లేని పెత్తనం’పొంగు’తోంది!?

`‘కమ్మ’ను దాటి ఖమ్మంలో ‘రెడ్డి’ గెలిచేనా?

`‘రెడ్డి’ ముందు ‘రావు’లు సాగిలపడేనా?

`మొత్తంగా కాంగ్రెస్‌ కొంప మునిగేనా?

`పొంగులేటి లేని పోరు కాంగ్రెస్‌ వల్ల కాదా?

 `పొంగులేటి ముందు పార్టీ మోకరిల్లడమా?

`డబ్బు చుట్టూ ఖమ్మం కాంగ్రెస్‌ రాజకీయమా?

`ఖమ్మంలో ప్రజా బలం వున్న నాయకులకు కొదువా?

-పార్టీని నిలబెడుతున్న భట్టి బలం చాలదా?

– రేణుకా చౌదరి అభయం, అనుభవం సరిపోదా?

-పార్టీని బతికిస్తున్న నాయకుల బలానికి కొదువా?

-అసలుపొంగులేటి పవరెంత?

`డాబు,డాంబికమంత!?

`డబ్బు తోనే రాజకీయాలు సాగవు?

`పైన పటారం లోన లొటారం!

`పొంగులేటి అంత బలవంతుడైతే గత ఎన్నికలలో బిఆర్‌ఎస్‌ కు సీట్లెందుకు రాలేదు?

హైదరబాద్‌,నేటిధాత్రి:  

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీని చూస్తే జాలేస్తోంది. 135 సంవత్సరాల పార్టీ అని చెప్పుకునే పార్టీకి దిక్కూ దివానం లేనట్లు, కొత్తగా ఎవరైనా పార్టీలో చేరితేనే బతికి బట్టకడుతుందన్నట్లు సాగుతున్న వ్యవహారం విచిత్రంగా వుంది. పైగా కర్నాకట గెలుపుతోనే కాంగ్రెస్‌కు ఆశలు చిగురించినట్లు, అంతకు ముందు కాంగ్రెస్‌ పార్టీకి జీవమే లేనట్లు ఆత్మహత్యా సాదృష్యమైన ప్రచారం, ఆ పార్టీకి తీరని నష్టం చేకూర్చుతుందే తప్ప లాభం కాదు. ఇదిలా వుంటే నేటిధాత్రి చాలా స్పష్టంగా ఇప్పటికే చెప్పింది. పొంగులేటి రాజకీయం వెనకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పాత్ర వున్నట్లు రాయడం కూడా జరిగింది. ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి గురువారం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని కలిసినట్లు కూడా వార్తలు వచ్చాయి. అంతే కాకుండా ఏ లక్ష్యం కోసమైతే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరాడో అది నెరవేరకపోయే పరస్ధితులు ఎదురయ్యేలా సూచనలు కనిపిస్తున్న విషయం జగన్‌కు వివరించినట్లు తెలుస్తోంది. నిజానికి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేత ఏకంగా సొంతంగా పార్టీని ఏర్పాటు చేసే యోచన జగన్‌ చేశారని సమాచారం. అప్పటికే షర్మిల కూడా పార్టీ కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో పొంగులేటి పెట్టిన పార్టీలో షర్మిల జాయిన్‌ అయినా తెలంగాణ వ్యతిరేకి అన్న సంకేతాలు వెళ్తాయి. ఒక వేళ షర్మిల పార్టీలో శ్రీనివాస్‌రెడ్డి చేరితే తాను ఏం చేయదల్చుకున్నాడో..