మార్పులు…చేర్పులకు అవకాశం!?

https://epaper.netidhatri.com/

`లేదనుకోకండి…అక్కడిదాకా తెచ్చుకోకండి?

`ప్రజలకు చేరువ కాకపోతే మార్పు తధ్యం?

`ప్రజలకు చేరువైతేనే బి ఫామ్స్‌!

`అభ్యర్థుల ప్రకటనతోనే అంతా ఐపోలేదు.

`అసలు సినిమా ముందుంది.

`ఎక్కడ అసంతృప్తి వున్నా అక్కడ సీటు చిరుగుతుంది.

`టికెట్‌ నాకే వచ్చింది… నా దగ్గరకు రండి అనేది మానుకోండి.

`నేనొస్తున్నా…అని శ్రేణుల మనసు చూరగొనండి.

`టికెట్‌ పార్టీ ఇచ్చినా గెలిపించేది కార్యకర్తలే.

`కార్యకర్తలకు అండగా వుండండి.

`ప్రచారం విసృతంగా చేయండి.

`వంద రోజుల ప్రయాణం… నాయకులను కలుపుకుపోతేనే విజయం.

`బలంగా వున్నప్పుడు మరింత బాధ్యత అవసరం.

హైదరబాద్‌,నేటిధాత్రి: 

ఇల్లు అలకగానే పండగ కాదు. గత ఎన్నికల లాగా ఈసారి కూడా ముఖ్యమంత్రి కేసిఆర్‌ అభ్యర్థులను ప్రకటించారు. కానీ అందులో మర్మం మరింత దాగి వుంది. అది ఇప్పుడే ఎమ్మెల్యే లకు అర్థం కాకపోవచ్చు. అయితే జాగ్రత్తగా వున్న ఎమ్మెల్యేలకు మాత్రం ఎలాంటి ఢోకా వుండదు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ విషయంలో ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. ఆయన అభయమిచ్చారంటే తప్పరు. కానీ ఆ అభయం వృధా చేస్తే క్షమించరు. అలాంటిదే ఇక్కడ ఒక విషయం ప్రస్తావించుకోవాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో చేర్యాల నియోజకవర్గం నుంచి కొమ్మూరి ప్రతాపరెడ్డికి అవకాశం మూడు సార్లు అవకాశం కల్పించారు. రెండు సార్లు కొమ్మూరి చేర్యాల నుంచి గెలిచారు. 2009 డిలిమినేషన్‌ లో జనగామలో చేర్యాల ప్రాంతం కలిపేశారు. దాంతో జనగామ నుంచి కొమ్మూరి కి కేసిఆర్‌ అవకాశం ఇచ్చారు. కానీ కొమ్మూరి అంతగా ఎన్నికలను సీరియస్‌ గా తీసుకోలేదు. ఓడిపోయాడు. అప్పుడు కేసిఆర్‌ పక్కన ఉద్యమం కోసం నిలబడాల్సిన కొమ్మూరి పదవులకు ఆశపడి పార్టీ మారాడు. అనంతరం తెలంగాణ వచ్చింది. కొమ్మూరి సొంత గూటికి వచ్చే ప్రయత్నం చేశాడు. కానీ కేసిఆర్‌ దరిచేరనివ్వలేదు. అలాగే మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌ కుమార్‌ కూడా ఇలాగే వ్యవహరించారు. దాంతో పక్కన పెట్టారు. ఇలా తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతో ప్రాధాన్యతనిచ్చినా నిలిలపుకోని వారిని నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టారు. పట్టుదలలో అంతగా కఠినంగా వుంటారు. అందువల్ల అవకాశం ఇచ్చినా దుర్వినియోగం చేసిన వారికి క్షమించడం అన్నది కేసిఆర్‌ చరిత్రలో లేదు. అది తెలుసుకోవాలి. అభ్యర్థుల ప్రకటన వెనుక ముఖ్యమంత్రి కేసిఆర్‌ వ్యూహం ఎమ్మెల్యేలకు పూర్తిగా అర్థమైనట్లు లేదు. గతంలో లాగా ప్రకటించిన అందరికీ బి ఫామ్‌ లు ఇచ్చినట్లు ఈసారి వుండకపోవచ్చన్న సంకేతాలు అందుతున్నాయి. ఈ విషయాన్ని గతంలోనే ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎమ్మెల్యే లను ఒకటికి రెండుసార్లు హెచ్చరించారు. అయినా తీరు మారని ఎమ్మెల్యేలలో కొందరిని ఇప్పటికే పక్కన పెట్టారు. పక్కన పెట్టి ఇతర అభ్యర్థులను ప్రకటించిన నియోజకవర్గాల గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా స్టేషను ఘనపూర్‌ నియోజకవర్గం విషయమే ప్రస్తావించాల్సి వస్తే అనేక ఆరోపణలు, వివాదాలు, విమర్శలు చూసినవే. 2014 ఎన్నికలలో స్టేషను ఘనపూర్‌ నుంచి గెలిచిన రాజయ్యకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. కానీ దానిని రాజయ్య నిలుపుకోలేకపోయారు. అయినా ముఖ్యమంత్రి కేసిఆర్‌ రాజయ్యను పక్కన పెట్టలేదు. అయినా ఆ ఐదేళ్లలో రాజయ్య చిలిపి చేష్టలు పెద్ద దుమారమే అయ్యాయి. అయినా ముఖ్యమంత్రి కేసిఆర్‌ గత ఎన్నికలలో అవకాశం కల్పించారు.

