నర్సంపేట,నేటిధాత్రి :
ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులపై దాడి పట్ల ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద ఆ శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.అనంతరం పట్టణ కార్యదర్శి పైసా గణేష్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు గత మూడేళ్ల నుండి స్కాలర్ షిప్ లు, ఫీజు రియంబర్స్మెంట్ లు విడుదల చేయలేదని అన్నారు. అసెంబ్లీ సమావేశాలలో నూతన విద్యా విధానం 2020 అమలు చేయకూడదని చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టగా ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులపై పోలీసులు అత్యుత్సాహంతో దాడిచేసి అరెస్టులతో వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారని అలాగే కొందరు నాయకులను ముందస్తుగా అరెస్టులు చేశారని ఈ అక్రమ దాడులు, అరెస్టులకు భయపడేది లేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బకాయి నిధులను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నర్సంపేట పట్టణ అధ్యక్షుడు మోహన్, నాయకులు రాజు, తరుణ్, నితిన్, వంశీ ,సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.