
మందమర్రి, నేటిధాత్రి:-
పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి సేవిస్తున్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకొని, వారి నుండి 100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని పట్టణ ఎస్సై పి చంద్రకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టణంలోని రాజీవ్ నగర్ ఏరియాలో పెట్రోలింగ్ చేయుచుండగా విశ్వసనీయ సమాచారం మేరకు మదర్ థెరిస్సా పాఠశాల సమీపంలో కల ఓపెన్ ఫ్లాట్లో మారుతి నగర్ కు చెందిన మక్కల గంగాధర్, దుబ్బగుడెం కు చెందిన గొల్లపల్లి రాజేష్ అను ఇద్దరు యువకులు గంజాయి సేవిస్తూ కనబడరని, పోలీసులను చూసి వారు పారిపోవడానికి ప్రయత్నించగా, వారిని పట్టుకొని, వారి వద్ద నుండి 100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. విచారణలో వారు గత కొంతకాలంగా మహారాష్ట్ర లోని చంద్రపూర్ నుండి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి, పట్టణంలోని యువకులకు ఎక్కువ రేటుకు విక్రయించడం కాక తాము సైతం సేవిస్తున్నట్లు తెలిపారన్నారు. పంచనామ నిర్వహించి, అనంతరం వారిని పోలీస్ స్టేషన్ తరలించి, కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఎస్సై చంద్ర కుమార్ మాట్లాడుతూ, పట్టణంలో యువకులు ఎవరైనా గంజాయి సేవించినా, సరఫరా చేసినా వారిపై చట్టరీత్య చర్యలు తీసుకొని, వారిపై పిడి ఆక్ట్ నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. గంజాయి రవాణా, సేవించే వారి గురించి ఎవరికైనా తెలిసిన వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.
బెల్ట్ షాప్ నిర్వహకురాలు పై కేసు నమోదు
పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని మూడవ జోన్ లో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా బెల్ట్ షాప్ నడిపిస్తున్న మేంద్రపు దీప అను మహిళపై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకోవడం జరిగిందని పట్టణ ఎస్సై పి చంద్రకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని మూడవ జోన్ లోని దీప ఇంటిలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాప్ నిర్వహిస్తుందన్న విశ్వసినీయ సమాచారం మేరకు శుక్రవారం దీప ఇంటిని తనిఖీ చేయగా, అక్రమంగా నిల్వ ఉంచిన ఐఎంఎఫ్ఎల్ మద్యం సీసాలు,18 ఆఫీసర్ చాయిస్ 90ఎంఎల్ బాటిళ్లు లభించాయని తెలిపారు. అనంతరం పంచనామ నిర్వహించి, పోలీస్ స్టేషన్ కు తరలించి, కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.