ఇండియన్ పోలీస్ మెడల్ కు ఎంపికైన పింగళి నరేష్ రెడ్డి

ప్రతిభకు పట్టం..!

మల్కాజిగిరి ఏసిపి గా విధులు…

నేటిధాత్రి కమలాపూర్ (హన్మకొండ)ముక్కుసూటితనం ఆయన నైజం..
నేరస్తులకు ఆయన పేరే సింహ స్వప్నం..
దగ్గర ఉండి మరీ మిస్టరీలను ఛేదించడం..
సిబ్బందిని క్రమశిక్షణ బాటలో నడిపించడం..
సమస్య అంటూ తన దగ్గరకు వచ్చే సామాన్యులకు స్వాంతన అవ్వడం…
ఇవన్నీ కలిసాయంటే ఆయనే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్.. పింగళి నరేష్ రెడ్డి.

ఎక్కడ పనిచేసినా తన పనితీరుతో అటు పోలీస్ శాఖలోనూ.. ఇటు సామాన్య ప్రజల గుండెల్లోనూ సుస్థిర స్థానం సంపాదించుకున్నారు ఆయన.

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం వంగపల్లి గ్రామంలో పింగళి పురుషోత్తం రెడ్డి – వసుమతి దంపతులకు జన్మించారు నరేష్ రెడ్డి. అందరికీ ఒక్క అమ్మా, నాన్న ప్రేమ దొరికితే.. తాను పింగిళి సుదర్శన్ రెడ్డి- పద్మావతి దంపతులకు దత్తపుత్రుడై ఇద్దరు అమ్మల, ఇద్దరు నాన్నల ప్రేమను అందిపుచ్చుకున్నారు.

ప్రాథమిక, ఉన్నత విద్యలను వంగపల్లి, జమ్మికుంట హనుమకొండ లలో పూర్తి చేసారు.

సమాజంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకోవాలని పోలీస్ శాఖ పై మక్కువతో 1991 జూలై 15న సబ్ ఇన్స్పెక్టర్ గా ఎంపికయ్యారు పింగళి నరేష్ రెడ్డి.

1993లో హైదరాబాద్ వాస్తవ్యురాలు వీణ గారిని వివాహమాడారు నరేష్ రెడ్డి.
ఈ దంపతులకు కుమార్తె నివేదిత, కుమారుడు ఆకాష్ ఆణిముత్యాలు లాంటి ఇద్దరు పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులకు తగ్గ తనయ, తనయులుగా పేరు తెచ్చుకున్నారు పిల్లలు..కుమార్తె నివేదిత హైదరాబాదులో డాక్టర్ గా సేవలందిస్తుండగా.. కుమారుడు ఆశిష్ యుఎస్ లో ఎంఎస్ చేస్తున్నారు.

సమాజ సేవలో నూ ముందున్న పింగళి కుటుంబం..
వ్యవసాయ కుటుంబ నేపథ్యం కలిగిన పింగళి కుటుంబం సమాజ సేవలోనూ.. రాజకీయంగానూ.. ఎప్పుడూ ముందే ఉంటుంది.. పింగళి నరేష్ రెడ్డి గారి తండ్రి 25 సంవత్సరాల పాటు సర్పంచ్ గా తన ఊరికి సేవలందించారు..
పింగళి బ్రదర్స్ క్రీడలను ప్రోత్సహిస్తూ.. యువతను ముందుకు నడిపించారు. పింగళి రమేష్ రెడ్డి, పింగళి సురేష్ రెడ్డి, పింగళి నరేష్ రడ్డి లు క్రీడల పట్ల ఎంతో మక్కువతో క్రికెట్, అథ్లెటిక్స్ లో రాణించారు..
పింగళి నరేష్ రెడ్డి పనిచేసిన చోటల్లా క్రీడలను ప్రోత్సహించి.. క్రీడాకారులకు అండగా నిలిచారు..

ఉద్యోగ ప్రస్థానం..

పోలీస్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న అనంతరం ఖమ్మం జిల్లా కొనిజర్ల మండల SI గా మొదటి పోస్టింగ్ పొందారు పింగళి నరేష్ రెడ్డి..
అప్పటికే కొనిజర్ల మండలం లో రాజకీయ కక్షలు పురివిప్పుకొని హత్యలు ప్రతీకార హత్యలతో అట్టుడుకుతోoది. అలాంటి ఫ్యాక్షన్ పరిస్థితుల్లో మొదటి పోస్టింగ్ పొందిన పింగళి నరేష్ రెడ్డి తనదైన శైలిలో సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేసి శాంతి భద్రతల పరిరక్షణకు బాటలు వేశారు. ఆయన వచ్చిన అనతి కాలంలోనే మండలంలో మళ్లీ సామాన్య పరిస్థితులు ఏర్పడి శాంతిభద్రతలు అదుపులోకి తీసుకురావడానికి ఆయన చేసిన కృషి ఎనలేనిదని ఆ మండల ప్రజలు ఇప్పటికీ చెప్పుకుంటారు.

