బిఆర్ఎస్ మండల అధ్యక్షులు లింగాల రమణారెడ్డి
వెంకటాపూర్, నేటిధాత్రి:
ములుగు నియోజకవర్గం వెంకటాపూర్ మండల బీఆర్ఎస్ అధ్యక్షులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ఎమ్మెల్యే కుట్రలు కుతంత్రాలతో అధికారం కోసం గుంట నక్కలా ఎదురుచూస్తున్నారని ఎద్దేవా చేశారు. బిఆర్ఎస్ నాయకులు మోసం, కుళ్ళు, కుతంత్రాలు, అన్యాయం తెలియని బోలా మనుషులని, సాయం కోసం ఎవరైనా వస్తే సాయం చేయడం, కష్టాల్లో ఉన్నారని తెలిస్తే ఆదుకోవడం మాత్రమే మాకు తెలుసనీ, కానీ కాంగ్రెసోళ్లు మాత్రం అందుకు భిన్నంగా ఉంటున్నారని, అధికారం కోసం గుంట నక్కలా, తోడేళ్ళలా ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు. ప్రతీ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త, నాయకుడు ఆలోచన చేసి అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి విషయంపై చర్చించి ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యత తీసుకోవాలన్నారు. 14 ఏళ్ల అవిశ్రాంత కృషితోనే సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని, స్వరాష్ట్రంలోని ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యతను తీసుకున్నారని ఆయన గుర్తు చేశారు. అనేక సంవత్సరాల సమైక్యవాదుల పాలనలో నీళ్లు నిధులు నియామకాల దోపిడికి గురైన తెలంగాణ ప్రజలకు అన్యాయమే జరుగుతుందని భావించిన సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించి, అభివృద్ధి సంక్షేమానికి బాటలు వేశారన్నారు. 65 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో రైతులు విద్యార్థులు దళితులు గిరిజనులకు అన్యాయమే జరిగిందని, ఆనాడు ఉపాధి లేక ఎంతో మంది వలసలు పోయారన్నారు, తెలంగాణ ఏర్పాటుకు ముందు ఆకలి కేకలు కనిపించేవని, కానీ ఈనాడు ఆకలి కేకలు ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తెలంగాణ ముందుకు సాగుతుందన్నారు. వలసలు పోయినోళ్ళు ఈనాడు తిరిగి రాష్ట్రానికి వస్తున్నారంటే ఎంత ప్రగతి సాధించామో అర్థం చేసుకోవాలన్నారు. అలాంటి ప్రభుత్వం సీఎం కేసీఆర్ నాయకత్వంలో నాలుగేండ్లు జడ్పీ వైస్ చైర్మన్ ప్రస్తుతం చైర్మన్ గా అవకాశం కల్పించిన బడే నాగజ్యోతి ములుగు నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నారని, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే నాలుగున్నర ఏళ్లలో ఏ గ్రామంలో కూడా తట్టెడు మట్టి పోయలేదని అన్నారు. కాంగ్రెస్ కపట నాటకాలు కుట్రలు కుతంత్రాలను ములుగు జిల్లా ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. విద్యావంతురాలు బడే నాగజ్యోతి అసెంబ్లీలో అడుగుపెడితే ములుగు నియోజకవర్గంలో అద్భుతమైన మార్పు కనిపిస్తుందని, గ్రహించాలని ఆయన అన్నారు. అధికారం కోసం ఎదురుచూసే కాంగ్రెసోళ్లు మంచి నాయకురాలిని ఎదగకుండా చేస్తారని, వాళ్ల ఆలోచనలతో ప్రజలను మోసం చేస్తారని అన్నారు. గత ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థి కీర్తిశేషులు అజ్మీర చందులాల్ గారిని ఓడించి తప్పు చేశారని మరోసారి అలాంటి తప్పు జరగకుండా ప్రజలు చైతన్యవంతులు కావాలని మండల అధ్యక్షులు లింగాల రమణారెడ్డి పిలుపునిచ్చారు. రోజు రోజుకు బడే నాగజ్యోతికి గ్రాఫ్ పెరుగుతుందని గ్రహించిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు ఎమ్మెల్యే అభ్యర్థిగా బడే నాగజ్యోతిని ప్రకటించారని, ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చే భారాస ప్రభుత్వం సీఎం కేసీఆర్ నాయకత్వంలో బడే నాగజ్యోతిని ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపించే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని, జ్యోతక్క గెలుపు ఖాయమని, సూర్యకాంతి ఉన్నంతవరకు జ్యోతక్క గెలుపును ఎవరూ ఆపలేరని అన్నారు. అందుకు నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలు, ప్రజలు కాంగ్రెస్ నేతల మాయమాటల్లో పడకుండా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.