తెలంగాణ రాజకీయంలో కీలక పరిణామం చోటు చేసుకోనుందా..?

తెలంగాణలో కాంగ్రెస్ వైపుకి రెడ్డి సామాజిక వర్గం, బ్రాహ్మణులు మొదలు దళితులు, గిరిజనుల దాకా, మైనార్టీలతో సహా… అన్ని వర్గాల్లోనూ కాంగ్రెస్ కు ఓటర్ల బలంగా ఉన్నారు! ఇది మనకు స్వతంత్రం వచ్చిన నాటి నుంచీ నిరూపితం అవుతోన్నదే! అయితే, తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు అతి పెద్ద బలం రెడ్డి సామాజిక వర్గం. వాళ్లు మొదటి నుంచీ హస్తంతోనే కొనసాగుతున్నారు. ఇతర వర్గాల ధోరణి ఎలా ఉన్నా… ఎన్నికలు వచ్చిన ప్రతీ సారి రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు చేతి గుర్తుకే చేయెత్తి జైకొడుతున్నారు. అయితే, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తరువాత తెలంగాణలోనూ రెడ్లు ఎప్పటిలాగే కాంగ్రెస్ ను ఆదరిస్తూ వచ్చారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కాస్త మార్పు కనిపించింది!
జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ తెలంగాణ రెడ్డి సామాజిక వర్గాన్ని కొంత వరకూ అప్పట్లో ప్రభావితం చేసింది. కేసీఆర్ తో స్నేహం చేసిన జగన్ కారు గుర్తుకు ఓటు వేయాలంటూ పనిగట్టుకుని తెలంగాణలో ప్రచారం చేయించాడు. అనధికారికంగా వైసీపీ మీటింగులు పెట్టి కేసీఆర్ వైపుకు రెడ్డి ఓట్లను మళ్లించింది. అయితే, అయిదేళ్ల తరువాత ఇప్పుడు మరో మారు ఆ సామాజికవర్గం కాంగ్రెస్ వైపుకే మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది!
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కుచుకుళ్ల దామోదర్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరామ్ రెడ్డి, గుర్నాథ్ రెడ్డి,ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కీలక నేత కేఎల్ఆర్ అలియాస్ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి మళ్ళీ యాక్టివ్ అవ్వడం.. ఇలా అనేక మంది రెడ్డి సామాజిక నేతలు, ప్రముఖులు హస్తంతో చేతులు కలుపుతున్నారు. ఎన్నికలు దగ్గరపడేకొద్ది టీ కాంగ్రెస్ లోకి మరింత మంది రెడ్డి  సామాజికవర్గం నేతలు వలససొచ్చే అవకాశాలున్నాయని బలమైన టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే బీఆర్ఎస్ సీఎం కూర్చీపై ఆశలు వదులుకోవాల్సిందే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే, తెలంగాణలో ఆర్థిక, రాజకీయ పలుకుబడిలో రెడ్లదే మొదటి స్థానం. అలాగే, ఓటర్లుగా కూడా రెడ్డి కులస్థులు గణనీయంగా ఉంటారు. ఏక కాలంలో… అటు రెడ్డి నేతలు, ఇటు రెడ్డి ఓటర్లు… కాంగ్రెస్ కు జైకొడితే… కర్ణాటక తరువాత దక్షిణాదిలో మరో రాష్ట్రం హస్తం వశం కాకుండా… ఎవరూ ఆపలేరంటున్నారు రాజకీయ పండితులు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!