టిడిపి+బిజేపి-కాంగ్రెస్=బీఆర్ఎస్‌

 

రేవంత్ రెడ్డి నోటికి చంద్రబాబు తాళం?

తన రాజకీయమా! గురు దక్షిణకు కాంగ్రెస్ ను ముంచడమా!?

అడకత్తెరలో రేవంత్?

చంద్రబాబు కోసం తన భవిష్యత్తు తుంచుకుంటాడా?

అటు సీనియర్లు! ఇటు చంద్రబాబు!!

టిడిపి ని తిట్టలేడు.

బిజేపిని మెచ్చుకోలేడు.

ఆ పొత్తును అనైతికం అనలేడు.

ఓటుకు నోటు కోసం అప్పుడు!

బిజేపి పొత్తుతో ఇప్పుడు!!

రేవంత్ ఆశలపై ఊహించని దెబ్బలు!

చంద్రబాబు ను నమ్మినందుకే ఇన్ని తిప్పలు?

రేవంత్ తొందరపాటుకు పర్యవసానాలు!

ఆ పొత్తును తూర్పార పట్టకపోతే రేవంత్ కు మనుగడ లేదు.

చంద్రబాబును రాజకీయం ఇప్పటికీ రేవంత్ తెలుసుకోవడం లేదు.

కాంగ్రెస్ ను ఫణంగా పెడతాడా?

తానే టిడిపి గూటికి చేరుతాడా?

కాంగ్రెస్ సీనియర్ల భయం నిజం చేస్తాడా?

రేవంత్ భవిష్యత్తు ప్రశ్నార్థకమేనా?

హైదరబాద్‌,నేటిధాత్రి:  

