మాటపాయే…మూటపాయే! పనికాకపాయే! కొలువు రాకపాయే!!

`ఆశగా ఎదురుచూడుడు తప్ప కొలువులింకారాకపాయే!

`అదుగో వచ్చే…ఇదిగో వచ్చే అనే ఆశలే మిగలవట్టే?

`బతుకు భారం కావట్టే.

`కుటుంబ పోషణ గడవకపోవట్టే…

`కాలం కరిగిపోవట్టే…కన్నీళ్లు ఇంకిపోవట్టే…

`ఎవరికీ చెప్పుకోలేక తెల్లందాక కంటికి నిద్రరాకపోవట్టే…

`ఆరోగ్యాలు కరాబుగావట్టే…

`కనికరించి పుణ్యం కట్టుకుంటారని ఎదురుచూసి కళ్లు కాయలు కావట్టే.

`ఎదురుచూపులు మిగలవట్టే!

`మంత్రి కేటిఆర్‌ దాకా సంగతి చేరకపోవట్టే...

`అంతగనం మంత్రి కేటిఆర్‌ చెప్పినా కొలువులు రాకపాయే!

`దుఃఖమింకా తీరదాయే!

హైదరాబాద్‌,నేటిధాత్రి:

చెట్టు , పుట్టకు మొక్కినా ఫలితముండేదేమో! నాయకులను నమ్ముకొని ఆరేళ్లుగా ఎదురుచూస్తున్నారు..కనిపించిన నాయకులకల్లా దండాలు పెట్టారు..కాళ్లు మొక్కారు…కన్నీళ్లు పెట్టుకున్నారు…వీధిన పడ్డామని వేడుకున్నారు…ఆదుకొమ్మని ప్రాదేయపడ్డారు…కడుపుల్లో తలకాయపెట్టి కనికరించమన్నారు…దారి చూపమన్నారు…మీ పేరు చెప్పుకొని బతుకుతామని కాళ్లా, వేళ్లా పడ్డారు…అందరూ మాటిచ్చారు…మేమున్నామన్నారు…భరోసా ఇచ్చారు…మాటిస్తున్నాం కొలువులొచ్చినట్లే అని చెప్పారు…అందులో కొందరు మూటెంతిస్తారని అడిగారు…ఊరికే సాయమెందుకు చేయాలన్న వాళ్లు వున్నారు…పని చేసిపెడితే మాకేంటని ముఖం మీదే అడిగిన వాళ్లున్నారు…చులకన చేసినవాళ్లున్నారు..చీదరించుకున్న వాళ్లున్నారు… కొలువులు ఇప్పిస్తామని చెప్పి మూటలు తీసుకున్న వాళ్లు వున్నారు…ఏళ్లుగా తిప్పుకుంటాన్నారు…మాటిచ్చిన వాళ్లు మాట తప్పారంటే ఏమో! అనుకోవచ్చు…మూట తీసుకున్న వాళ్లైనా మాట నిలుపుకోవాలి కదా! అందరూ చేతులెత్తేశారు…

   వాళ్లు అభాగ్యులో…నిర్భాగ్యులో అర్థం కాని అయోమయ పరిస్థితి. 

ఎవరైనా కొలువుల కోసం ఎదురుచూసే వాళ్లను చూస్తాం…కానీ వీళ్లు, ఓ పదేళ్లు కొలువులు చేసి పొగొట్టుకోవడం చూస్తున్నాం…కొలువులంటే ప్రమోషన్లు, డిమోషన్లే కాదు తప్పు చేసి ఉద్యోగాలు పోగొట్టుకుంటారు. కానీ వీళ్ల కొలువులు పోవడానికి వీళ్లు కారణం కాదు…ఎవరో చేసిన తప్పుకు వీళ్లు బలయ్యారు….ఇక్కడ విచిత్రమైన విషయం ఏమిటంటే తప్పు చేసిన వాళ్లంతా కొలువుల్లో వున్నారు…సంతోషంగా జీతాలు తీసుకుంటున్నారు…కానీ ఏ తప్పు చేయని గృహ నిర్మాణ శాఖలో గతంలో పని చేసిన ఈ ఒప్పంద ఉద్యోగులు మాత్రం కొలువులు పోగొట్టుకున్నారు…వీధిన పడ్డారు…అప్పటి నుంచి తిప్పలు పడుతున్నారు… ఆశగా ఎదురుచూడుడు తప్ప కొలువులింకారాకపాయే! అని మధనపడుతున్నారు. నిత్య నరకం అనుభవిస్తున్నారు. 

అదుగో వచ్చే…ఇదిగో వచ్చే అనే ఆశలే మిగలవట్టే? 

