అప్పు చేయాలా..వద్దా!

https://epaper.netidhatri.com/

` కాంగ్రెస్‌ నేతలను వేధిస్తున్న ప్రశ్న!!

`అప్పు ఇచ్చే వారి ఆట…పుచ్చుకునే వారి తీట!?

`అప్పు తీర్చకపోతే తాకట్టు అమ్ముకునుడే!

`అప్పు ఇచ్చే వారి కొత్త షరతు?

`తలలు పట్టుకుంటున్న నేతలు.

` అప్పు చేయాల్సిందే…మూట విప్పాల్సిందే!

`ఎంత అప్పు చేసి ఖర్చు చేసినా గెలవకపోతే!?

`కాంగ్రెస్‌ శ్రేణుల్లో మొదలైన అంతర్మధనం!

`తాకట్టు విడిపించుకోవడమెలా!

`కాంగ్రెస్‌ పోటీ దారుల్లో అప్పుడే మొదలైన గుబులు?

`అభ్యర్థుల ప్రకటన చేస్తే…ఎన్నికల నాటికి ఏమీ మిగలదు?

`బిఆర్‌ఎస్‌ అభ్యర్థులంతా ఎమ్మెల్యేలే!

`అదనపు ఖర్చు అవసరం లేదు?

`కాంగ్రెస్‌ అభ్యర్థులు ప్రకటన వెలువడిన క్షణం నుంచే చిలుము వదలాల్సిందే!

`టికెట్‌ కోసం ఇంత కాలం చేసిందే అప్పు!

`ప్రచారానికి మరింత చేయాలి అప్పు!

`ఎన్నికల వేళ పంపకాలకు కావాలి మళ్ళీ అప్పు!

`ఇన్ని సార్లు ఎన్ని అప్పులు చేసినా గెలిచే గ్యారెంటీ లేదు!

`బిఆర్‌ఎస్‌ తో లోపాయి కారి ఒప్పందం మేలు!

`ఎన్నికల నాడు సైలెంట్‌ అయితే చాలు!

`చేసిన అప్పు తీర్చుకునే వీలుంటది.

`ఇదే ఇప్పుడు సరికొత్త రాజకీయం!

