`దళితులనే దోచుకున్నప్పుడు గుర్తులేదా…?
`దళిత అధికారులని అప్పుడు మర్చిపోయారా?
`దళితులను మోసం చేయడం తప్పని తెలియదా?
`దళిత బంధు అమలలో లంచాలు అమానవీయం కాదా?
`దళిత ఉద్యోగులే దళితులను దోచుకుంటుంటే ఎవరికి చెప్పకోవాలి?
`కాపాడాల్సిన స్థానంలో వుండి, కనికరం లేకుండా దోచుకుంటిరి?
`దళిత అధికారులే, దళితుల సొమ్ము కాజేయడం నేరం కాదా?
`సంతకాలకు లంచాలు తీసుకోలేదా?
`ట్రేడర్లు లక్షల నొక్కేస్తున్నది వాస్తవం కాదా?
`షోరూంలు అదనంగా లక్షన్నర లెక్కేయడం నిజం కాదా?
`లబ్ధి దారులను నిండా ముంచింది మీరు కాదా?
`అవినీతి చేసేప్పుడు నిఘా సంస్థలుంటాయని తెలియదా?
`మీడియా వెలుగులోకి తెస్తుందన్న సోయి లేదా?
`లబ్ధి దారులు దుమ్మెత్తి పోస్తున్నారు?
`ఆధారాలతో అన్ని వివరాలు అందిస్తున్నారు?
`తప్పించుకోవడానికి దారి తెలియక మీడియా మీద పడతారా?
`దళితులకు అన్యాయం చేయొద్దని చెప్పడం ఇబ్బందిగా మారిందా?
`ఆత్మాభిమానం ఇప్పుడు గుర్తొచ్చిందా?
`లంచాలు తీసుకున్నప్పుడు గుర్తు రాలేదా?
`దళిత బంధులో జరిగిన అవకతవకల పై హై కోర్ట్ సుమోటోగా కేస్ స్వీకరించాలి…
`ఇప్పటికైనా మారండి…దళితులకు అన్యాయం చేయకండి!
హైదరాబాద్,నేటిధాత్రి:
సహజంగా ప్రభుత్వాలు ఒక గొప్ప పధకాన్ని తీసుకొచ్చే ముందు, దాని అమలు తీరు…సవాళ్లు…ఎదురయ్యే ఇబ్బందులు, సాధకబాధకాలు, నిధుల కూర్పు వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని పైలెట్ ప్రాజెక్టులు ప్రకటిస్తారు. ఏదో ఒక చోట ముందుగా అమలు చేస్తారు. దాంతో ఆ పధకం మీద ప్రజలకు అవగాహన, పాలకులకు మరింత బాద్యత పెరిగే అవకాశం వుంటుంది. అధికారులు ఎలా పనిచేస్తున్నారు..ఎంత వరకు పనిచేస్తున్నారు..వాళ్ల ఆ పథకం మీద ఎంత దృష్టిపెడుతున్నారు..ప్రజలకు ఏ మేరకు సహకరిస్తున్నారు… వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన గొప్ప విప్లవాత్మక పథకమే దళిత బంధు. ఇది ఎంతటి గొప్ప పధకమో సామాన్య ప్రజలకు అర్ధమైనంతగా అధికారులకు అర్ధం కానట్లుంది. అందుకే ఇన్ని అవకతవకలు జరుగుతున్నాయి. ముఖ్యంగా పైలెట్ ప్రాజెక్టు అంటే ఉద్యోగులు ఎంతో చిత్తశుద్దితో పనిచేయాలి. ఒక రకంగా చెప్పాలంటే ఒళ్లు దగ్గర పెట్టుకొని పనిచేయాలి. కాని దళిత బంధు విషయంలో ఏం జరుగుతోందో అందరకీ అర్ధమౌతోంది. తెలంగాణలోని దళితుల ఆర్ధిక స్ధితి గతుల్లో మార్పులు తెచ్చి, సమాజంలో వారికి సమున్నతమైన గౌరవం కల్పించి, వ్యాపార రంగాలలో వారిని ప్రోత్సహించి, ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ ధ్యేయం. అందుకే స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు చేయని ధైర్యం ముఖ్యమంత్రి కేసిఆర్ చేశారు. పైలెట్ ప్రాజెక్టు కింద హుజూరాబాద్‌ను ఎంపిక చేశారు. ఎన్నికల వేళ ప్రకటన అంటూ ప్రతిపక్షాలు రాజకీయం చేయడానికి ఉపయోగించుకున్నా, తను అనుకున్న లక్ష్యం నెరవేరేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ పైలెట్ ప్రాజెక్టు కోసం పూర్తి స్ధాయి నిధులు అందజేశారు. ప్రతి దళితుడి బ్యాంక్ అకౌంట్లో రూ.10 లక్షలు జమ చేశారు. ఇంత అంకితభావం ఏ ప్రభుత్వంలోనూ చూడలేదు. ఇప్పటి వరకు అలాంటి ప్రభుత్వం మరొకటి లేదు. మరి ఇంతే చిత్తశుద్ద అదికారులకు వుందా? ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తెలంగాణలో అమలుకు నోచుకోవాల్సిన దళిత బంధులో వాటాలు వేసుకొని కమీషన్ల రూపంలో లంచాలు దండుకున్నది అధికారులు. అందులో కింది స్ధాయి అధికారులేమో!
