ధర్మపురి, (నేటి ధాత్రి):
దక్షిణ కాశీగా పేరు గాంచిన ప్రముఖ శ్రీ లక్మి నరసింహ స్వామి పుణ్యక్షేత్రం, ప్రక్కనే పవిత్రమైన గోదావరి నదీ తీరం, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇలాకా అయిన ధర్మపురిలో కాలుష్యం కోరలు చాచుతోంది. ఈ ప్రాంత వాసులు బయటకు రావాలంటే కరోనా వైరస్ కంటే ఎక్కువగా జంకుతున్నారు. జగిత్యాల జిల్లా లో అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రమైన ధర్మపురి పట్టణం పోలీస్ స్టేషన్ వెనుక భాగంలో కో-ఆపరేటివ్ బ్యాంక్ ముందర రోడ్డు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ధర్మపురి నుండి ఈ మెయిన్ రహదారి గత రెండు సంవత్సరాలుగా ఇదే పరిస్థితిలో ఉండిపోయిందని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. పక్కనే మైనార్టీ స్కూల్, రోడ్డును ఆనుకొని కో-ఆపరేటివ్ బ్యాంక్ ఉండగా స్కూల్ పిల్లలు, బ్యాంక్ వినియోగదారులు ఈ ధూళికి శ్వాస పీల్చుకోలేని పరిస్థితి నెలకొందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
పట్టణంలో డ్రైనేజీలు ఉన్నా వాటిని కూల్చివేసి మళ్లీ డ్రైనేజీలు నిర్మిస్తున్నారని,
రోడ్డు అవసరం లేని గల్లీలలో రోడ్లు వేస్తున్నారని ఇదంతా నిధుల మింగి అవినీతికి పాల్పడడం కోసమేనని ధర్మపురి వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం మెయిన్ రహదారిపై గత రెండు సంవత్సరాలుగా ఇదే దుస్థితి ఉందని తెలిసినా నాయకులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని, ఈ విషయం మంత్రి కొప్పుల ఈశ్వర్ దృష్టికి వెళ్లినా ఏమాత్రం స్పందించడం లేదని ధర్మపురి పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎంత చెప్పినా స్థానిక నాయకులు గానీ, ప్రజా ప్రతినిధులు గానీ, చివరికి మంత్రి కూడా దీనిని పట్టించుకున్న పాపాన పోలేదని ప్రజలు రోదిస్తున్నారు. స్వయానా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇలాకాలో అది కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి నివాసం ను ఆనుకొని ఉన్న ప్రక్క రోడ్డు, ధర్మపురి పోలీస్ సర్కిల్ కు వెళ్లే ప్రధాన రహదారి పరిస్థితే ఇలా ఉంటే ఇక నియోజక వర్గంలోని గ్రామాల పరిస్థితి ఎలా ఉంటుందోనని ధర్మపురి పుణ్యక్షేత్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.