కానీ రాజయ్యలో ఎలాంటి మార్పు రాలేదు. పైగా అదే నియోజకవర్గంలో మరో బలమైన కడియం శ్రీహరి నాయకుడుగా వున్నారు. కనీసం ఆ ఆలోచనతో నైనా జాగ్రత్తగా వుండాల్సింది. మార్పు రాలేదు. స్కూలులో విద్యార్థిని చేత అన్నం తినిపించుకోవడం వంటి విచిత్రమైన చేష్టలు చేస్తూ వచ్చాడు. ఇటీవల ఓ గ్రామ మహిళా సర్పంచ్‌ తో వివాదం కాస్త పదవికి గండం తెచ్చింది. ఇక జనగామ లాంటి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తన తీరును మార్చుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. తెలంగాణ ఉద్యమం లో పని చేసిన రాజయ్య, తెలంగాణ వచ్చిన తర్వాత వివాదాల కోరి తెచ్చుకున్నాడు. ముత్తిరెడ్డి కూడా అదే దారిలో నడిచాడు. జనగామ జిల్లా కలెక్టర్‌ దేవసేనతో గొడవతో మొదలు ఒకటి కాదు, రెండు కాదు వివాదాలకు లెక్కే లేదు. ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మీడియా రాస్తూనే వుంది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ హెచ్చరిస్తూనే వున్నారు. అయినా ముత్తిరెడ్డి లో మార్పు రాలేదు. ఆఖరుకు తన కూతురు రూపంలో ముత్తిరెడ్డి రాజకీయం ముగింపు దశకు చేరింది. ఇలా చే జేతులా సీటు కోల్పోయిన ఇద్దరు నేతలున్నారు. అయితే టికెట్‌ ప్రకటింపబడిన నేతలకు వివాదాలు లేవనుకోవడం పొరపాటు. వాటిని ఇప్పటికైనా సరిదిద్దుకోండి. వంద రోజుల సమయం ఇచ్చింది అందుకే..మారుతారా? మార్చమంటారా? అని హెచ్చరిక జారీ కూడా ప్రకటనలోనే వుంది. అది గమనించండి. ఎందుకంటే మూడు నెలల సమయంలో మార్పులు…చేర్పులకు అవకాశం!? వుంది. లేదనుకోకండి.

కొన్ని నియోజకవర్గాలలో టికెట్‌ దక్కుతుందని భావించిన వారికి సైతం టికెట్‌ దక్కలేదు.

 అందుకు కూడా ఓ కారణం వుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు లాంటి వారికే టికెట్‌ దక్కలేదు. తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నికలలో ఓటమి పాలయ్యారు. అయినా ఆయనను పిలిచి ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎమ్మెల్సీ ఇచ్చారు. మంత్రి పదవి కల్పించారు. పాలేరు ఉప ఎన్నికల్లో అవకాశం కల్పించారు. ఇన్ని చేసినా 2018 ఎన్నికలలో తుమ్మల నాగేశ్వరరావు ఓడిపోయారు. అలాంటి నేతలు ఇంకా నాకు అవకాశాలు కావాలని కోరుకోవడం సమంజసం కాదు. అయినా ఆయన అసంతృప్తి తో వున్నారని భుజ్జగింపుల పర్వం సాగుతొంది. అలా అని అసంతృప్తులందరికీ బుజ్జగింపులు అంటే కదరని అంశం. 

