
*బలంగా ఉన్న కుటుంబం బి.ఆర్.ఎస్ పార్టీ కుటుంబం
*ఐదు రోజులు మీరు నా కోసం కష్టపడండి…ఐదేండ్లు నేను మీ కోసం కష్టపడుతా
*26న జరగనున్న సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేసేందుకు కృషి చేయండి
*బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు
వేములవాడ, నేటి ధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బి.ఆర్.ఎస్ పార్టీ గెలుపును, కారు జోరును ఎవరు ఆపలేరని బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు అన్నారు. శుక్రవారం వేములవాడ పట్టణంలోని సంగీత నిలయంలో నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో సీఎం కేసీఆర్ పర్యటన విజయవంతం చేసే పలు అంశాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే రమేష్ బాబులతో పాటు చల్మెడ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బి.ఆర్.ఎస్ పార్టీ బలంగా ఉన్న ఒక కుటుంబం అని, ఎన్నికల్లో పార్టీ కుటుంబ సభ్యులంతా కలసి కారు గుర్తు గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. వచ్చే 5రోజులు మీరు నా కోసం కష్టపడితే 5ఏండ్లు నేను మీ కోసం కష్టపడతానని హామీ ఇచ్చారు. ఈ నెల 26న వేములవాడ పట్టణంలో జరగనున్న సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని సూచించారు.