భయంతో పనిచేస్తే, పై స్దాయి అధికారులేమో! తమనెవరు? ఏం చేస్తారు? అన్న ధైర్యంతో దగా చేశారు…దళితుల సొమ్మును దోచుకున్నారు. ఈ విషయం ఏ లబ్ధిదారుడిని అడిగినా చెబుతాడు. దళిత బంధు పథకం డబ్బులు చేతికి రావడానికి ఎక్కడెక్కడ ఎంత తీసకున్నారన్న విషయం లబ్ధిదారులు పూసగుచ్చినట్లు చెబుతున్నారు. అయినా ఇంకా ఎందుకు భుకాయిస్తున్నారు? దళితుల సొమ్ము దగా మేసి, మేం దళిత అధికారులుగా మా ఆత్మాభిమానం దెబ్బతిన్నదంటారా? ఈ మాటలు దళితులే వింటే ఏమనుకుంటారన్న ఆలోచన కూడా లేదా? దళితుల సొమ్ము రూపాయి కూడా తినకుండా చూడాల్సిన బాధ్యత దళిత అధికారులు తీసుకోవాలి. ఆ సొమ్ముకు భద్రంగా దళితులకు అందేందుకు సహకరించాలి. ఎవరైనా గద్దల్లా దళిత బంధు సొమ్ము కాజేయాలని చూస్తే వారి భరతం పట్టాలి. ఇదీ దళిత అదికారులుగా చేయాల్సిన పనిని విస్మరించి, దళిత బంధు లబ్ధిదారులకు సంతకాలు చేసేందుకే వేలాది రూపాయలు వసూలు చేసి, వాళ్లేవరో ఊళ్లు పంచుకున్నట్లు దళితబంధు పథకంలో అందరూ కలిసి కోట్లాది రూపాయలు లూటీ చేశారన్నదైనా గుర్తుందా?
నేటిధాత్రి మీద కేసు వేస్తారా? వేయండి? ఏమని వేస్తారో వేస్తే అప్పుడు తెలుస్తుంది?
నేటిధాత్రి అదే దళితుల సొమ్ము దగా కోరుల పాలైపోతోందని, వారిని చైతన్యం చేసే యజ్ఞం చేస్తోంది. వారి సొమ్ము దారి మల్లకుండా చూస్తోంది. ఎవరెవరు ఎంతెంత వాటాలేసుకొని పంచుకుతిన్నది చెబుతోంది. ట్రేడర్లనుంచి, షోరూం నుంచి జిఎస్టీల పేరుతో దోచుకుంటున్న సంగతి ప్రతి దళితుడికి తెలుసు. దళితుల్లో ఇంకా అమాయకులున్నారనే…వారి ఎదుగుదలకు ఈ సమాజం ఎలాగూ సహకరించదని, ప్రోత్సాహం అసలే వుండదని, ప్రభుత్వమే దళితులు సంక్షేమం కోసం ఆలోచించి దళిత బంధు తీసుకొచ్చింది. కనీసం ఆ పథకం ఉద్దేశ్యం కూడా అర్ధం చేసుకోలేక, ఉన్నతోద్యోగులై వుండి దళితుల సొమ్ముకు ఆశపడ్డవారు కూడా ఆత్మాభిమానం గురించి మాట్లాడితే ఏలా వుంటుందో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. నిజానికి దళితులమని చెప్పుకుంటున్న ఉన్నతోద్యోగులు తాము చేసింది తప్పే అనుకొని, ఇకపై ఇలాంటి పొరపాట్లు జరక్కుండా చూసుకుంటామని చెప్పాలిందిపోయి, నేటిధాత్రి మీద కేసులు వేస్తామని బెదిరిస్తే సరిపోతుందా? నిజం నిప్పులాంటిది…అది దాగదు…తప్పు చేసిన వారిని ఊరికే వదిలిపెట్టదు.
ఉద్యోగులుగా ప్రజల పన్నులతో జీతాలు తీసుకుంటున్నారు సరిపోవడం లేదా?
ఒక పైలెట్ ప్రాజెక్టు ప్రభుత్వం అమలు చేసినప్పుడు దానిపై ఎంత మంది నిఘా వుంటుందో తెలియకుండా ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారా? పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగినట్లు, తాము దళితుల దగ్గర తీసుకుంటున్న సొమ్ము గురించి ఎవరికీ తెలియదనుకున్నారా? చేయాల్సిందంతా చేసి, దళితులను దగా చేసి, మేం మా మనోభావాలు దెబ్బతిన్నాయనంటే జనం నివ్విపోతారు…ఇప్పటికైనా హుందాగా వ్యవహరించండి. ప్రభుత్వం ఎంతో గొప్ప పథకాన్ని అమలు చేసే బాధ్యత మీకు అప్పగించినందుకు ఎంతో పుణ్యంగా భావించాలి. తమ చేతుల మీదుగా కొన్ని వేల దళిత కుటుంబాలు ఇప్పుడు సంతోషంగా వున్నాయని చెప్పుకునే స్ధితి కల్పించబడాలి. ఆ హుజూరాబాద్‌లోని దళితులంతా ఉద్యోగులకు చేతులెత్తి మొక్కేలా వుండాలి. ఎక్కడైనా కనిపిస్తే ప్రభుత్వం మా జీవితాలకు భరోసా కల్పిస్తే మీరు మాకు దారి చూపారని చెప్పుకోగలగాలి. అంతే కాని నిత్యం తిట్టుకునేలా వ్యవహరించారు. ఇప్పటికే ఎంతో మంది దళితులు తమ సొమ్ము తిన్న అధికారులను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. దుమ్మెత్తి పోస్తున్నారు. శాపనార్దాలు పెడుతున్నారు. ముందు అవి వినండి…! అప్పుడు నేటిధాత్రి గురించి ఆలోచించండి…ఆత్మాభిమానం గురించి మాట్లాడండి!!