ఊహలకు, ఊహించని మలుపులు తోడైతే ఆ రాజకీయం రసతవత్తరంగా వుంటుంది. కాని అనుభవించే నాయకులకు మాత్రం భవిష్యత్తుపై గందరగోళం నెలకొంటుంది. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అదే జరుగుతోంది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ అదృష్టమో, లేక తెలంగాణ ప్రజల బలమైన కోరికో గాని ప్రతిపక్షాల వల్ల కూడా బిఆర్‌ఎస్‌ ముచ్చటగా మూడోసారి గెలిచేందుకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదు. దేశంలో అన్ని రాష్ట్రాల రాజకీయాలు వేరు. తెలంగాణ రాజకీయం వేరు. ఇక్కడ రెండు ప్రాంతాల ప్రజలు, నాయకులు, పార్టీలు వుండడం మూలంగా జనం నాడి అంతు చిక్కకుండా వుంటుంది. ముఖ్యంగా ఈసారి రాజకీయాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రేవంత్‌ రెడ్డికి మళ్లీ గట్టి దెబ్బ తగిలే అవకాశమే కనిపిస్తోంది. అదేంటో వ్యక్తిగత రాజకీయం ఎంత ఎదిగినా, రేవంత్‌ రెడ్డి ఏ పార్టీలో వుంటే ఆ పార్టీ పరిస్థితి చెప్పలేని విధంగా తయారౌతోంది. రేవంత్‌రెడ్డి రాజకీయ ఓనమాలు బిఆర్‌ఎస్‌నుంచి మొదలైనా, గుర్తింపు రాజకీయాలు తెలుగుదేశంతో ఆరంభమయ్యాయి. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు. దాంతో రేవంత్‌రెడ్డి క్రియాశీల రాజకీయాలు ఆపార్టీకి అవసరమయ్యాయి. చంద్రబాబు బాగానే పార్టీకి వాడుకోవాలని అనుకున్నాడు. దాంతో రేవంత్‌కు చంద్రబాబు ప్రాదాన్యతనిస్తూ వచ్చారు. అది వ్యక్తిగతంగా రేవంత్‌కు గుర్తింపుతెచ్చింది. కాని పార్టీ రాజకీయం ఆగమ్యగోచరమైంది. ఇంతలో తెలంగాణ వచ్చింది. మొత్తానికి తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి అడ్రస్‌ లేకుండాపోయింది. చంద్రబాబు తెలంగాణను వదిలి వెళ్లిపోవాల్సి వచ్చింది. అందుకు కారణం కూడా రేవంత్‌రెడ్డే కావడం గమనార్హం. చంద్రబాబు చెప్పాడని ఓటుకు నోటు కేసులో కూడా రేవంత్‌ ఇరుకున్నాడు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ కన్నెర్ర చేయడంతో చంద్రబాబు రాత్రికి రాత్రే తట్టాబుట్టా బుట్ట సర్ధుకొని పోయాడు. హరిహర బ్రహ్మాధులొచ్చినా చంద్రబాబును కాపాడలేరని తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌ అనేసరికి తెలంగాణ వైపు చూడడమే మానేశాడు. దాంతో తెలుగుదేశం మనుగడ సాగించడం కష్టమైంది. ఆ పార్టీ నుంచి చాలా మంది నాయకులు బిఆర్‌ఎస్‌లో చేరడం జరిగింది. తెలుగుదేశంలో రేవంత్‌రెడ్డి వ్యవహారం నచ్చని వాళ్లంతా రేవంత్‌కు అప్పటికే పొగపెట్టారు. కాకపోతే రేవంత్‌ జైలుకెళ్లాడు. వచ్చిన తర్వాత తెలుగదేశంలో ఇమడలేకపోయాడు. ఇక ఎటూ కాని రాజకీయ ఊగిసలాటలో వున్న రేవంత్‌ భవిష్యత్తు నిర్ధేనంలో చంద్రబాబు కీలకభూమిక పోషించారు. కాంగ్రెస్‌తో మాట్లాడి ఆ పార్టీలో రేవంత్‌కు స్ధానంకల్పించారు. పనిలో పనిగా వర్కింగ్‌ ప్రెసిడెంటు పదవి కూడా ఇప్పించారు. ఇంతలో ఆంద్ర ప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది. చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్‌లో నిలువ నీడ లేకుండాపోయింది. రాజకీయం చేద్దామన్న ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండాపోయింది. దాంతో చంద్రబాబు రాజకీయాలు ఆంధ్రప్రదేశ్‌లో నివాసం తెలంగాణలో అన్నట్లు తయారైంది. ఇంకో ఐదేళ్లపాటు ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం రాజకీయాలు దూరమైతే, ఆ పార్టీ ప్రజలకు దూరమవడం ఖాయం. చంద్రబాబు తనయుడు లోకేష్‌ రాజకీయం క్లోస్‌. అందుకే లోకేష్‌తో చంద్రబాబా పాదయాత్ర మొదలుపెట్టించాడు. ఏ బిజేపితో వైరం పెంచుకున్నాడో అదే పార్టీతో మళ్లీ పొత్తుకోసం చంద్రబాబు పాకులాడుతున్నాడు. గత కొంత కాలంగా బిజేపి పెద్దలను కలవాలని ఆరాపడ్డాడు. ఆఖరికి ఇటీవల అమిత్‌షాతో పాటు, బిజేపి జాతీయ అధ్యక్షుడు నడ్డాతో చంద్రబాబు బేటీ అయ్యారు. రాజకీయాలు మాట్లాడుకున్నారు. తెలంగాణలో కలసి సాగేందుకు ముందు ఎన్నికల ట్రయల్‌ మొదలుపెడదామని అంగీకారానికి వచ్చారు? తెలుగుదేశం, బిజేపి కాంబోపై క్లారిటీ వచ్చినట్లే అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. సుబ్బి పెళ్లి వెంకి చావుకొచ్చినట్లు చంద్రబాబు బిజేపితో కలవడంతో రేవంత్‌ పరిస్ధితి కుడిలో పడ్డ ఎలుకలా మారిపోయింది. మింగలేక, కక్కలేని స్ధితికి వచ్చేసింది. ఎటూ పాలుపోని స్ధితికి నెట్టేయబడ్డటైంది. అసలైన రాజకీయం ఇప్పుడు తెలంగాణలో మొదలు కాబోతోంది. 

అసలు రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌లో చేరాలనుకున్నప్పటి నుంచి ఆ పార్టీ సీనియర్లు వ్యతిరేకిస్తూనే వున్నారు.