చెప్పదల్చుకున్నాడో చెప్పకుండానే తెలిసిపోతుంది. అందుకే ఉభయకుశలోపరిగా కాంగ్రెస్‌లో పొంగులేటి జాయిన్‌ అయితే, ఆ తర్వాత షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తే సరిపోతుంది. అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. తెలంగాణ కాంగ్రెస్‌లో షర్మిల పెత్తనం మొదలౌతుంది. ఇదీ అసలు స్కెచ్‌. అదే దారిలో పక్కా ప్రణాళిక సాగుతోంది. అందుకే షర్మిల కర్నాటకకు చెందిన డి.కే. శివకుమార్‌ను అభినిందించినట్లు ప్రచారం చేశారు. తర్వాత షర్మిల కాంగ్రెస్‌లో చేరే అవకాశాలున్నట్లు ఫీలర్లు వదిలారు. ప్రజల స్పందన తెలుసుకునే ప్రయత్నం జరిగింది. ఎక్కడా తెలంగాణ ప్రజలు వ్యతిరేకించినట్లు కనిపించలేదు. షర్మిల ఒక్కతే తెలంగాణ రాజకీయాలు చేయడం అంత సులువు కాదు. ఆమెను నమ్మెందుకు ప్రజలు కూడ సిద్దంగా లేదు. ఆంధ్రప్రదేశ్‌లో పవన్‌ కళ్యాణ్‌ పరిస్ధితి ఎలా వుంటుందో ఇక్కడ షర్మిల రాజకీయం అంతే వుంటుందని అంచనా వేశారు. దాంతో ఎలాగైనా తెలంగాణ రాజకీయాల్లో షర్మిల కీలకం కావాలి. చక్రం తిప్పగలగాలి. తెలంగాణ రాజకీయాలను శాసించే దాకా పెరగాలి. అందుకు జగన్మోహన్‌రెడ్డి ఆర్ధిక సహాకారం, కేవిపి. చాణక్యం తోడవ్వాలి. ఇదీ అసలు సంగతి. అందుకే రాహుల్‌ గాంధీ ఖమ్మం సభ తర్వాత గన్నవరంలో కేవిపి కలిశారు. మరునాడు ఉదయమే షర్మిల గురించి కేవిపి. రామంచంద్రరావు ప్రకటన చేశారు. ఇదంతా పైకి కనిపిస్తున్నట్లు కొత్త విషయం కాదు. చాలా కాలంగా జరిగుతున్న కసరత్తు అన్నది నేటిధాత్రి ముందు నుంచి చెబుతోంది…తెలంగాణ రాజకీయాల్లో వేలుపెట్టేందుకు , గుప్పిట్లోకి తీసుకునేందుకు షర్మిలను తెలంగాణ నాయకురాలను చేసేందుకు జగన్మోహన్‌రెడ్డి వేసిన ప్లాన్‌ ఇప్పటిదికాదు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాజకీయాన్ని ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎప్పుడో గమనించారు. అందుకే ఆయనను ఎప్పుడో పక్కనపెట్టారు. తెలంగాణ రాజకీయాలను , కేసిఆర్‌ వ్యూహాలను ఎప్పటికప్పుడు పసికట్టేందుకే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి బిఆర్‌ఎస్‌లోకి పొంగులేటిని పంపించారన్నది దీనితో స్పష్టమైంది. అంతే కాదు బిఆర్‌ఎస్‌నుంచి బైటకు వెళ్లిన వెంటనే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జగన్‌ను కలవడం జరిగింది. అప్పుడే నేటిధాత్రి ఆ మైత్రిలో ఆంతర్యాన్ని అంచనా వేసింది. తర్వాత పరిణామాలను తెలియజేస్తూవస్తోంది. ఖమ్మం సభ జరిగిన తర్వాత ఇదే విషయాన్ని నేటిధాత్రి రాయడం జరిగింది. కాంగ్రెస్‌లో వైఎస్‌. అనుచరగణమంతా ఏకమౌతోంది? పిసిసి. అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని ఏకాకిచేసే ఎత్తుగడ వేస్తున్నారన్నది తెలియజేయడం జరిగింది. 

