# 50 శాతం ఉన్న వారికి 33 శాతానికి చేయడం అశాస్త్రీయం
# చట్ట సభల్లో ప్రత్యేక బిసి రిజర్వేషన్ బిల్లు తేవాలి
# బహుజన లెఫ్ట్ ఫ్రంట్ నియోజకవర్గ కన్వీనర్ వంగల రాగసుధ
నర్సంపేట,నేటిధాత్రి :
ఈ నెల 18 న కేంద్ర ప్రభుత్వం కేంద్ర క్యాబినెట్ హడావుడిగా ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లులో జనాభా నిష్పత్తి ప్రకారం 50 శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉండగా 33 శాతానికి రిజర్వేషన్ ను ఆమోదించిన తీరు సమంజసంగా లేదని ఈ 33 శాతం మహిళా రిజర్వేషన్ లో ఎస్సీ,ఎస్టీ, బిసి జనాభా నిష్పత్తిని కూడా చేర్చాలని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ నియోజకవర్గ కన్వీనర్ వంగల రాగసుధ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో సగభాగమైన మహిళలకు 50 శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థలలో ఇచ్చిన విదంగా చట్ట సభల్లో ఇవ్వక పోవటం ఓట్ల కోసం చేస్తున్న హడావిడిగా ఉందేతప్ప ఇది మహిళలకు ఇచ్చే రాజ్యాంగ హక్కులో బాగంగా లేదని ఆరోపించారు.
ఇచ్చిన 33 శాతం మహిళా రిజర్వేషన్ లో కూడా ఎస్సీ,ఎస్టీ, బిసి కోటా రిజర్వేషన్ లేకపోతే మహిళలకు ఇచ్చిన ఈ రిజర్వేషన్ కు న్యాయం జరగదని, తక్షణమే మహిళా రిజర్వేషన్ బిల్లు లో సామాజిక రిజర్వేషన్ జనాభా నిష్పత్తి ప్రకారం నిర్ణయం చేయాలని కోరారు.ఈ రిజర్వేషన్ బిల్లు కోసం అనేక పోరాటాలు జరిగాయని 2010లో పార్లమెంటు ఆమోదం అయినప్పటికీ ఇప్పటికీ ఆచరణలో విఫలమైన విదంగా కాకుండా వెంటనే అమలు చేసి ఎన్నికలకు వెళ్ళాలని సూచించారు.మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు చట్ట సభల్లో ప్రత్యేక బిసి రిజర్వేషన్ బిల్లు వెంటనే తీసుకురావాలని అందుకోసం కులగణన చేపట్టాలని రాగసుధ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.