 రేవంత్‌ పార్టీలో చేరిన తర్వాత కూడా వ్యతిరేకించారు. పిసిసి. అధ్యక్షుడు కాగానే రేవంత్‌ రెడ్డి యాభైకోట్లు పెట్టి ప్రెసిడెంటు పదవి కొన్నాడని సాక్ష్యాత్తు ఎంపి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అప్పటినుంచి సీనియర్లు రేవంత్‌రెడ్డి మీద కత్తికట్టారు. ఇప్పటికీ వీలు చిక్కినప్పుడల్లా రేవంత్‌ను తూర్పారపడుతున్నారు. ఆయనను పార్టీ నుంచి తరిమేయాలనే చూస్తున్నారు. ఇప్పటిదాకా కాలం కలిసిరాలేదు. అధిష్టానం కూడా సీనియర్లు చెప్పిన మాట వినలేదు. రేవంత్‌ రెడ్డి రాజకీయం చాలా విచిత్రమైంది. ఆయన ఏ సభ నిర్వహించినా సక్సెస్‌ అవుతుంది. ఏ ర్యాలీ తీసినా గొప్పగా ప్రచారం జరుగుతుంది. కాని ఎన్నికల బరిలో నిలిచిన కాంగ్రెస్‌ పరిస్ధితి అద్వాహ్నంగా తయారౌతుంది. హుజూరాబాద్‌ 2018 ఎన్నికల్లో 60వేల ఓట్లు వచ్చిన కాంగ్రెస్‌ పార్టీకి, ఉప ఎన్నికల్లో మూడువేల ఓట్లు మాత్రమే వచ్చాయి. అప్పుడు రేవంత్‌రెడ్డిని సీనియర్లు ఒక ఆట ఆడుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడ రాలేదు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లిన రేవంత్‌రెడ్డికి ప్రజల నుంచి చేదు అనుభవమే ఎదురైంది. ఇక రేవంత్‌రెడ్డి పాదయాత్ర మొదలు పెట్టినా పాదాల మీద నడవలేక, అక్కడక్కడ పాదాలను భూమి మీద మోపి సాగించారనే విమర్శలు కూడా ఎదుర్కొనాన్నారు. ఆఖరకు షర్మిల చేత కూడా తిట్టించుకున్నారు. పాదయాత్ర అంటే ఎలా చేయాలో క్లాస్‌ పీకించుకున్నారు. అయితే పాదయాత్రలో ఎదురైన ప్రజలు రేవంత్‌ను చాలా వరకు గుర్తు పట్టలేదు. చివరికి నేను ఎవరు ? అంటే కూడా ప్రజలు ఏమో? అన్నట్లు మొహం పెట్టి, రేవంత్‌కు చుక్కలుచూపించారు. అయినా రేవంత్‌రెడ్డి తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. ఇటీవల జరిగిన కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు తెలంగాణలో ఊపును తెచ్చిందని ప్రచారం జోరుగా సాగింది. ఇంతలోనే రేవంత్‌రెడ్డికి పిడుగులాంటి వార్త వినాల్సివచ్చింది. తన రాజకీయ గురువుగా చెప్పుకునే చంద్రబాబు మళ్లీ బిజేపితో కలుస్తున్నాడన్న వార్త విన్న తర్వాత రేవంత్‌రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఒక వేళ బిజేపి, తెలుగుదేశం పార్టీల మధ్య పొత్తు పొడుపులు జరిగితే మాత్రం ముందు నష్టపోయేది రేవంత్‌రెడ్డి రాజకీయమే! ఎందుకంటే ఈ రెండు పార్టీలు జతకట్టి గతంలోనే కాంగ్రెస్‌ను ఖతం చేసే పని పూర్తి చేశాయి. మళ్లీ ఇప్పుడు కొత్త కలయిక జరిగినా కాంగ్రెస్‌ మీద యుద్దం ఆపరు. తెలుగుదేశంపార్టీకి బిఆర్‌ఎస్‌ మీద గురి వున్నప్పటికీ, బిజేపికి ముందు కాంగ్రెస్‌ మీద కసిని చూపించకుండా వుండలేవు. అందువల్ల తెలుగుదేశం, బిజేపిలు కలిసి బిఆర్‌ఎస్‌ మీద యుద్దం మొదలుపెట్టినా, ముందు కాంగ్రెస్‌ను నామరూపాలు లేకుండా చేసే పని మాత్రమే పెట్టుకుంటారు. అదే జరిగితే ఆది నుంచి సీనియర్లు చెప్పిందే నిజమౌతుంది. రేవంత్‌ రెడ్డి రాజకీయం త్రిశంకు స్వర్గమౌతుంది. లేదా రేవంత్‌రెడ్డి సరిగ్గా ఎన్నికల మందు వదిలేసి తెలుగుదేశంలో చేరాల్సివస్తుంది. అదే జరిగితే రేవంత్‌రెడ్డి మీద ప్రజలకు వున్న ఆ కాస్త నమ్మకం కూడా పోతుంది. ఏ రకంగా చూసినా రేవంత్‌కు ఇబ్బందికరమే. కాంగ్రెస్‌లో వుంటూ చంద్రబాబుపై కాలు దువ్వలేడు. బిజేపికి లొంగిపోలేడు. కాంగ్రెస్‌ను వదిలిపోవడమొక్కటే శరణ్యమౌతుంది. ఎటు చూసినా రేవంత్‌కు దారులు మూసుకుపోవడం పక్కా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!