ఒక్కసారి పొంగులేటి ఎపిసోడ్‌ను పూర్తిగా పరిశీలిస్తే, ఏ ఒక్క కాంగ్రెస్‌ నాయకుడు కూడా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాకను ప్రశ్నించలేదు.

 కేవలం ఒక్క రేణుకా చౌదరి మాత్రమే పొంగులేటి రాకను వ్యతిరేకిస్తూ వచ్చారు. ఇప్పటికీ ఆమె అదే స్టాండ్‌ మీద వున్నట్లు కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే పొంగులేటి కాంగ్రెస్‌లో చేరడం అంటే అదేదో అద్భుతం జరిగిపోతుందన్నంతగా ప్రచారం చేస్తూ వచ్చారు. అసలు అంతటి ప్రచారం గతంలో ఏ కాంగ్రెస్‌ నేతకు జరగలేదు. పిసిసి. అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరినప్పుడు కూడా ఇందులో కనీసం పదో వంతు ప్రచారం కూడా జరలేదు. అటు, ఇటూ అంటూ గోడ మీద పిల్లిలా పొంగులేటి ఎటు చూస్తే అటు, ఆ పార్టీకి ఇక తిరుగులేదన్నట్లు ప్రచారం జరిగింది. చివరికి కాంగ్రెస్‌లోకి పొంగులేటి వెళ్లడాన్ని ఈ దశాబ్ధికే ఒక అధ్భుతమైన ఘట్టం ఆవిషృతమైనంత గొప్పగా వందిమాగదలు ప్రచారం చేశారు. కాని అసలు లోగుట్టు తెలుసుకోలేకపోయారు. అసలు తెలంగాణ కాంగ్రెస్‌లో నాయకులే లేనట్లు, ఆ పార్టీలో చీకటిలో వున్నట్లు, పొంగులేటి ఒక వెలుగు సూర్యుడైనట్లు ఏం ప్రచామది? కాంగ్రెస్‌లోకి పొంగులేటి రావడమే ఒక వరమన్నట్లు ఇంకా ప్రచారం సాగుతూనేవుంది. పొంగులేటి కాంగ్రెస్‌లోకి వచ్చి అంపశయ్య మీద వున్న కాంగ్రెస్‌కు తులిసి తీర్ధమందించినట్లు కూడా గొప్పలకు పోతున్నారు. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్‌కు ఇన్‌స్టంట్‌ శక్తికోసం పొంగులేటి గ్లూకోస్‌ అవసరం అన్నంతగా ఆయన రాకకోసం కొందరు కాంగ్రెస్‌ నాయకులు పాకులాడారు. ఆయన ఇంటికి పరుగులు పెట్టారు. ఇక భవిష్యత్తు కాంగ్రెస్‌కు జవసత్వాలు రావాలంటే పొంగులేటి అనే హర్లీక్స్‌ లేకపోతే కాంగ్రెస్‌కు కష్టమే అన్నంతగా నాయకులు ఆయన రాకకోసం ఆరాటపడినంతగా సాగిలపడడం విచిత్రం. కొత్తగా ఇప్పుడే కాంగ్రెస్‌ నేతలు కాజు, బాదంలు తింటున్నట్లు, బలవంతులౌతున్నట్లు మరీ విచిత్రం చేస్తున్నారు. ఖమ్మం లాంటి సభలు గతంలో నిర్వహించనట్లు, నా సభ చూశారా…నా ప్రతానం చూశారా…అన్నట్లు పొంగులేటి గొప్పలు చెప్పుకోవడం చూస్తే కాంగ్రెస్‌ను శాసించేది నేనే అన్నంతగా పొంగులేటి ధీమా చూపిస్తున్నాడు. పొంగులేటి రాకతో సీనియర్‌ నాయకులుంతా పక్కకుపోయినంత పనైంది. కాని ఆయన మాత్రం కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన భరోసా ప్లకార్డును పక్కన పెడేసినట్లు, ఎప్పుడైనా కాంగ్రెస్‌ను నిండా ముంచడం ఖాయమన్నది ఆరోజే తెలిపోయింది. అంతే కాదు నేను లేనిదే కాంగ్రెస్‌ లేదన్నట్లు, బతికి బట్టకట్టేలా లేదన్నట్లు పొంగులేటి మీడియా సమావేశాలు చూస్తే అర్ధమౌతోంది. కాంగ్రెస్‌లో రూపాయి పెట్టే శక్తి వున్న నాయకుడు ఎవరూ లేరన్నట్లు , తన డబ్బులతోనే కాంగ్రెస్‌ బతకాలన్నట్లు శాసించే స్ధాయిలో వున్నట్లు కూడా ఆయన హవభావాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రపార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇక్కడ కూడా ఘోర పరాభవాన్ని చూసే రోజులు కళ్లముందు కనిపిస్తున్నాయా? అన్న అనుమానం సగటు కాంగ్రెస్‌ కార్యకర్త కూడా వ్యక్తం చేస్తున్నాడు. ఎందుకంటే ఖమ్మంలో కాంగ్రెస్‌ పార్టీ ఆది నుంచి బలంగానే వుంది. తెలంగాణ వచ్చాక కూడా ఖమ్మంలో 2014లో 9 సీట్లు కాంగ్రెస్‌ గెల్చుకున్నది. గత ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ ఎక్కువ సీట్లు సాధించింది. మరి గత ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌లోవున్న పొంగులేటి ఆ పార్టీని ఎందుకు గెలిపించలేదు. ఇప్పుడు బిఆర్‌ఎస్‌ను అసెంబ్లీ గేటు తాకనివ్వనంటూ చేసిన బీరాలు పలికారు. నిజంగా పొంగులేటికి అంత బలమేవుంటే సొంతంగా పార్టీ పెట్టి, తన బలం నిరూపించాలి. కాని ఆయన హిడెన్‌ ఎజెండా ఏమిటో తెలిపోయింది. బిఆర్‌ఎస్‌లో చేరి ఆపార్టీని చెడగొట్టాలని చూశాడు. కాని కుదరలేదు. ఇప్పుడు కాంగ్రెస్‌ను ఖతం చేసి, షర్మిల చేతిలో పెట్టేందుకు జగన్‌ పద్మ వ్యూహంలో పొంగులేటి తనకు తానుగానే చిక్కుకుంటున్నాడు. అంతే…!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!