https://epaper.netidhatri.com/
`ముందస్తు ఒక బురద.
`కమలం కోరుకుంటోందా ఆ దురద.
` అత్యాశలో మరింత అధికారం దురాశ.
`ఎప్పుడూ మేమే అనుకుంటే ప్రజాస్వామ్యంలో పేరాశ.
`జమిలి ఎన్నికలు గతంలో జరిగినవే.
`ఇప్పుడున్న పరిస్థితులు గతంలోనూ వున్నవే.
`బలమైన ప్రభుత్వాల వల్ల జరిగే నష్టాలు ఇలాంటివే!
`రాష్ట్రాల హక్కులు హరించడమే!
`కేంద్రం ఒంటెద్దు పోకడకు మార్గమే!
`ప్రజాస్వామ్య స్పూర్తికి విఘాతమే!
`ఎన్నికల ఖర్చు తగ్గుతుందనేది ఒక సాకు మాత్రమే!
`సెంటిమెంట్ అస్త్రం నుంచి కొత్త దారి వెతుక్కోవడమే!
హైదరబాద్,నేటిధాత్రి:
అసలు జమిలి ఎన్నికలు ఎవరికి లాభం? రాజకీయ పార్టీ అన్న తర్వాత తన పార్టీ ప్రయోజనాలు కూడా చూసుకుంటుంది. తప్పులేదు. మన దేశం ప్రజాస్వామ్య దేశం. ఫెడరల్ స్పూర్తిని నిండిన దేశం. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వం లో భిన్నత్వం కలిగిన గొప్ప వసుదైక కుటుంబం. మరి అలాంటి దేశంలో అందరి అభిప్రాయాలు అవసరం. వారి సూచనలను గౌరవించాల్సిన అవసరం వుంది. నిజానికి జమిలి ఎన్నికల ప్రస్తావన, ప్రతిపాదన ప్రధాని మోడీ 2016 నుంచే తీసుకొస్తున్నారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇప్పటికిప్పుడు తీసుకునే నిర్ణయం మూలంగా జమిలి ఎన్నికలు సాధ్యమా? దీనిపై కేవలం పార్లమెంట్ లో చర్చ జరిగితే సరిపోతుందా? సమాజంలో చర్చ జరగాల్సిన పని లేదా? అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. సరే రాజకీయంగా ఒకసారి దృష్టి సారిద్దాం? జమిలి కమలానికి బలమే(నా)!? అన్న దానికి నిజంగా బలమే! అని చెప్పగలిగే వాళ్లు ఎంత మంది? ఒకవేళ బిజేపి ఆశలు గల్లంతైతే? అప్పుడు కోరికోరి కొరివితో తలగోక్కున్నట్లు కాదా? కేంద్రంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా బిజేపి రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. అందుకు బిజేపి పార్టీయే కారణం అని ఎంత మంది చెప్పగలరు? కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఛరిష్మా తప్ప బిజేపికి అదనంగా కనిపిస్తున్న బలం లేదు. కేంద్రంలో బిజేపి అధికారంలోకి వచ్చి, ప్రధాని మోడీ పదవిలో కొచ్చిన కొత్తలో ఒక ప్రచారం బాగానే సాగింది. అవకాశం వుంటే పదేళ్లు మాత్రమే ప్రధానిగా వుంటారు. ఆ తర్వాత యోగి ఆదిత్యానాధ్ లాంటి వారు రావొచ్చన్నారు. పార్టీ లో 75 ఏళ్లు దాటిన వారు ప్రత్యక్ష రాజకీయాలలో వుండొద్దని తీర్మానం చేసుకున్నారు. మరి అవసరం మేరకు కర్ణాటక లో యడ్యూరప్ప కు అవకాశం కల్పించారు. అదే విధంగా మరో సారి మోడీ అన్నది బలంగా ప్రచారం సాగుతోంది. ప్రధాని మోడీ కూడా పదవీ త్యాగానికి సిద్దంగా ఏమీ లేరు. మరో సారే కాదు, అవకాశం వుంటే ఇంకోసారి కూడా ప్రధాని పదవిలో వుండేందుకే ఇష్టపడతారు. అలాంటప్పుడు మోడీ ని కాదనే శక్తి బిజేపి కి లేదు. ఇక అసలు విషయానికి వద్దాం. మోడీ వల్లే బిజేపి ఈ స్థాయిలో వుందనేది ప్రధాని అనుచర గణం పదే పదే చెప్పే మాట. అందుకే బిజేపి అనగానే గతంలో గుర్తుకొచ్చే ఆరెస్సెస్ ను మోడీ మానియాలో మర్చిపోతోంది. ఇది బిజేపి కి ఆశనిపాతమౌతుంది. భవిష్యత్తు లో బిజేపికి తీరని నష్టం చేకూర్చే ప్రమాదం కూడా వుంది.
అసలు కేంద్రంలో ముందస్తు ముందస్తు అనేది ఎందుకు?
