అక్రమ నగదు, మద్యం పంపిణీ అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు

జిల్లా కలెక్టర్ & ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా

భూపాలపల్లి నేటిధాత్రి

రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో అక్రమ నగదు మద్యం పంపిణీ అరికట్టేందుకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ & ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా అన్నారు. శనివారం సమీకృత కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, ఎన్నికలలో అక్రమ వైద్యం డబ్బు పంపిణీని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యల పై అధికారులతో కలెక్టర్ రివ్యూ నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ & ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా మాట్లాడుతూ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలను పారదర్శకంగా పకడ్బందీగా ప్రతి ఒక్కరికి సమాన అవకాశం కల్పిస్తూ నిర్వహించేందుకు అధికారులు విధులను నిష్పక్షపాతంగా పకడ్బందీగా నిర్వహించాల్సి ఉంటుందని అన్నారు.
జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి కట్టుదిట్టంగా అమలు కావాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలపై వచ్చే ఫిర్యాదులకు ఎప్పటికప్పుడు స్పందిస్తూ వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. 1950 టోల్ ఫ్రీ నెంబర్, సి విజల్ యాప్ నుంచి వచ్చే ఫిర్యాదులు నిర్దేశిత సమయంలో పరిష్కారం అయ్యే విధంగా చూడాలని కలెక్టర్ ఆదేశించారు.

ఎన్నికల సమయంలో అక్రమ డబ్బు మద్యం పంపిణీ చేసే ఓటర్లను ప్రలోభకు పెట్టే అవకాశం ఉందని, దీనిని నివారించేందుకు అక్రమ డబ్బు మద్యం తరలింపు పై గట్టి నిఘా ఉంచాలని, మన జిల్లా బార్డర్ నుంచి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, నగదు మద్యం తరలింపుపై గట్టిగా ఉంచాలని కలెక్టర్ సూచించారు. ఎక్కడైనా నిబంధనలకు మించి డబ్బు నిలువ, రవాణా జరిగినట్లయితే వాటి ఆధారాలు చూపితే ఎన్నికల గ్రీవెన్స్ కమిటీ ద్వారా పరిశీలించి నగదు, బంగారం విడుదల చేయడం జరుగుతుందని తెలియజేశారు.
జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో గుడుంబా కాస్తూ వాటిని పంపిణీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మీడియా కథనాలు వస్తున్నాయని, దీనిపై ఆబ్కారి శాఖ అధికారులు వెంటనే స్పందించి గుడుంబా నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, రాష్ట్రాల నుంచి మన జిల్లాకు సరిహద్దు ద్వారా గుడుంబా సరఫరా కాకుండా కూడా చర్యలు తీసుకోవాలని అటవీ ప్రాంతంలో మరింత నిఘా పెట్టాలని కలెక్టర్ సూచించారు.
బెల్టు షాపుల నిర్వాహకుల పై కఠినంగా వ్యవహరించాలని, జిల్లాలో ప్రభుత్వ అనుమతి తీసుకున్న మద్యం షాపుల ద్వారా మాత్రమే మద్యం విక్రయం జరగాలని, మద్యం విక్రయానికి సంబంధించి లెక్కలు పకడ్బందీగా నమోదు కావాలని, వ్యక్తిగతంగా 4.5 లీటర్ ల మద్యం మాత్రమే కలిగి ఉండాలని అంతకు మించి ఇంట్లో ఉన్నట్లయితే వారిపై ఎన్నికల నిబంధనల మేరకు కేసులు బుక్ చేస్తామని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా బెల్ట్ షాపులపై ఆకస్మిక దాడులు చేస్తూ వాటిని వెంటనే మూసివేయాలని, చట్ట ప్రకారం కేసులు నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశిచారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిధ అభ్యర్థులు, రాజకీయ పార్టీలు వినియోగించే వీడియో ఆడియోల ప్రదర్శనకు ముందస్తుగా మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ అనుమతి తీసుకోవాలని, ఎవరిపై వ్యక్తిగత దూషణలు ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ వీడియోలు చేయడానికి వీలులేదని, కుల మత ప్రాంత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వీడియో ఆడియోలు చేయడానికి వీలు లేదని, ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నిబంధనల ప్రకారం ప్రచారం నిర్వహించుకునే ఆడియో వీడియోలకు అనుమతి జారీ చేస్తామని, ఎంసిఎంసి అనుమతి లేకుండా ప్రచారంలో ఆడియో వీడియోలు వినియోగిస్తే వెంటనే సంబంధిత అభ్యర్థి పై చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు , అర్.డి. ఓ. రమాదేవి, జెడ్పీ సి ఈ ఓ విజయలక్ష్మీ, ఎం.సి.సి., ఎం.సి.ఎం.సి. ఎఫ్.ఎస్.టి. వి.ఎస్.టి. టీమ్ సభ్యులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *