*రాష్ట్ర ప్రణాళిక సంఘం అధ్యక్షుడు వినోద్ కుమార్
*ప్రజాదరణ చూస్తే తప్పనిసరిగా గెలుస్తామనే నమ్మకం కలుగుతుంది: ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు
రుద్రంగి, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తెలంగాణ రాష్ట్రం తప్పనిసరిగా ఆగమవుతుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఇంటింటికి గులాబీ జెండా కార్యక్రమంలో భాగంగా సోమవారం రుద్రంగి మండల కేంద్రంలో జడ్పీ చైర్మన్ అరుణ-రాఘవ రెడ్డి, బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు, నిర్వహించిన ప్రచార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వినోద్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజీవ్ చౌక్ లో ఏర్పాటు చేసిన సభలో వినోద్ కుమార్ మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, బి.ఆర్.ఎస్ పార్టీ ప్రభుత్వంలో రాష్ట్రం ప్రశాంతంగా ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ లో ఎప్పుడు చూసినా మత ఘర్షణలు ఉండేవని, తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి గొడవలు లేకుండా ఉండి, చాలా మంది గ్రామీణ యువకులు హైదరాబాద్ వెళ్లి ఉద్యోగాలు చేసుకుంటున్నారని, అందుకే రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలన్న, శాంతిభద్రతలు అదుపులో ఉండాలన్న, తెలంగాణ మరింత అభివృద్ధి సాధించాలాన్నా మళ్ళీ ఒకసారి బి.ఆర్.ఎస్ పార్టీకి అధికారం ఇవ్వాలని పిలుపునిచ్చారు. అనంతరం లక్ష్మీ నరసింహా రావు మాట్లాడుతూ ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తోందని, ఈ ఆదరణ, అభిమానం చూస్తే తప్పకుండా విజయం సాధిస్తామనే నమ్మకం కలుగుతుందని అన్నారు. రుద్రంగి మండలానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఈ తొమ్మిదన్నరేళ్లలో రూ. 107 కోట్ల అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపట్టామని, రాబోయే రోజుల్లోనూ మిగతా అన్ని సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా మండల కేంద్రంలో జూనియర్ కళాశాల ఏర్పాటు, 30పడకల ఆసుపత్రి ఏర్పాటు వంటి అన్ని రకాల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కొంతమంది వచ్చి ఏమో చెప్తారని, అపోహలు నమ్మకుండా అభివృద్ధి చేసే లక్ష్యంతో ముందుకు వస్తున్న తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని, ఏడాది లోపు అన్ని రకాల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అంతకుముందు ప్రచారంలో భాగంగా రుద్రంగి మండల కేంద్రానికి చేరుకున్న చల్మెడకు సుమారు వెయ్యి మంది మహిళలు మంగళహారతులతో, బతుకమ్మలతో డప్పుచప్పుళ్లతో, టపాసుల మోతాల మధ్య తెలంగాణ సంప్రదాయ పద్దతిలో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గట్ల మీనయ్య, ఎంపీపీ గంగం స్వరూప మహేష్, సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్ రెడ్డి, సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, ప్యాక్స్ చైర్మన్ కిషన్ రావు, పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కమలాకర్ తదితరులు పాల్గొన్నారు
*విశ్వ బ్రాహ్మణుల సంఘం , రజక సంఘం సబ్యులతో ప్రత్యేక సమావేశం
ప్రచారంలో భాగంగా రుద్రంగి మండల కేంద్రానికి వెళ్లిన వినోద్ కుమార్, చల్మెడ స్థానిక విశ్వబ్రాహ్మణ సంఘం, రజక సంఘం సబ్యులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్, చల్మెడ మాట్లాడుతూ కుల వృత్తులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులకు, రజక కులస్తులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు సీఎం కేసీఆర్ తో చర్చించి ప్రత్యేక ప్రణాళిక రూపొందించేందుకు కృషి చేస్తామని, కుల సంఘాల భవన నిర్మాణాలతో పాటు మిగతా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం రాబోయే ఎన్నికల్లో విశ్వ బ్రాహ్మణులు, రజక సంఘం సభ్యులు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ సంపూర్ణ మద్దతు చల్మెడ లక్ష్మీ నరసింహా రావుకే ఉంటుందని ఏకగ్రీవ తీర్మానం చేశారు.