హైదరబాద్‌.నేటిధాత్రి:
ఏమండీ ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలిచారట కదా…అభినందనలు.. పాపం మీ మీద పోటీ చేసిన నాయకుడు కోట్లు పాయే, ఓట్లు పడకపాయే అని లెక్కింపు కేంద్రం నుంచే ఎడ్చుకుంటూ పోయాడటకదా? అంటే…వాడు జనం ముందు ఓడి ఏడుస్తున్నాడు..నేను గెలిచి ఎవరికీ కనిపించుకుండా…ఇంట్లో ఏడుస్తున్నాను. ఇద్దరిలోనూ ఏడుపు కామన్‌…వాడి ఏడుపు ఒక రోజుతో అయిపోతుంది. నాకు దినదిన గండం ఇప్పుడే మొదలైందన్నాడట గెలిచి ఎమ్మెల్యే…ఇదే ఇప్పటి రాజకీయ ముఖ చిత్రం…అయినా సరే మళ్ళీ మళ్ళీ ఎమ్మెల్యే కావాలి. ఎన్ని అప్పులైనా చేయాలి. గెలిచిన వాళ్లు పదే పదే గెలవాలని, ఓడిన వాళ్లు ఒక్కసారైనా ఎమ్మెల్యే కావాలని కోరుకోవడం మాత్రం ఆపరు… కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందని తెలిసినా ఊరుకోరు. నేడు రాజకీయం అంటే ప్రజాసేవ కాదు. అధికార యావ. ఒక మత్తు. పదవి ఒక గమ్మత్తు. ప్రజా ప్రతినిధి అనేది ఒక మంత్ర దండం. దానిని వద్దు అని ఏ నాయకుడు అనడు. పదవి కోసం కలలో కూడా ఆరాటపడుతూ వుంటారు. అంతటి మత్తు,మహత్తు ఒక్క రాజకీయానికే వుంది. అందుకే ఒక్క సారి పదవి రుచి మరిగిన నాయకులు దానిని వదులుకోవడానికి ఇష్ట పడరు. అందుకే రామాయణం కన్నా రాజకీయమే ఎక్కువ మంది వింటుంటారు.
అప్పు ముప్పు తెచ్చును అన్నారు పెద్దలు. అప్పు చేసి పప్పు కూడు అని సినిమా తీశారు.
అప్పు నిప్పులాంటిది అని హెచ్చరించారు. కాల క్రమంలో అప్పు లేకపోతే ఎలా? అనే పరిస్థితికి సమాజం చేరుకుంటోంది. అలాంటి పరిస్థితులు వచ్చేశాయి. ఆస్థులతో పాటు అప్పు చూపించకపోతే కూడా తిప్పలే అవుతుంది. అందుకే ఆస్తిపాస్తుల ముచ్చటే కాదు, అప్పుల సంగతి కూడా లెక్క చెబితేనే లెవలౌతోంది. అసలు విషయానికి వద్దాం.. రాజకీయ అప్పు చేయాలా..వద్దా!అని కాంగ్రెస్‌ అడుగుతున్నారు. మల్ల గుల్లాలు పడుతున్నారు.
ఇప్పుడు కాంగ్రెస్‌ నేతలను వేధిస్తున్న ప్రశ్న!! అప్పు చేస్తే ఎలా? చేయకుండా ఎలా? అప్పు చేయకపోతే ఇక నుంచి పూటే గడవదు. ఎన్నికల దాకా ఖర్చు చేసుకుంటూ పోతే గాని పరపతి నిలవదు. ఎన్నికల దాకా రోజూ పెట్టి, ఒక్క పూట మర్చిపోయినా చేసిందంతా బూడిదలో పోసిన పన్నీరు. ఇలాంటి తరుణంలో రాజకీయాలు చేయలా? వద్దా? అన్న మీమాంసలో కూడా నేతలున్నారు. రాజకీయం అనేది ఒక బురద. తెచ్చిపెట్టుకున్న దురద. ఆ బుదరలో లేకపోతే బతకలేదు. ఆ దురదను గోక్కోకుండా వుండలేరు. ఆ రెండు కావాలంటే అప్పు చేయక తప్పలేదు. ఇది వరకు చేసిన అప్పులే ఇప్పటికీ తీరడం లేదు. వడ్డీల మీద వడ్డీలు కిస్తీలు కడుతూ, లోపల పాత బనీను వేసుకొని, పైన గంజి బట్టలు తొడుక్కోక తప్పడం లేదు. దాంతో బైట వారికి తెలియకుండా, ఇంట్లో