మందమర్రి, నేటిధాత్రి:-
దేశ ప్రగతికి అవరోధమైన అవినీతిని నిర్మూలించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సింగరేణి సంస్థ ఏరియా జిఎం ఏ మనోహర్ తెలిపారు. సోమవారం ఏరియా జిఎం కార్యాలయంలో నిర్వహించిన విజిలెన్స్ అవగాహన వారోత్సవాల కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర విజిలెన్స్ కమిషన్ ఆదేశాల మేరకు దేశంలోని అన్ని ప్రభుత్వరంగ సంస్థలలో అక్టోబర్ 30 నుండి నవంబర్ 5 వరకు విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు, అందులో భాగంగా సింగరేణి సంస్థలో సైతం అన్ని గనులు, విభాగాలలో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్నమన్నారు. కేంద్ర విజిలెన్స్ కమిషన్ ఆదేశానుసారం 1987 వ సంవత్సరం సింగరేణి సంస్థలో విజిలెన్స్ విభాగం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అవినీతి వ్యతిరేకంగా ఉద్యోగులందరినీ చైతన్యపరచి, దేశ ప్రగతికి అవరోధమైనా అవినీతి నిర్మూలనలో వారిని భాగస్వామ్యం చేయడమే వారోత్సవాల ముఖ్య ఉద్దేశమన్నారు. సంస్థలో అక్రమాలు జరుగుతున్నట్లు గమనించినచో వెంటనే విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయగలరని, వారి వివరాలను గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. అవినీతి వలన దేశానికి, సంస్థకు జరుగు నష్టాలను గుర్తించి అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడినప్పుడే అవినీతిని అంతం చేసి సమస్యను అధిగమించగలమన్నారు. విజిలెన్స్ అవగాహన వారోత్సవాల సందర్భంగా సంస్థ ఉద్యోగులకు, అధికారులకు వ్యాస రచన పోటీలు, సింగరేణి పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు వకృత్వ పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం విజిలెన్స్ సమగ్రత ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, ఐఇడి డిజిఎం రాజన్న, ఎస్టేట్ అధికారి కుమారస్వామి, పర్యావరణ అధికారి ప్రభాకర్, ఐటి ప్రోగ్రామర్ రవి, డివైపిఎం ఆసిఫ్, జిఎం కార్యాలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.