దసరా పంపకాలు మా వల్ల కాదు!

https://epaper.netidhatri.com/

`కలవరంలో కాంగ్రెస్‌ నేతలు.

`పండగ ముందు టిక్కెట్ల ప్రకటన వద్దు

`కాంగ్రెస్‌ పార్టీకి నేతల విజ్ఞప్తి.

`మునుగోడు ఉప ఎన్నిక తరహా భరించలేదు.

`దీపావళి పండగ కూడా ముందే వుంది.

`రెండు పండుగలను ఎదుర్కోవడం కష్టం.

`పోలింగ్‌ కు ముందు తిప్పలు పడలేం.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

కాంగ్రెస్‌పార్టీ నాయకుల కష్టాలు పగవాడికి కూడా రావొద్దు. పదేళ్లుగా అధికారానికి దూరమయ్యారు. ఈసారి ఎలాగైనా గెలవాలన్న తాపత్రయం వారిలో వుంది. కాని సరిగ్గా దసరా, దీపావళి పండుగల సమయంలో ఎన్నికల వస్తాయని ఊహించలేదు. ఓ వైపు టిక్కెట్లే కొనుకుంటున్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. పిసిసి. అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి టిక్కెట్లు అమ్ముకుంటున్నాడంటూ ఆ పార్టీకి చెందిన నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు. టికెట్లు రాని వాళ్ల ఆరోపణలు ఒక రకంగా వుంటే, టికెట్లు వస్తాయన్న ఆశలున్న వారి బాధలు మరోలా వున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ మొదటి లిస్టు విడుదలైంది. ఆ నాయకులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. కాని టిక్కెట్లు వచ్చిన ఆనందంలో దసరా పండుగ ముందుందని గుర్తించలేకపోయారు. ఆ విషయాన్ని ఇంకా టికెట్లు రాని వాళ్లు గుర్తించారు. అంతే రెండో లిస్టు ఆలస్యమైనా సరే కాని, పండగ ముందు మాత్రం విడుదల చేయొద్దని మొత్తుకుంటున్నారట. ఎందుకంటే గత ఏడాది ఇదే సమయంలో మునుగోడు ఉప ఎన్నిక వచ్చింది. ప్రజలకు దసరా డబుల్‌, త్రిబుల్‌ ధమాకాలు తెచ్చింది. దసరా పండుగ రోజున నియోజకవర్గం మొత్తం బిఆర్‌ఎస్‌, బిజేపి, కాంగ్రెస్‌ పార్టీలు ప్రతి ఇంటికి కిలో మటన్‌, ఒక పుల్‌ బాటిల్‌ పంపించారన్నది బహింరంగ రహస్యమే. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల సమయానికి కూడా దసరా పండుగ వచ్చింది. బిఆర్‌ఎస్‌ అభ్యర్ధుల ప్రకటన ఎలాగూ జరిగిపోయింది. ఆ నాయకులు ప్రజల్లో వుంటున్నారు. ఇప్పటికే సంతర్పణలు మొదలు పెట్టారు. పండుగ సందర్భంగా అందించేవాటిపై కూడా దృష్టిపెట్టారని తెలుస్తోంది. కాని కాంగ్రెస్‌ నాయకులు ఖర్చును చూసి బెంబేలెత్తిపోతున్నారట. ఎన్నికలపోటీపై ఆసక్తి చూపించారు గాని, ఖర్చు గురించి ముందు అంచనా వేసుకోలేదు. పైగా పండుగలు వస్తున్నాయని అసలే ఊహించలేదు. అదే ఇప్పుడు కాంగ్రెస్‌ దెబ్బతీసేలా వుంది. ఒక వేళ ఇప్పటికిప్పుడు కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటన చేస్తే వారి పని సగం గోవిందా? ఇప్పటికే టిక్కెట్లు వచ్చిన కాంగ్రెస్‌ అభ్యర్ధులు తలలు పట్టుకుంటున్నారు. నియోజకవర్గం మొత్తం కనీసం కార్యకర్తలకు, నాయకులకు పండగ ఖర్చులు సర్ధాలంటేనే బోలెడు ఖర్చు. ఒక వేళ అధికార బిఆర్‌ఎస్‌ ప్రతి ఇంటికి ఇస్తుందని తెలిస్తే, ఇక కాంగ్రెస్‌ కూడా ఇవ్వాల్సివస్తుంది. పదేళ్లుగా అదికారంలో లేరు. ఎన్నికలకోసం పైసా పైసా కూడబెట్టుకున్నారు. ఆ సొమ్మంతా ఒక్క దసరా పండుగకే ఎగిరిపోతే, తర్వాత వచ్చే దీపావళికి ఏం పంచుతారు. తీరా పోలింగ్‌ కుముందు రోజు ఎలా పంపకాలు చేస్తారు? అన్నది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది. తెలంగాణలో హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఎంతో కాస్ట్‌లీ ఎన్నిక అనుకున్నారు. మునుగోడు అంతకు మించిన ఎన్నికగా రికార్డు సృష్టించింది. హుజూరాబాద్‌లోనూ, మునుగోడులోనూ పోటీ పడి మరీ పంపకాలు చేశారు. తెలంగాణలో బతుకమ్మ, దసరా పండుగలకు వుండే ప్రాదాన్యత అంతా ఇంతా కాదు. ఇలాంటి పరిస్ధితుల్లో పండగకు కిలో మటన్‌, ఓ బాటిల్‌ పంచడం తప్పని సరిగా కనిపిస్తుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అధికార యంత్రాంగమంతా మునుగోడు, హుజూరాబాద్‌లో తిష్టవేసిన సమయాల్లోనే పంపకాలకు పెద్ద ఇబ్బందులు ఎదురుకాలేదు. ఇప్పుడు పంపకాలు మరింత సులువు. అందుకే కాంగ్రెస్‌ పార్టీటికెట్టు ఆశిస్తున్న వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయట. బిఆర్‌ఎస్‌ నాయకులకు కూడా కొంత భయం వున్నప్పటికీ అదికారంలో వుండడం వల్ల వెసులు బాటు వుండొచ్చు. అయితే బిజేపి నాయకులకు మాత్రం పండుగలు రావడం మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టే అవుతోంది. సహజంగా బిజేపి నాయకులు పంపకాలకు కొంత వ్యతిరకం. కాని ఇప్పుడున్న ఎన్నికల పరిస్ధితుల్లో ఏ పార్టీకైనా తప్పని పరిస్ధితి. మునుగోడు ఉప ఎన్నికలో బిజేపి తరుపున పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి పంపకాలు చేశాడు. అంటే ఒక వేళ పండగ ముందు బిజేపి అభ్యర్దుల జాబితా ఒక వేళ వస్తే మాత్రం ఆ మాత్రం ఆట కూడా ఆడలేరేమో! చూద్దాం…పండగకు పంపకాలు చేస్తారా? ఎన్నికల నాడు దాకా ఆగుతారా? కలవరపాటు మాత్రం అందరిలోనూ కనిపిస్తోంది. పంపకాల ముచ్చట వింటేనే వాళ్లలో గుబులు వినిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!