రమేష్, వివిధ కుల సంఘాల అధ్యక్షులు నాయకులతోపాటు బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో పాటు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.