వారికి చెప్పకుండా, పరువు బజారున పడకుండా చేయాల్సినన్ని అప్పులు చేస్తూనే వున్నారు. డాంబికాలకు పోతూనే వున్నారు. రాజకీయాలు చేస్తూనే వున్నారు. ఈ విషయంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఓపెన్‌ గానే చెబుతుంటాడు. తనకు వున్నన్ని అప్పులు ఎవరికీ లేవంటాడు. అయినా అప్పులు చేస్తూనే వుంటానంటాడు. ఇప్పుడు కాంగ్రెస్‌ మిగతా నేతలకు కూడా ఆ అవసరం రానే వచ్చింది. ఎన్నికల తరుణం ముంచుకొస్తోంది. ప్రజల్లో ఇంతకాలం తిరిగింది ఒక ఎత్తు. ఇకపై తిరగాల్సింది ఒక మరో ఎత్తు. ఈ సమయంలో వెనుకబడి పోవడం అంటే ముందే ఓటమిని ఒప్పుకోవడం అవుతుంది. యుద్ధ రంగంలో వీరుడు కడదాకా పోరాడాల్సిందే…కానీ ఇది రాజకీయం. ఇక్కడ కూడా అంతే అనుకునే వాళ్లు చాలా మందే వున్నారు. చాకచక్యంతో చాణక్య నీతి ప్రదర్శించే వాళ్లూ వుంటారు. కాకపోతే ఒకటే తిప్పలు. కాసు లేనిదే కాలు బైట పెట్టే వీలు లేదు. కాసు లేనిదే ప్రజల కనికరించరు. కార్యకర్తలు కదలరు.. రారు. వెంట నలుగురు వచ్చేందుకు ముందుకు రారు. అన్నిటికీ సమాధానం అప్పు..
అయితే అప్పు ఇచ్చే వారి ఆట…పుచ్చుకునే వారి తీట!?
అన్నట్లుగా సాగుతోంది వ్యవహారం. నాయకులు కదా! అందరూ నమ్ముతారు. ఏ నాయకుడితో ఎలాంటి అవసరం వస్తుందో! అందుకే వ్యాపారం చేసే వాళ్లు కూడా నాయకులు అంటే చాలు ముందూ వెనుక ఆలోచించకుండా అప్పులిస్తారు. ఇది గతం సంగతి. వర్తమానం మారిపోయింది. బిఆర్‌ఎస్‌ నేతలంటే వ్యాపారులు ఆలోచించలేదు. కానీ ప్రతిపక్ష పార్టీల నేతలు అనగానే, తాకట్టు ఏం పెడతారు? అన్న ప్రశ్న వేస్తున్నారు. అంతే కాదు ఒకవేళ గెలవకపోతే! అనే దానిని ముఖం మీదే అడిగేస్తున్నారు. గతంలో లాగా తాకట్టు పెట్డుకొని ఎదురుచూడకుండా, ఇవ్వలేని పక్షంలో ఆస్థులు మా పేర చేసుకుంటాం..లేదంటే అమ్ముకుంటాం…అందుకు ముందే దస్తావేజులు తయారు చేస్తున్నారు. కుటుంబ సభ్యులందరి సంతకాలు, ఒప్పంద పత్రాలు ఇస్తే గాని అప్పు ఇవ్వడం కుదరదని నేతల ముందే చెప్పేస్తున్నారు. పగవాడికి కూడా ఈ కష్టం రావొద్దురా దేవుడా! అనుకుంటూ ఎక్కుడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకాలు పెట్టేస్తున్నారు. రాజకీయ మోజును చూపించుకుంటున్నారు. అందరి ముందు నవ్వులు, ఇంట్లో ఒంటరిగా ఏడుపులు మిగులుతున్నాయని
తలలు పట్టుకుంటున్నారు. కన్నీళ్లు కనిపించకుండా దాచుకొని, కళ్లు ఎర్రజేసుకోలేక సతమతమౌతున్నారు. అప్పు చేయాల్సిందే…మూట విప్పాల్సిందే!
ఎంత అప్పు చేసి ఖర్చు చేసినా గెలవకపోతే!? అనే మాట విన్న ప్రతీసారి ఆ నేతలు అదరుతున్న గుండెను అదిమి పట్టుకోవాల్సి వస్తోంది. అందుకే కాంగ్రెస్‌ శ్రేణుల్లో మొదలైన అంతర్మధనం! మొదలైనట్లు సమాచారం.