మణుగూరు,మోతుగూడెం, ఇల్లందు ప్రాంతాలలో నరేష్ రెడ్డి పనిచేసిన సమయంలో మావోయిస్టు కార్యకలాపాలు జోరుగా సాగుతుండేవి. ఇన్ఫార్మర్ల నెపంతో సామాన్యులను నక్సల్స్ మట్టు పెడుతుండడం, సామాన్య ప్రజా జీవనానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతుండడంతో అప్పట్లో ఆయన తీసుకున్న నిర్ణయాలు జిల్లా పోలీస్ శాఖ లోనే మార్పులు తీసుకొచ్చాయి. అన్నలు అడవి బాట వదిలి జనజీవన స్రవంతిలో కలిసేలా నరేష్ రెడ్డి చేసిన కృషి అభినందనీయం.
అశ్వరావుపేట లో పనిచేస్తున్న సమయంలో .. ఆ ప్రాంతంలో గిరిజన – గిరిజనేతర వర్గాలుగా విడిపోయి ప్రజలు సమస్యలు ఎదుర్కొంటుండగా ఆ ప్రాంతంలో లా అండ్ ఆర్డర్ ను చక్కదిద్దడంలో , స్థానికంగా నెలకొన్న సమస్యల పరిష్కారంలో నరేష్ రెడ్డి చూపిన ప్రతిభ స్థానికులను ఆకట్టుకోవడమే కాకుండా పోలీస్ అధికారుల అభినందనలు సైతం అందుకుంది.
ఇక ఖమ్మం వన్ టౌన్, త్రీ టౌన్, మధిర, సత్తుపల్లి, కూసుమంచి, ఖమ్మం రూరల్ ప్రాంతాల్లో నరేష్ రెడ్డి పనిచేసిన కాలంలో రౌడీయిజాన్ని కూకటి వేళ్లతో పెకిలించారు. సామాన్య ప్రజలపై దౌర్జన్యం చేసే ఆకు రౌడీల తాటతీస్తూ .. చండశాసనుడిగా పేరుగాంచారు. యువతులను, మహిళలను వేధించే ఆకతాయిల పనిబట్టారు.. ఈవ్ టీజింగ్ చేయాలంటే .. నరేష్ రెడ్డి పేరు చెబితే .ఒణికి పోయేలా కట్టడి చేశారు.

సీఐగా మహబూబాబాద్ లో పనిచేస్తున్న సమయంలో తెలంగాణ ఉద్యమం ఎగిసిపడుతోంది.. స్వరాష్ట్రం సాధించాలని సకల జనులు సమ్మె బాట పట్టగా.. ఉద్యమ సమయంలోను తన విధి నిర్వహణలో ఎక్కడ తొనకకుండా తన విధులు నిర్వర్తించారు నరేష్ రెడ్డి..

ఖమ్మం ట్రాఫిక్ సిఐ గా నరేష్ రెడ్డి పనిచేసిన కాలంలో.. ఎన్నో నూతన మార్పులకు శ్రీకారం చుట్టారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఆయన తీసుకున్న చర్యలు స్ఫూర్తిదాయకం.. సీసీ కెమెరాల ఏర్పాటు, డ్రంక్ అండ్ డ్రైవ్ నిరంతర తనిఖీలు, వివిధ వర్గాలకు అవగాహన కార్యక్రమాలు.. యూటర్న్లు , ఫ్రీ లెఫ్ట్ లు ఏర్పాటుచేసి ఖమ్మంను ట్రాఫిక్ ఫ్రీ జోన్ గా మార్చేందుకు ఆయన చేసిన కృషి ఎనలేనిది.

ACP బేగంపేట గా పనిచేస్తున్న కాలంలో..

కరోనా విస్తృత రూపం దాల్చడం తో.. ఎంతో మంది రోగులు గాంధీ ఆసుపత్రిలో సేవల కోసం వస్తుండడంతో.. కరోనా నువ్వు సైతం లెక్కచేయకుండా.. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం కోసం ఆయన చూపిన తెగువ, ధైర్యం ప్రతి ఒక్కరికి ఆదర్శం. బస్సులు, ట్రైన్లు రద్దు అయిపోయి సామాన్య ప్రజలు తమ సొంత ఊర్లకు వెళ్లేందుకు నానా తంటాలు పడుతుండగా .. వలస కార్మికుల కు అండగా నిలిచారు నరేష్ రెడ్డి. వారిని తమ సొంత ఊర్లకు తరలించడంలో ఆయన ఎంతో కృషి చేశారు.
CID, ఇంటిలిజెన్స్, హ్యూమన్ రైట్స్ లలో పనిచేసిన కాలంలోనూ నరేష్ రెడ్డి ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు.

పోలీస్ శాఖలో నిజాయితీ, నిబద్ధత, సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు పింగళి నరేష్ రెడ్డి. ఆయన దర్యాప్తు చేపట్టిన మర్డర్, రేప్ కేసులలో 15 కేసుల్లో ముద్దాయిలకు యావజ్జీవ కారాగార శిక్ష లు విధించాయి న్యాయస్థానాలు.
పనితీరుకు ప్రత్యేక నిదర్శనాలు …
ఇప్పటి వరకు ఎన్నో సేవా పథకాలు ఆయనను వరించాయి….ప్రస్తుతం
1999 లో – సేవా పతకం.
2010 లో – ఉత్తమ సేవా పతకం.
2019 లో – మహోన్నత సేవా పతకం.
2024.- ఇండియన్ పోలీస్ మెడల్. ను సాధించారు.
ఇంకా ఎన్నో రివార్డులు, అవార్డులు ఆయన సొంతం.
పని చేసిన చోటల్లా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోవడమే కాకుండా.. పోలీస్ శాఖ ప్రతిష్టను ఇనుమడింపజేశారు నరేష్ రెడ్డి… అధికారంలో ఏ పార్టీ ఉన్నా.. తాను ఎక్కడ పని చేసినా… రాజకీయాలకు అతీతంగానే.. తాను విధులు నిర్వర్తిస్తూ.. వివాద రహితుడిగా పేరు తెచ్చుకున్న.. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పింగళి నరేష్ రెడ్డికి ఆయన చేసిన సేవలకు గాను నేడు ఇండియన్ పోలీస్ మెడల్ అందుకోవడం అందరికీ గర్వకారణం.మండల వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *