ఆగస్ట్15 నాడు జెండా “ఎగరవేయడం”.. జనవరి 26న జెండా “ఆవిష్కరణ”కు తేడా ఏంటో తెలుసా.?
ఆగస్టు 15, 1947న స్వేచ్ఛావాయువులు పీల్చుతూ “భారతదేశం స్వాతంత్య్రం” పొందింది. అందుకే, ఏటా ఈ తేదీన స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. దేశవ్యాప్తంగా జెండా ఎగురవేసి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు.
ఇక.., 1950 జనవరి 26న దేశంలో రాజ్యాంగం అమలులోకి రావడంవల్ల.., ఏటా ఈ తేదీని “గణతంత్ర దినోత్సవం”గా జరుపుకుంటాం. దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి ఘనంగా వేడుకలు నిర్వహించుకుంటాం.
1950 జనవరి 26న, భారత ప్రభుత్వ చట్టానికి (1935) బదులు, భారత రాజ్యాంగం దేశపరిపాలనకు మార్చడాన్ని భారత గణతంత్ర దినోత్సవం అంటారు..
భారత రాజ్యాంగ సభలో 1949 నవంబరు 26న రాజ్యాంగం ఆమోదం పొందగా, భారతదేశం స్వతంత్ర గణతంత్రంగా ఆవిర్భవించేందుకు 1950 జనవరి 26లో దీనిని ఒక ప్రజాతంత్ర పరిపాలన పద్ధతితో పాటుగా అమలులోకి తీసుకురావాలని నిర్ణయించారు.
ఆగస్టు 15న జెండా ఎగరవేయడానికి, జనవరి 26న జెండా ఆవిష్కరించడానికి మధ్య చిన్న తేడా ఉంది. అదేంటో కూడా తెలుసుకుందాము.
ప్రతి సంవత్సరం ఆగస్టు 15న దేశ ప్రధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగురవేస్తారు. ఈ క్రమంలో జాతీయ పతాకాన్ని స్తంభం దిగువన కడతారు. బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం స్వాతంత్య్రాన్ని పొందిందని సూచించడానికి త్రివర్ణ పతాకాన్ని పైకి లాగుతారు. (మొదటి స్వాతంత్య్ర దినోత్సవం రోజున బ్రిటిష్ దేశ జెండాను కిందకు దింపుతూ మన దేశ జెండాను పైకి ఎగురవేశారు. స్వాతంత్య్రం వచ్చిందని తెలియజేయడానికి ఇలా త్రివర్ణ పతాకాన్ని పైకి లాగి ఎగురవేస్తారు. ఇది కొత్త దేశ ఆవిర్భావానికి ప్రతీకగా నిలుస్తుంది.)
గణతంత్ర దినోత్సవమైన జనవరి 26న “రాష్ట్రపతి” జెండాను ఆవిష్కరిస్తారు. త్రివర్ణ పతాకాన్ని ముందే పైభాగంలో కట్టి, ఆ తర్వాత విప్పుతారు. ఇలా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం ద్వారా ఇప్పటికే దేశం భారతదేశ రాజ్యాంగం అమలులోకి వచ్చి స్వతంత్రంగా ఉందని తెలియజేస్తారు.
( గమనిక: జనవరి 26న జెండాను ముందే కర్ర/పోల్ పైన కట్టి ఉంచుతాము. కాబట్టి ఆగస్ట్15 మాదిరి జెండాను కింది నుండి పైకి లాగము అనేది గమనించాలి).
దేశ పౌరుల ప్రతినిధి, భారత పార్లమెంటుకు ప్రజలచే నేరుగా ఎన్నికైన దేశ ప్రధాని స్వాతంత్ర్య దినోత్సవం రోజున జెండా ఎగురవేయడానికి.. గణతంత్ర దినోత్సవం నాడు రాష్ట్రపతి జెండాను ఆవిష్కరించడానికి ఓ కారణం ఉంది.
స్వాతంత్ర్యం వచ్చిన సమయానికి భారత రాజ్యాంగం అమల్లోకి రాలేదు. అప్పటికి రాజ్యాంగాధిపతి అయిన రాష్ట్రపతి పదవి చేపట్టలేదు. దీంతో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26న రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి మహోన్నత జెండాను ఆవిష్కరిస్తారు.
ఇక్కడ మరో వ్యత్యాసం ఏమిటంటే..
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి జెండాను ఎగురవేస్తారు (Flag Hoisting)..
గణతంత్ర దినోత్సవం నాడు రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు (Flag Unfurling).
ఇంకొక వ్యత్యాసం ఏమిటంటే, స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశ రాజధాని ఢిల్లీలో రెండు వేర్వేరు ప్రదేశాల్లో జరుగుతాయి.
స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్ట్ 15న జెండా ఎగురవేసే కార్యక్రమం ఎర్రకోటలో..,
రిపబ్లిక్ డే జనవరి 26న కర్తవ్యపథ్ (రాజ్ పథ్) లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది.
కనీసం ఇప్పటి పిల్లలు, విద్యార్థులకు మనవంతు బాధ్యతగా తెలియజేద్దాం. వివిధ పత్రికలు, చానల్స్ లో పనిచేసే మిత్రులకు సైతం ఎంతో ఉపయోగకరం.
భారత్ మాతాకీ జై.. 👍🇮🇳🇮🇳