మెట్ట ప్రాంతమైన కోనరావుపేట మండలానికి ఎత్తిపోతల పథకంతో సాగునీరు అందిస్తున్న ఘనత బి.ఆర్.ఎస్ ప్రభుత్వానిదే

*సీఎం కేసీఆర్ నాయకత్వంలో తండాలను గ్రామపంచాయతీలుగా మార్చాం

*ప్రజల భవిష్యత్ బంగారంగా ఉండాలన్నా

*బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు

కొనరావుపేట, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు జలాలతో, మల్కపేట రిజర్వాయర్ తో మెట్ట ప్రాంతమైన కోనరావుపేట మండలానికి త్రాగునీరు, సాగునీరు అందించిన ఘనత బి.ఆర్.ఎస్ పార్టీ ప్రభుత్వానిదని వేములవాడ నియోజకవర్గ బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం కోనరావుపేట మండలంలోని మామిడిపల్లి, బావుసాయిపేట, గోవిందరావుపేట తండా, వట్టిమల్ల, గొల్లపల్లి, కమ్మరిపేట తండా, జై సేవాలాల్ బుక్యా రెడ్డి తండా, మరిమడ్ల, అజ్మీరా తండా, కొండాపూర్ గ్రామాల్లో జడ్పీ చైర్మన్ అరుణ- రాఘవరెడ్డి, మార్క్ ఫెడ్ డైరెక్టర్ బండ నర్సయ్య యాదవ్, సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతిలతో కలసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గత రెండు పర్యాయల్లో బి.ఆర్.ఎస్ పార్టీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ మళ్ళీ ఒకసారి కారు గుర్తుకు ఓటేసి, బి.ఆర్.ఎస్ పార్టీకి అధికారం ఇవ్వాలని కోరుతూ ఓట్లు అభ్యరించారు. ఈ క్రమంలో ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సభల్లో గ్రామస్తులనుద్దేశించి చల్మెడ మాట్లాడారు. ఈ ప్రాంత ముద్దుబిడ్డగా, అన్ని సమస్యలు తెలిసిన వాడిగా ముందుకు వస్తున్నానని, ఈ ప్రాంతంలోని సమస్యలపై తనకు సంపూర్ణ అవగహన ఉందని, గతంలో కురిసిన వర్షాలతో మూలవాగుపై ఉన్న నాలుగు లో-లెవెల్ వంతెనలు కూలిపోతే మంత్రి కేటీఆర్ తో మాట్లాడి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యే రమేష్ బాబు చొరవతో హై-లెవల్ వంతెనల నిర్మాణానికి రూ.52కోట్లు మంజూరు చేయించడం జరిగిందని, మళ్ళీ ఒకసారి బి.ఆర్.ఎస్ పార్టీకి అవకాశం ఇస్తే గెలిచిన మూడేండ్ల లోపు కోనరావుపేట మండలంలో పెండింగ్ లో ఉన్న కుల సంఘాల భవనాలు, మహిళ సంఘం భవనాలతో పాటు మిగిలి ఉన్న అన్ని రకాల సమస్యలు పరిష్కారిస్తానని హామీ ఇచ్చారు. గోవిందరావుపేట తండాలోని చెరువులో 35 ఎకరాల భూమిని కోల్పోయిన నిర్వహితులకు నష్టపరిహారం ఇప్పించడం, మిగిలి ఉన్న పోడు భూముల పట్టాలు ఇప్పించడం, తండాల్లో నెలకొని ఉన్న అన్ని రకాల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. చాలా గ్రామాల్లో బీడీ కార్మికులకు పెన్షన్ సమస్య, డబుల్ బెడు రూమ్ ఇండ్ల సమస్యలు ఉన్నట్లు తెలిసిందని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గృహలక్ష్మీ పథకంతో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రజలందరికి బంగారు భవిష్యత్ కావాలన్న, మన బ్రతుకులు మారాలన్న మళ్ళీ ఒకసారి బి.ఆర్.ఎస్ పార్టీకి అధికారం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. అనంతరం జడ్పీ చైర్ పర్సన్ అరుణ-రాఘవ రెడ్డి మాట్లాడుతూ అప్పటి సమైక్యాంధ్ర పాలనలో మన బ్రతుకులు ఎట్లా ఉండే, రాష్ట్రం సాధించుకున్న తొమ్మిదన్నారేళ్ళలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందిందో ప్రజలు ఆలోచన చేయాలని సూచించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉన్నారని, పల్లె ప్రగతి కార్యక్రమంతో పల్లెల రూపురేఖలు మారాయని, మళ్ళీ ఒకసారి కారు గుర్తుకు ఓటేసి, బి.ఆర్.ఎస్ పార్టీకి పట్టం కడితే గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని, బ్రతుకులు బాగుంటాయని స్పష్టం చేశారు. అంతకుముందు ప్రచారంలో భాగంగా ఆయా గ్రామాలకు వెళ్లిన చల్మెడకు మహిళలు, గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, నాయకులు డప్పుచప్పుళ్లు, ఒగ్గు డోలు కళాకారుల ఆటపాటలు, టపాసుల మోతల మధ్య ఘన స్వాగతం పలకగా, ఆయా గ్రామాల్లో ఉన్న ఛత్రపతి శివాజీ, అంబేద్కర్, చాకలి ఐలమ్మ, అల్లూరి సీతారామరాజు విగ్రహాలకు చల్మెడ పూలమాలలు వేసి నివాళులర్పించారు.

బి.ఆర్.ఎస్ పార్టీ కార్యాలయాలు ప్రారంభం

ఆయా గ్రామాల్లో పర్యటనకు వెళ్లిన చల్మెడ, జడ్పీ చైర్ పర్సన్ అరుణ-రాఘవ రెడ్డితో కలిసి శ్రీ రాముల పల్లె, మామిడిపల్లి, వట్టిమల్ల గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన బి.ఆర్.ఎస్ పార్టీ కార్యాలయాలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

పార్టీలో చేరిన యువకులు

కోనరావుపేట మండలంలోని ఆయా గ్రామాల పర్యటనకు వెళ్లిన చల్మెడ సమక్షంలో మామిడిపల్లి గ్రామానికి చెందిన 20మంది యువకులు, బావుసాయిపేటకు చెందిన 20మంది యువకులు, గొల్లపల్లికి చెందిన 20మంది యువకులు బి.ఆర్.ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి జెడ్పి చైర్పర్సన్ అరుణ, చల్మెడ లక్ష్మీనరసింహారావులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్ర గౌడ్, మండల అధ్యక్షులు మల్యాల దేవయ్య, ఫ్యాక్స్ చైర్మన్ రామ్మోహన్రావు, యువజన మండల అధ్యక్షులు జీవన్ గౌడ్, పార్టీ మహిళా మండలి అధ్యక్షురాలు చిట్టి సంధ్య, ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు వివిధ సంఘాల అధ్యక్షులు బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *