` రెడ్లకు మాత్రమే రెడ్ కార్పెట్!
` బడుగులు ఓట్లకు…రెడ్లు సీట్లకు!
` కాంగ్రెస్ తోనే రెడ్లకు పూర్వ వైభవం?
` ఇదే అంతటా రేవంత్ చేస్తున్న ప్రచారం!
` అమెరికాలో వున్నా, ఇంకెక్కడున్నా రెడ్లనే తెస్తాం?
` రెడ్లకే టిక్కెట్లిస్తాం?
` తెలంగాణ లో రెడ్ల రాజ్యం తెస్తాం?
` ఓట్లు బడుగులవి…రాజ్యం రెడ్లది!
` కాంగ్రెస్ లో ఇప్పుడు, ఎప్పుడూ కనిపించే ధోరణి?
` రేవంత్ ప్రకటించిన ఘర్ వాపసీ అందుకే!
` రెడ్లను మళ్ళీ ఏకం చేసేందుకే?
` బడుగులలో ఎంత బలవంతుడైనా పక్కకు పెట్టాల్సిందే?
` పొన్నాలను గతంలోనే దూరం పెట్టిన సంగతి తెలిసిందే!
` హనుమంతన్నకు ఎప్పుడూ మెండిచేయే?
` దామొదర రాజనర్సింహకు అడుగడుగునా అవమానమే!
` బలమైన సమాజంలో బడుగులే బలహీనులా?
`బలం లేని రెడ్డీలకే పెత్తనమా?
` రెడ్డిలకే రాజ్యమా? బడుగులు ఓట్లకే పరిమితమా?
`ప్రచారానికి పనికొచ్చే కూలీలతో సమానమా?
` రెడ్ల ఆధిపత్యం కోసం ఏకమౌతున్న కుల రాజకీయమా?
హైదరబాద్,నేటిధాత్రి:
తెలంగాణలో మళ్లీ రెడ్డి రాజకీయం మొదలైంది. కాంగ్రెస్ పార్టీ వేధికగా మళ్లీ చిగురిస్తోంది. రెడ్ల పెత్తనానకి వేళయ్యింది. కాంగ్రెస్‌లో ఇతరులకు వున్న ప్రాధాన్యత కోల్పోయే ప్రమాదముంది. ఇతర సామాజిక వర్గ నేతలు కనీసం గాంధీ భవన్ మెట్టు ఎక్కలేని పరిస్ధితి మళ్లీ రానున్నది. ఆ మధ్యనే జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల సమయంలో ఏం జరిగిందో అందరూ చూశారు. సాక్ష్యాత్తు మాజీ పిసిసి. అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు సంబంధించిన నాయకులకు ఓటింగ్ వేసేందుకు అవకాశం వున్నప్పటికీ గాంధీ భవన్లో వారికి ఎంట్రీ లేకుండాచేశారు. బడుగులపై రెడ్డి పెత్తనానికి అప్పటికే తెరతీశారు. అంతే కాకుండా తెలంగాణ ఉద్యమ సమయంలో ఉప ముఖ్యమంత్రిగా ఉద్యమానికి చోదోడు వాదోడుగా వున్న దామోదర రాజనర్సింహ కూడా గాంధీ భవన్ ముందు ధర్నా చేయాల్సిన అవసరం ఏర్పడిరది. కారణం వీళ్లు బడుగు నేతలు కావడమే కాంగ్రెస్‌లో కొనసాగడమే శాపంగా పరిణమించింది. ఈ మధ్య కాలంలో ఇంతలా బడుగులపై కాంగ్రెస్‌లో వివక్ష కనిపించలేదు. కాని పిసిసి. అధ్యక్షుడుగా రేవంత్ బాధ్యతలు చేపట్టిన తర్వాతే ఈ అరాచకం మరీ ఎక్కువైందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొన్నటిదాకా కాంగ్రెస్‌లో వున్న రెడ్డి సామాజిక వర్గ నేతలు బైటకి కొట్లాడుకుంటున్నట్టు నటించినప్పటికీ, కాంగ్రెస్‌పార్టీజాతీయ అధ్యక్షుడి ఎన్నికల్లో ఏ ఒక్క రెడ్డి నాయకుడు వీధికెక్కన సందర్భం లేదు. కేవలం బడుగు నేతలకే తీవ్ర అవమానం జరిగింది. అయినా వాళ్లు కాంగ్రెస్ పార్టీకోసమే జీవితాంతం పనిచేస్తూ వస్తున్నారు. కాని ఒక్కసారిగా తెలంగాన కాంగ్రెస్‌లో రెడ్డి రాజకీయం చోటు చేసుకోవడం అంటే, బడుగులకు తీవ్ర అన్యాయం జరిగేందుకు ఇవి తొలి సంకేతాలే అని చెప్పకతప్పదని సొంత పార్టీ నేతలే అంటున్నారు. ఇలా రెడ్డి రాజకీయం కాంగ్రెస్‌లో ముదిరితే బడుగులకు టిక్కెట్లు కష్టమే అన్నది జరుగుతున్న చర్చకు నిదర్శనం.
అదేంటో రాజకీయాలంటే రెడ్డిలకు వున్నంత స్వేచ్ఛ ఏ సామాజిక వర్గానికి వుండదు.
వ్యక్తిగత స్వార్ధం కోసం ఒకరినొకరు గొడవకు దిగినా, వ్యవస్ధ పరమైన అవసరం అనుకున్నప్పుడు ఆ సామాజిక వర్గమంతా ఏకం కావడం ఒక్క రెడ్డిలలోనే చూస్తుంటాం. ఇది ఇప్పుడు కాంగ్రెస్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. గత ఆరు నెలల క్రితం వరకు కాంగ్రెస్‌లో ఉప్పు,నిప్పులాగా వున్న నేతలందరూ నేతుల వాసనతో కనిపిస్తున్నారు. అంటే అంతా ఒక్కటయ్యారు. ఈసారి కలిసి కట్టుగా లేకపోతే ఇక తెలంగాణలో రెడ్ది రాజకీయం కష్టమన్న భావనకు వచ్చేసినట్లు తెలుస్తోంది. అందుకే కాంగ్రెస్‌లో కూడికలు పెరిగాయి. ఎక్కడా తీసివెత అన్న మాటలు లేకుండా పోయాయి. మొత్తానికి తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గమంతా ఏకం కావడానికి ముందుగా ఘర్ వాపసీ అనే కార్యక్రమం చేపట్టారు. గతంలో ఓసారి అమెరికా వెళ్లినా, ఎడమొహం, పెడ మొహం పెట్టుకున్న రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, ఆసారి కలిసి అమెరికా వెళ్లారు. మేం కలిసిపోయామని సంకేతాలు ఇస్తున్నారు. పననిలో పనిగా పార్టీని వీడి వెళ్లిన రాజగోపాల్‌రెడ్డిని కూడా పార్టీలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ ఇకదేశంలోనే లేచే పరిస్ధితి లేదు. తెలంగాణలో అసలే లేదు. ఇక కాంగ్రెస్‌కు నూకలు చెల్లినట్లే అన్నంత మాటలు మాట్లాడిన రాజగోపాల్‌రెడ్డికి మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పేందుకు చూస్తున్నారు. ఇక ఇటీవల పార్టీలో చేర్చుకొని ప్రోత్సహిస్తున్న వారిలో అందరూ రెడ్డిలే. ఒకప్పుడు టిఆర్ఎస్లో వున్న కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి లాంటి వారిని ప్రోత్సహిస్తూ, పిసిసి. మాజీ అధ్యక్షుడైన పొన్నాలను ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఇదే పొన్నాల మీద గతంలో ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా వున్న జంగా రాఘవరెడ్డిని ఉసిగొల్పే రాజకీయాలు చేశారు. ఇప్పుడు కొమ్మూరికి మాటిచ్చి, జనగామలో ఆ కాస్త బడుగుల రాజకీయాన్ని దూరం చేయడానికి చూస్తున్నారు. మొత్తం పార్టీని తన భుజస్కంధాల మీద వేసుకొని, 2014 ఎన్నికల ప్రచారం బాధ్యతలు మోసిన పొన్నాలకు రాజకీయాలు దూరం చేస్తున్నారు.
ఇక ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని తీసుకొని, అక్కడ కూడా అదే పనిచేసేందుకు సిద్ధమౌతున్నారు.
ఖమ్మంలో పట్టు కోసం రెడ్డి రాజకీయం మొదలుపెట్టారు. ఇలా జిల్లాల వారిగా రెడ్డి సామాజిక వర్గ నేతలను ప్రోత్సహించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన అనేక మంది రెడ్డి నేతలకు గాలం వేసి, టిక్కెట్లు ఇస్తామని ఆఫర్ ఇస్తున్నట్లు కూడా సమాచారం. పట్నం మహెందర్‌రెడ్డి లాంటి వారిని తీసుకొని పోయిన రెడ్డి రాజకీయంతో చక్రం తిప్పుదామని చూస్తున్నారు. తమ దారిలోకి కొండా విశ్వేశ్వరరెడ్డిని కూడా తెచ్చుకునే ప్రయత్నం కూడా సాగుతున్నట్లు చెబుతున్నారు. మహబూబ్‌నగర్‌లో మాజీ మంత్రి డి.కే అరుణ లాంటి వారిని మళ్లీ పార్టీలోకి తెచ్చే సంప్రదింపులు సాగుతున్నట్లు తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్‌లో క్రియాశీలక పాత్ర పోషించి, ఉమ్మడి రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన నాయకులు, తెలంగాణ వచ్చిన తర్వాత ఈ తొమ్మిదేళ్లు కాంగ్రెస్ కోసమే పనిచేస్తున్నవారు చాల మంది వున్నారు. అందులోనూ బడుగు నేతలే ఎక్కువ వున్నారు. కేవలం రెడ్డి రాజకీయం కోసమే వారిని పక్కన పెట్టే కుట్రకు తెరతీసినట్లు సమాచారం అందుతోంది. ఒకప్పుడు డాలర్ లక్ష్మయ్యగా వరంగల్ రాజకీయాలకు పెద్ద దిక్కుగా పనిచేసి, పార్టీ కార్యక్రమాల కోసం ఎంతో శ్రమ పడిన పొన్నాల లక్ష్మయ్య లాంటి వారికి సేవలను పార్టీకి దూరం చేయడం సరైంది కాదు. 2014లో పార్టీ ఓడిపోయినా, ఆయన ఓడిపోయినా పొన్నాల పార్టీకి ఏనాడు దూరం కాలేదు. పార్టీ కార్యక్రమాలకు దూరం గా వుండలేదు. కరోనా సమయంలో కూడా ఆయన ఎంతో ఆక్టివ్‌గా పార్టీ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లారు. ప్రభుత్వాన్ని నిత్యం విమర్శించడంలో అందరికంటే ముందున్నారు. అయినా అలాంటి బిసి. నేతను గత ఎన్నికల సమయంలోనే పక్కన పెట్టే ఎత్తుగడ వేశారు. 2014 ఎన్నికల్లో పొన్నాల చేతిలో బిఫామ్ తీసుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, 2018 ఎన్నికల్లో పొన్నాలకు టికెట్ కట్ చేశారు. ఆఖరుకు ఆయన డిల్లీలో పోరాటం చేసి ఆఖరు నిమిషంలో టికెట్ తెచ్చుకున్నారు. మనోవేధనుకు గురయ్యారు.
నేను రెడ్డి కాకపోవమే శాపం: వి. హనుమంతరావు.
నిజానికి కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడు వి. హనుమంతరావు. సోనియాగాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు ఆయన. ఆయన పిసిసి. అధ్యక్షుడుగా పనిచేసిన సమయంలో రేవంత్ రెడ్డి లాంటి వారికి లోక జ్ఞానం కూడా తెలియని వయసు. అలాంటి నేతలకు ఈసారి టికెట్ వుంటుందన్న నమ్మకం లేదు. 1985 ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌పార్టీని నిలబెట్టిన వారిలో హనుమంతరావు ఒకరు. యూత్‌కాంగ్రెస్ ప్రెసిడెంటుగా ఉమ్మడి రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు, అక్కడి నుంచి ఆదిలాబాద్ వరకు యాత్ర చేపట్టి, కాంగ్రెస్‌ను గెలిపించడంలో కీలక భూమిక పోషించారు. రాజీవ్‌గాంధీకి అత్యంత సన్నిహితుడైన నాయకుడైనా హనుమంతారావు ముఖ్యమంత్రి కాలేకపోయారు. కారణం ఆయన రెడ్డి కాకపోవడమే అని ఇప్పటికే చెప్పుకొని మధనపడుతుంటారు. పార్టీకి కోసం అంత కష్ట పడ్డా తాను రెడ్డి రాజకీయం ముందు ఓడిపోయానని అంటుంటారు. ఆ సమయంలో ముగ్గురు ముఖ్యమంత్రులు అయినా, ముగ్గురూ రెడ్డిలే అయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ వచ్చినా అప్పుడూ ఇద్దరు రెడ్డిలే పాలించారని హనుమంతరావు భహిరంగంగానే చెబుతుంటారు. ఇటీవల కాలంలో అడుగుగడుగునా ఆయనను అవమానాల పాలు చేసినా, పార్టీ కోసం ఈ వయసులోనూ పనిచేస్తున్నారు. ఇప్పటి తరం నాయకులకంటే ఉత్సాహంగా వున్నారు.