అప్పు చేయడానికి ముందే కొన్ని ఆలోచించుకుంటున్నారట. ఒకవేళ గెలవని పక్షంలో తాకట్టు విడిపించుకోవడమెలా! సంపాదించిందంతా పోగొట్టుకొని, పై నుంచి అప్పులు తెచ్చి ఆగమైపోవుడు తప్ప ఏ ముంటుందనే మధనపడుతున్నారట. మరో వైపు రాజకీయ జీవితం మీద ఆశ వదులుకోవాలనుకోవడం లేదట.
కాంగ్రెస్‌ పోటీ దారుల్లో అప్పుడే గుబులు మొదలైందంటున్నారు. గతంలో ఎప్పుడైనా సరే నామినేషన్లకు ముందు అభ్యర్థుల ప్రకటన వుండేది. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతిపక్షాలను కోలుకోని దెబ్బ కొట్టడంలో ఆరి తేరిన ముఖ్యమంత్రి కేసిఆర్‌ కొట్టే దెబ్బలు తట్టుకోలేక విలవిలలాడుతున్నాయి. ఎన్నికలకు ముందు దాకా హడావుడి చేస్తున్న ప్రతిపక్షాలు తీరా ఎన్నికలు దగ్గరకు రాగానే చేతులెత్తేసే పరిస్థితులు ఎదురౌతున్నాయి. సరిగ్గా గత ఎన్నికలు కూడా ఇలాగే జరిగాయి. అప్పటి ప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ముఖ్యమంత్రి కేసిఆర్‌ ముందస్తుకు వెళ్లే యోచన చేస్తున్నాడని ప్రకటించారు. ఆయన సమాచారం తెలిసినా ఎన్నికలకు తయారు కాలేకపోయారు. ఆయన సతీమణి ఉత్తమ్‌ పద్మావతి ని కోదాడ నుంచి గెలిపించుకోలేకపోయారు. ఇప్పుడు కూడా ఎన్నికలకు మూడు నెలల ముందుగానే బిఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటించింది. అయినా కాంగ్రెస్‌ వడబోత పేరుతో గెలుపు గుర్రాల కోసం ఎదురుచూస్తోంది. అదే అభ్యర్థుల పాలిట శాపంగా మారనుంది. అభ్యర్థుల ప్రకటన ఇప్పుడు చేస్తే…ఎన్నికల నాటికి ఏమీ మిగలదు? బిఆర్‌ఎస్‌ అభ్యర్థులంతా ఎమ్మెల్యేలే కావడం గమనార్హం. వారికి అదనపు ఖర్చు లేదు. అవసరం కూడా లేదు. అంతా ప్రభుత్వ యంత్రాంగమే సమకూర్చుతోంది. ఎమ్మెల్యేలు ఇదే అదునగా అధికారిక కార్యక్రమాలు విసృతంగా నిర్వహిస్తున్నారు. కార్యకర్తలను సంతృప్తి పరుస్తున్నారు. పనిలో పనిగా ప్రచారం కానిచ్చేస్తున్నారు. పెండిరగ్‌లో వున్న ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు రావాల్సినవి అందిస్తున్నారు. అధికారిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి మరీ ప్రచారం లో భాగం చేసుకుంటున్నారు. అంటే వారి ఓటు బ్యాంకు కాపాడుకునే ప్రయత్నం బాగానే బిఆర్‌ఎస్‌ చేస్తోంది. ఎటొచ్చి ప్రతిపక్షాలకు ఏం చేయాలో తోచడం లేదు. ఎందుకంటే కాంగ్రెస్‌ అభ్యర్థులు ప్రకటన వెలువడిన క్షణం నుంచే చిలుము వదలాల్సిందే! టికెట్‌ కోసం ఇంత కాలం చేసిందే అప్పు! అనుకొని కుమిలిపోతుంటే, దెబ్బ మీద దెబ్బ అన్నట్లు, ప్రచారానికి మరింత అప్పు చేయక తప్పదు. అయినా సరిపోతుందా అంటే చాలదు. ఎన్నికల వేళ పంపకాలకు కావాలి మళ్ళీ అప్పు! ఇన్ని సార్లు ఎన్ని అప్పులు చేసినా గెలిచే గ్యారెంటీ లేదు! అందుకే టికెట్‌ వచ్చినా గెలిచే అవకాశం లేని కాంగ్రెస్‌ నాయకులు బిఆర్‌ఎస్‌ తో లోపాయి కారి ఒప్పందం మేలు! అనుకుంటున్నారట. అంటే ఇంత కాలం చేసిన అప్పు భారం బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తీర్చితే చాలు. ఎన్నికల నాడు సైలెంట్‌ అయితే అదే పది వేలు!చేసిన అప్పు తీర్చుకునే వీలు. ఇదే ఇప్పుడు సరికొత్త రాజకీయం! ఇంతే కాంగ్రెస్‌ రాజకీయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!