జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి :
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో గురువారం జిల్లా వ్యవసాయ అధికారిని పద్మావతి సిసిఐ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, పత్తి సీజన్ ప్రారంభమైన నేపద్యంలో రైతులు పత్తిని విక్రయించే సమయంలో ఇబ్బందులు తలెత్తకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం సిసిఐ కొనుగోల్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ప్రకటించిన 7020 రూపాయల మద్దతు ధరకు సిసిఐకి విక్రయించుకోవాల్సిన అవసరం ఉంటుందన్నారు. పత్తిని రైతులు సిసిఐకి విక్రయించే సమయంలో ఆధార్ కార్డు బ్యాంకుకు అనుసంధానం తప్పకుండ ఉండేలా చూసుకోవాలని ఈ సంధర్భంగా చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వ మద్ధతు ధర కంటే ఎక్కువ ధరను చెల్లిస్తూ ప్రవేట్ వ్యాపారులు కొనుగోలు చేస్తుండడంతో సిసిఐ కొనుగోళ్ళను చేపట్టడం లేదని. మద్దతు ధరకంటే తక్కువ ధర పలికిన సమయంలో సిసిఐ కొనుగోళ్ళు చెపట్టునట్లు చెప్పారు. సిసిఐకి విక్రయించే రైతులు 8 నుండి 12 శాతం తేమ ఉండేలా చూసుకోవాలని, పత్తి నాణ్యతతో తెస్తే సిసిఐ కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉంటుందన్నారు. అనంతరం జమ్మికుంట పాత వ్యవసాయ మార్కెట్లో పిఎసిఎస్ జమ్మికుంట అద్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, ప్రభుత్వం ఈ సంవత్సరం 2203 రూపాయలు గ్రేడ్. ఎ రకానికి, కామన్ రకానికి 2183 రూపాయలను చెల్లిస్తున్నట్లు చెప్పారు. రైతులు దళారులకు వడ్లను అమ్ముకోకుండ ప్రభుత్వం చెల్లిస్తున్న మద్దతు ధరకే విక్రయించాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి రెడ్డినాయక్, గ్రేడ్-టు కార్యదర్శి రాజు, సూపర్వైజర్లు యాకయ్య, లక్ష్మణ్, జూనియర్ సూపర్వైజర్ బాబా, సంఘ కార్యదర్శి వోట్టే రవీందర్, సెంటర్ ఇంచార్జ్ తిరుపతి, సంఘ సిబ్బంది దేవేందర్, అనిల్, లక్ష్మణ్, శ్రీనివాస్ రైతులు, వ్యాపారస్తులు ఆర్తిదారులు, హమలీలు, తదితరులు పాల్గొన్నారు.