ప్రజలిచ్చిన సమయం కన్నా ముందే ఎన్నికలకు వెళ్లడం ఎందుకు? నిజానికి బిజేపికి ముందస్తు అచ్చి రాలేదు. నాడు వాజ్ పాయ్ ప్రభుత్వానికి ఉపయోగపడిరది లేదు. ఇప్పుడు కూడా బిజేపికి ఆ అవసరం లేదు. ముందస్తు అనేది ఒక బురద. కమలం కోరుకుంటోందా ఆ దురద అనే ప్రశ్న ఉత్పన్నమౌతోంది. కేంద్రంలోనే కాదు, ఉత్తరాది లో కూడా బిజేపి బలంగానే వుంది. అందుకే బిజేపి ఒకటి ఆలోచించుకోవాలి. ఉత్తరాది రాష్టాలైనా, దక్షిణాది రాష్ట్రాలైనా కేంద్రంలో బిజేపి వుంటేనే బాగుండు అనుకుంటున్నాయి. కానీ రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు అధికారంలో వుండాలని కోరుకుంటారు. గతంలో కాంగ్రెస్ కేంద్రం లో అధికారంలో వుండగా కూడా ఇదే జరిగింది. బిజేపి అధికారంలో వుండగా అదే జరుగుతోంది. డబుల్ ఇంజిన్ సర్కారును మెజారిటీ రాష్ట్రాలు ఒప్పుకోవడం లేదు. కేంద్రంలో బిజేపి బలంగా వున్నా కేవలం పది రాష్ట్రాలలో మాత్రమే బిజేపి అధికారం వుంది. కేంద్రం తో పాటు అన్ని రాష్ట్రాలలో బిజేపి అధికారంలో వుండాలంటే జమిలి ఒక్కటే మార్గమని బిజేపి అనుకుంటోంది.
బీజేపీ పార్టీలో పెరిగిన అత్యాశలో మరింత అధికారం దురాశనే జమిలి ఎన్నికలు అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
ఎప్పుడూ మేమే అనుకుంటే ప్రజాస్వామ్యంలో పేరాశే అవుతుందని బిజేపిని ఎత్తిపొడుస్తున్నాయి. జమిలి ఎన్నికలు గతంలో జరిగలేదా? అని గుర్తు చేస్తున్నాయి. టెక్నాలజీ ఇంతలా లేని కాలంలోనే జమిలి ఎన్నికలు అప్పటి ప్రభుత్వాలు ఎంతో సమర్థవంతంగా నిర్వహించాయి. ఏక కాలంలో కాదు, దేశమంతటా ఒకే రోజు ఎన్నికలు జరిగిన రోజులున్నాయి. కానీ ఇప్పుడు రాష్ట్రాల ఎన్నికలను కూడా దఫదఫాలుగా, దశల వారీగా నెలలకొద్ది నిర్వహించడం చూస్తున్నాం. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జరిగిన తొలి ఎన్నిక 1952 నుంచి 1967 వరకు జమిలి ఎన్నికలే జరిగాయి. ఆ తర్వాత రాష్ట్రాలలో కొత్తగా ప్రాంతీయ పార్టీలు రావడం, కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాల మూలంగా ఎన్నికల నిర్వహణ లో మార్పులు జరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా మళ్ళీ జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. అందుకు రాజ్యాంగ సవరణ అవసరం. లోక్సభ, రాజ్యసభలో మూడో వంతు (2ప3) మెజారిటీ అవసరం. లోక్సభ లో కూడా బిజేపి ఆ బలం పూర్తిగా లేదు. రాజ్యసభలో కూడా అవసరమైన మెజారిటీ లేదు. ఇదిలా వుంటే దేశంలోని కనీసం సగం రాష్ట్రాలు అసెంబ్లీలలో తీర్మానం చేయాలి. అది కూడా సాధ్యమయ్యే పని కాదు. ఇవన్నీ అధిగమించి ఎన్నికలకు వెళ్లినా బిజేపి మాత్రమే అధికారంలోకి వస్తుందన్న గ్యారెంటీ లేదు. ఇటీవల పలు రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి. వాటిపై బలవంతంగా ఎన్నికలు రుద్దితే అప్రజాస్వామికమౌతుంది. రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది. ఇవన్నీ తప్పించుకోవడం సాధ్యమేనా? అన్నది కూడా ఆలోచించుకోవాలి.
ఇప్పుడున్న పరిస్థితులు గతంలోనూ వున్నవే. బలమైన ప్రభుత్వాల వల్ల జరిగే నష్టాలు ఇలాంటివే!రాష్ట్రాల హక్కులు హరించడమే! కేంద్రం ఒంటెద్దు పోకడకు మార్గమే! ప్రజాస్వామ్య స్పూర్తికి విఘాతమే!
ఇక్కడ బిజేపి పార్టీ ఒక విచిత్రమైన వాదన ముందుకు తీసుకొస్తోంది.
తరుచూ ఎన్నికలు రావడం వల్ల ఎన్నికల నిర్వహణ ప్రభుత్వాలకు తడిసి మోపెడౌతోందనేది కొందరు చెప్పే మాట. నిజంగా అది నిజమేనా? కేంద్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణ పేరుతో ఐదేళ్ల కాలంలో చేసే ఖర్చు పదివేల కోట్ల రూపాయల లోపే వుంటుంది. ఈ ఖర్చులోనే అన్ని రాష్ట్రాల ఎన్నికలు, కేంద్ర ఎన్నికలు పూర్తవుతాయి. అంటే ఎన్నికల ఖర్చు తగ్గుతుందనేది ఒక సాకు మాత్రమే! ఇక తరుచూ ఎన్నికల మూలంగా అభివృద్ధి కుంటుపడుతుందనేది శుద్ద అబద్దం. కేవలం వచ్చే ఎన్నికలలో కూడా మళ్ళీ అధికారంలోకి రావాలంటే జమిలి ఎన్నికలైతేనే ప్రజలు బిజేపి వైపు నిలుస్తారని ఒక నమ్మకం. సెంటిమెంట్ అస్త్రం నుంచి కొత్త దారి వెతుక్కోవడమే! అంతే!! ఇది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట.