ముస్లీంలను విస్మరించిన బిఆర్ఎస్
రిజర్వేషన్ హామీ మరిచిన కేసిఅర్
డిమాండ్ల సాధనకై పోరాటాలకు సిద్ధం
మందమర్రి, నేటిధాత్రి:-
బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో 2023లో ముస్లీంలకు సంబంధించిన ఏ ఒక్క అంశం పొందుపరచలేదని, ముస్లీం లంతా ఏకమై, రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, సంక్షేమం, అభివృద్ధి, విద్య, ఉపాధి, రిజర్వేషన్ లలో నిలదొక్కుకోవడానికి పోరాటాలకు సిద్ధంగా ఉండాలని ముస్లీం జెఏసి కో కన్వీనర్, రచయిత ఎస్కె యుసూఫ్ బాబా పిలుపు నిచ్చారు. పట్టణంలోని మంజునాథ ఫంక్షన్ హాల్లో తెలంగాణ ముస్లీం ఆర్గనైజేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర ముస్లీం డిక్లరేషన్ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 13 శాతం ఓట్లు కలిగి ఉన్న ముస్లీంలు 40 నియోజకవర్గాలలో గెలుపోవటములను ప్రభావితం చేసే శక్తి ఉందన్నారు. 2014, 2018 ఎన్నికల్లో ముస్లీంలకు 12శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ముఖ్యమంత్రి కేసిఆర్ హామీ ఇచ్చి, ఓట్లు వేయించుకుని, గెలిచి, అధికారం చేపట్టి పది సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇచ్చిన హామీను విస్మరించారని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన 4శాతం రిజర్వేషన్లు మాత్రమే ముస్లీంలకు కొనసాగుతుందని, అది సైతం సుప్రీంకోర్టులో విచారణలో ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లీంలను కేవలం ఓటు బ్యాంకుగానే భావిస్తున్నారని,తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ పోరాటంలో సబ్బండ వర్గాలతో కలిసి ముస్లీం ప్రజలు పోరాటం చేశారని గుర్తుచేశారు. రాష్ట్రం సాధించుకున్న తర్వాత ముస్లీంలకు బిఆర్ఎస్ మొండి చేయి చూపించిందని విమర్శించారు. వక్ఫ్ బోర్డ్ ఆస్తులకు ప్రభుత్వం కాజేస్తూ, పేదరికంలో ఉన్న ముస్లింలను మరింత పేదరికంలోకి దిగజారుస్తున్నారని ఆరోపించారు. 2023ఎన్నికల్లో బిఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ముస్లీం సంక్షేమం, అభివృద్ధి, విద్య, ఉపాధి, రిజర్వేషన్లపై పొందుపరచకపోవడం ముస్లీంలను అవమానించినట్టే అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 13 శాతం ఓట్లు కలిగిన ముస్లీంలకు రాష్ట్రంలో కనీసం 12 సీట్లు కేటాయించాల్సి వుండగా, కేవలం ఒక్క సీటుతోనే బిఆర్ఎస్ ప్రభుత్వం సరిపెట్టి ముస్లీంలకు అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన రాజకీయ పార్టీలకు అర్థమయ్యే విధంగా ముస్లీం డిక్లరేషన్ సదస్సుతో పొందుపరిచిన 22డిమాండ్లకు పరిష్కారం చూపించాలని, లేనిపక్షంలో ముస్లీంలంతా ఏకమై పోరాటాలకు సిద్ధం కావలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు అబ్దుల్ అజీజ్, ఎండి ఇషాక్,ఎండీ ఇబ్రహీం, ఎండి షరీఫ్, ఎండి జావిద్ ఖాన్, షేక్ అజీమొద్దీన్, ఎండి జాఫర్, షేక్ మహమ్మద్, ఎండి జాకీర్, ముస్లీం మత పెద్దలు, ప్రముఖులు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.