హన్మాజీపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు
సైబర్ జాగరుక్త దివాస్ సందర్బంగా విద్యార్థుల కు సూచనలు -వేములవాడ రూరల్ సిఐ కృష్ణ ప్రసాద్!
వేములవాడ రూరల్ నేటి ధాత్రి
సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి, టెక్నాలజీని వాడుకొని నేరగాళ్లు ప్రజల డబ్బులు దోచుకుంటున్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇతర యాప్‌లు, లింకులు, ఈ మెయిల్స్‌తో హ్యాకర్లు మోసాలకు పాల్పడుతున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమై నేరాల నియంత్రణపై దృష్టిపెట్టారు. ప్రజలు, విద్యార్థులు, యువకులు వారి ఉచ్చులో పడకుండా విస్తృతంగా పోలీసులు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. నేడు వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రూరల్ సీఐ కృష్ణ ప్రసాద్ హాజరై మాట్లాడుతూ అనవసర లింక్‌లను క్లిక్ చేయడంతో కలిగే అనర్థాలు, నష్టాలపై వివరిస్తున్నారు. గుర్తుతెలియని, అపరిచిత వ్యక్తులతో ఫోన్‌కాల్స్, వాట్సాప్, ఫేస్‌బుక్, చాటింగ్‌కు దూరంగా ఉండాలని, ఓటీపీలు వస్తే ఎవరికీ చెప్పవద్దని సూచించారు.
సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలి, తస్మాత్ జాగ్రత్త అని పోలీసులు ప్రజలకు పదేపదే హెచ్చరిస్తుమని. అయినా కొందరు అమాయకులు వారి ఉచ్చులో పడి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. లాటరీలు, రివార్డులు, జాబ్స్, కమీషన్లు, డిస్కౌంట్ల పేరుతో సులభంగా డబ్బు సంపాదించుకోవచ్చని ప్రజలకు ఆశచూపి, నిలువునా ముంచుతున్నారు. బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నామని… ఆధార్ నంబర్ చెప్పండి… మీ మొబైల్‌కు వచ్చిన ఓటీపీ చెప్పండి… మీ ఏటీఎం పనిచేయడం లేదని… మీరు కారు గెలుచుకున్నారని, మనీ ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో… క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని… ఇలా రకరకాలుగా సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసగిస్తూ తెలియకుండానే డబ్బులు కాజేస్తున్నారు ఇలాంటి బారిన పడకూడదని వివరించారు.
కొత్త తరహా మోసాలు..
సైబర్ నేరగాళ్లు కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. వీటిపై విద్యాసంస్థలు, గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నాం. మొబైల్‌కు వచ్చిన లింక్‌లు, మెసేజ్‌లు చదవకుండా క్లిక్ చెయవద్దు. అనుకోకుండా బ్యాంక్ ఖాతా నుంచి డబ్బు పోతే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు డయల్ చేస్తే సంబంధిత అకౌంట్‌ను ఫ్రీజ్ చేస్తారు. పోలీసులను ఆశ్రయించాలి. అనవసర యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవద్దు. వాట్సాప్ నంబర్లకు వచ్చే మెసేజ్‌లు, సెల్‌ఫోన్‌కు వచ్చే మెసేజ్‌లు, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చే అనవసర లింకులు ఓపెన్ చేయొద్దు. ఆన్‌లైన్ మోసాలు, సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలి. ఆన్‌లైన్, సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడొద్దు.
తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు.
1930 టోల్ ఫ్రీ నంబర్
ఆన్‌లైన్ మోసాలే కాకుండా సైబర్ నేరాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వేములవాడ రూరల్ సీఐ కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు అవగాహనా కల్పించారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన వారు వెంటనే 1930 టోల్‌ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి, వివరాలు, తెలియజేస్తే 24గంటల్లో డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉందని పోలీసులు వివరిస్తున్నారు. సైబర్ నేరానికి గురైతే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని అన్నారు.
ఇవి పాటిస్తే మంచిది…
మొబైల్‌కు వచ్చిన ఓటీపీ ఎవరికీ చెప్పొద్దు. అనవసర సమయాల్లో ఇంటర్నెట్ ఆఫ్ చేయడం మంచిది. గుర్తుతెలియని వ్యక్తులు పంపిన లింకులను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయకూడదు. అధికారిక వెబ్‌సైట్లను మాత్రమే ఉపయోగించుకోవాలి. బహుమతులు, లాటరీలు గెల్చుకున్నారంటూ వచ్చే సందేశాలను గుడ్డిగా నమ్మవద్దు. వర్క్ ఫ్రం హోం ఉద్యోగం కల్పిస్తామని చెప్పే వారితో జాగ్రత్తగా ఉండాలి. బయటి ప్రాంతాల్లో ఉచిత వైఫై ఉపయోగించకపోవడం మంచిది. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత విషయాలు అప్‌లోడ్ చేయకపోవడం ఉత్తమం. గోప్యత పాటించాలని పోలీసులు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ వెంకట్రాజం, సైబర్ కానిస్టేబుల్ రాజశేఖర్, సతీష్ మరియు హోమ్ గార్డ్ మల్లేశం, ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు..