భూపాలపల్లి నేటి ధాత్రి
నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాను..
గణపురం చెరువును టూరిజం స్పాట్ గా అభివృద్ధి పరిచి, మండల కేంద్రంలో ప్రధాన రోడ్డు వెంట సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు కృషి చేస్తా..
– ఇచ్చిన హామీలన్నింటినీ తప్పక అమలు చేస్తాను..
– కాంగ్రెస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాను..
– వేలాదిమంది కాంగ్రెస్ కార్యకర్తలు నడుమ బుద్ధారం గ్రామం నుండి భూపాలపల్లి వరకు సాగిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు విజయోత్సవ(కృతజ్ఞత) ర్యాలీ..
-బుద్ధారం, వెలుతుర్లపల్లి క్రాస్ రోడ్డు, గణపురం మండల కేంద్రం, బుర్రకాయలగూడెం, గాంధీనగర్, కర్కపల్లి, లక్ష్మారెడ్డిపల్లి, మొరంచపల్లి, చెల్పూర్, మంజూర్ నగర్, జయశంకర్ సార్ విగ్రహం, అంబేద్కర్ సెంటర్ మీదుగా సాగిన విజయోత్సవ ర్యాలీ..
అనంతరం పట్టణంలోని భారత్ ఫంక్షన్ హాల్లో సాగిన సన్మాన సభ.
భూపాలపల్లి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో నన్ను గెలిపించిన నియోజకవర్గ ప్రజలందరికీ రుణపడి ఉంటానని భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యేగా శాసనసభ మందిరంలో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మొట్ట మొదటిసారిగా (సోమవారం) నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.
ఉదయం హైదరాబాదు నుండి రోడ్డు మార్గాన బయలుదేరి వారి స్వగ్రామమైన గణపురం మండలం బుద్ధారం గ్రామానికి చేరుకొని, గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విజయోత్సవ ర్యాలీ ప్రారంభం కాగా, అదే గ్రామానికి చెందిన లింగంపల్లి వేణు గోపాల్ రావు ఏర్పాటు చేసిన భారీ గజమాలను క్రేన్ సహాయంతో ఎమ్మెల్యే సత్యనారాయణ రావుకు వేశారు. అనంతరం భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానుల నడుమ విజయోత్సవ ర్యాలీ బుద్ధారం, వెలుతుర్లపల్లి క్రాస్ రోడ్డు, గణపురం మండల కేంద్రం, బుర్రకాయలగూడెం, గాంధీనగర్, కర్కపల్లి, లక్ష్మారెడ్డిపల్లి, మొరంచపల్లి, చెల్పూర్, మంజూర్ నగర్, జయశంకర్ సార్ విగ్రహం, అంబేద్కర్ సెంటర్ మీదుగా భారత్ ఫంక్షన్ హాల్ వరకు విజయోత్సవ ర్యాలీ సాగింది. గణపురం మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు. ఈ ర్యాలీ మధ్యలో గణపురం మండల కేంద్రం, చెల్పూర్ బస్టాండ్ సెంటర్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ.. ఎన్నికల్లో నాకు ఓటేసి అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపించిన నియోజకవర్గ ప్రజలందరికీ నా జీవితంలో రుణపడి ఉంటానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరిని కంటికి రెప్పలా కాపాడుకుంటానని అన్నారు. కాకతీయులు నిర్మించిన గణపురం చెరువును టూరిజం స్పాట్ గా అభివృద్ధి పరిచి, మండల కేంద్రంలో ప్రధాన రోడ్డు వెంట డివైడర్ ఏర్పాటుచేసి, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు కృషి చేస్తనని హామీ ఇచ్చారు. నియోజకవర్గ ప్రజలకు వారంలో ఒకరోజు బుధవారం రోజున ఉదయం నుండి రాత్రి వరకు క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉంటానని, నేరుగా కలిసి తమ సమస్యలు చెప్పాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నింటినీ భూపాలపల్లి నియోజకవర్గంలో తప్పక అమలు చేస్తానని అన్నారు. ఈ విజయోత్సవ ర్యాలీలో డిసిసి ప్రెసిడెంట్ అయిత ప్రకాష్ రెడ్డి, గణపురం, భూపాలపల్లి పట్టణ, రూరల్ అధ్యక్షులు రేపాక రాజేందర్, ఇస్లావత్ దేవన్, సుంకరి రామచంద్రయ్య, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కటంగూరి రామ్ నర్సింహారెడ్డి, ఎన్ఎస్ఆర్ సంపత్ రావు, రాష్ట్ర అధికార ప్రతినిధి గాజర్ల అశోక్, వైయస్సార్టీపీ జిల్లా అధ్యక్షుడు అప్పం కిషన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గండ్ర సత్యనారాయణరెడ్డి, సూరినేని తిరుమల్ రావులతో పాటు వివిధ మండలాల అధ్యక్షులు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.