అందుకే ప్రజల్లో వుండండి. నిరంతరం ప్రజలతో పాటు, పార్టీ నేతలతో సఖ్యత మరింత పెంచుకోండి. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎమ్మెల్యేల పని తీరు మీద నిఘా ఏర్పాటు చేశారు..మార్పులు వుండవన్న ధీమాతో గతంలో వ్యవహరించినట్లు వ్యవహరించకండి. ప్రజలతో మరింత మమేకం కండి. టికెట్‌ రాగానే బి. ఫామ్‌ వచ్చినట్లు కాదు. బి. ఫామ్‌ రాగానే గెలిచినట్లు కాదు. రాజకీయాలలో అనేక మలుపులుంటాయి. ఎన్నికలలో మార్పులు కూడా వుంటాయి. లేవనుకోకండి…అక్కడిదాకా తెచ్చుకోకండి? ఎందుకంటే తుమ్మల నాగేశ్వరరావు రావు కూడా బిఆర్‌ఎస్‌ ప్రభంజనం లో ఓడిపోయారు. రికార్డు మెజారిటీలతో బిఆర్‌ఎస్‌ కొత్త ఎమ్మెల్యేలు తెలంగాణ వ్యాప్తంగా గెలిస్తే, సీనియర్‌ తుమ్మల ఓటమిపాలయ్యారు. అంటే అతి విశ్వాసం కూడా కొన్ని సార్లు బెడిసికొడుతుంది. గాలిలో గెలిచి నాయలైన వాళ్లైనా సరే, మళ్ళీ మళ్ళీ గెలవాలంటే ప్రజల్లోనే ఎక్కువగా వుండాలి. వివాదాలకు చాలా దూరంగా వుండాలి. 

 ప్రజలకు చేరువ కాకపోతే మార్పు తధ్యం? ప్రజలకు చేరువైతేనే బి ఫామ్స్‌!  

అభ్యర్థుల ప్రకటనతోనే అంతా ఐపోలేదు. అసలు సినిమా ముందుంది. ఎక్కడ అసంతృప్తి వున్నా అక్కట సీటు చిరుగుతుంది.

 టికెట్‌ నాకే వచ్చింది… నా దగ్గరకు మీరే రండి..అనే మాటలు వదిలేయండి. నేనొస్తున్నా…అని శ్రేణుల మనసు చూరగొనండి. టికెట్‌ పార్టీ ఇచ్చినా గెలిపించేది కార్యకర్తలే.

కార్యకర్తలకు అండగా వుండండి.

ప్రచారం విసృతంగా చేయండి.వంద రోజుల ప్రయాణం… నాయకులను కలుపుకుపోతేనే విజయం. బలంగా వున్నప్పుడు మరింత బాధ్యత అవసరం. ఇప్పటికే అభ్యర్థుల మార్పుపై విసృత ప్రచారం జరుగుతోంది. నిప్పు లేనిదే పొగరాదు. మీరు మారకపోతే మీ స్థానంలోకి మరొకరు వచ్చేస్తారు. గత ఎన్నికలలో మార్చలేదు..అనేది కాదు. కేసిఆర్‌ ఎప్పుడు ఎలాంటి ఎత్తుగడ వేస్తాడన్నది ఎవరూ చెప్పలేరు. ఇంకా ఎన్నికలకు చాలా సమయం వుంది. ఈ లోపు ఏ ఎమ్మెల్యే విషయంలోనైనా తప్పుడు సంకేతాలు వెళ్లినా ఉపేక్షిస్తాడని మాత్రం అనుకోవద్దు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఒక్కసారి కాదనుకుంటే దరి చేరనివ్వరు. చే జేతలా చేతికి వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోకండి. టికెట్‌ రానివాళ్లు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. భోరున విలపిస్తున్నారు. ఎంత చెప్పినా వినకపోతిమని ఇప్పుడు రియలైజ్‌ అవుతున్నారు. పుణ్యకాలం పూర్తయిన తర్వాత ఎంత ఎదురుచూసినా వృధా ప్రయాసే అవుతుంది. తస్మాత్‌..జాగ్రత్త.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!