బతుకు భారం కావట్టే. కుటుంబ పోషణ గడవకపోవట్టే…కాలం కరిగిపోవట్టే…కన్నీళ్లు ఇంకిపోవట్టే… ఎవరికీ చెప్పుకోలేక తెల్లందాక కంటికి నిద్రరాకపోవట్టే…ఆరోగ్యాలు కరాబుగావట్టే…కనికరించి పుణ్యం కట్టుకుంటారని ఎదురుచూసి కళ్లు కాయలు కావట్టే. ఎదురుచూపులు మిగలవట్టే! ఒకరా! ఇద్దరా…ఎంత మంది నేతలున్నారో అంత మందినీ కలిశారు…మాట తీసుకున్నారు…కొలువిప్పియ్యమంటూ కన్నీటి పర్యంతమయ్యారు. 

సాక్ష్యాత్తు మంత్రి కేటిఆర్‌ గృహ నిర్మాణ శాఖలో తొలగింపబడిన ఒప్పంద ఉద్యోగులకు తిరిగి ఉపాధి చూపించాలని చెప్పారు. వరంగల్‌ జిల్లా కు చెందిన నేతలను నమ్మి నేను మాట ఇస్తున్నాను…అని ప్రకటించారు. వారికి ఇచ్చిన హామీ వృధా కావొద్దని మరీ నొక్కి చెప్పారు. అధికారులు స్పందించారు. 51 మందికి సంబంధించి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ వరంగల్‌ లో కొలువుల ఏర్పాటు కూడా జరిగింది. అందుకు అవసరమైన ప్రొసెసింగ్స్‌ కూడా పూర్తి చేశారు. మున్సిపల్‌ సమావేశంలో అందుకు తగిన నిర్ణయం తీసుకున్నారు. తీర్మానం కూడా చేశారు. ఒకసారి కాదు, రెండు సార్లు ఆ తంతు పూర్తి చేశారు. ఆ 51 మందిలో ఎవరు ఏఏ పనులను చేయగలరు? గతంలో గృహ నిర్మాణ శాఖలో వారు చేసిన పనిని బట్టి, ఏ పని అప్పగించాలన్నది కూడా నిర్ణయం చేశారు. అయినా వారికి ఉద్యోగాలు ఇంత వరకు రాలేదు…ఈ విషయం ఇప్పటి దాకా మళ్ళీ నాయకులు కేటిఆర్‌ కు వరకు తీసుకుపోలేదు… మంత్రి కేటిఆర్‌ చెప్పినా ఇంత వరకు నాయకులు వీరి జీవితాలను ఒక దారికి తీసుకురాలేదు…అంతగనం మంత్రి కేటిఆర్‌ చెప్పినా కొలువులు రాకపాయే! వారి దుఃఖమింకా తీరదాయే!

  కొలువులు పోయిన వారిలో ఎక్కువ మంది బడుగులే…

వాళ్లకు అండగా వుంటాలని ఇంత కాలం మభ్యపెట్టి కాలయాపన చేసింది బడుగు నేతలే…సమయం దొరికితే బడుగులకు జరిగే అన్యాయం గురించి గంటలు గంటలు చెప్పేవారే….వారికి రాజకీయంగా పదవుల పందేరమప్పుడు మాత్రమే వారికి బడుగు నేతలని గుర్తుకొస్తుంది…అదే సామాన్యులు పనుల కోసం నాయకుల వెంట పడుతున్నా, వారి కోసం పడిగాపులు పడుతున్నా బడుగు నేతలకు కనిపించరు. వారి ఆర్తనాదాలు వినిపించవు. ఇక వీరి విషయంలో వరంగల్‌ జిల్లాలో ఇప్పటికీ పెద్ద నాయకుడుగా పేరున్న నేత సాయం చేస్తానని చేతులెత్తేశాడు…ఇక ఆయన దారిలోనే మిగతా బడుగు నేతలు వ్యవహరించారు. ఇక మరో పేరు మోసిన నేత ఏకంగా సాయపడతానని, కొలువులు ఇప్పిస్తానని చెప్పి కొంత ముట్టజెప్పించుకున్నాడు. కానీ ఇంత వరకు ఆయన కొలువులు ఇప్పించలేదు. దాంతో తామిచ్చిన సొమ్ము తిరిగి ఇవ్వమని అడిగారు…అందుకు సదరు పెద్ద నాయకుడు చెక్కు ఇవ్వడం కూడా జరిగింది అంటున్నారు. కొలువులు పోయి, జీవితాలు రోడ్డున పడ్డ వారిని ఆదుకోవాల్సింది పోయి, వారు ఇచ్చేదానికి పెద్ద నాయకులు ఆశపడ్డారు. అయినా వారికి న్యాయం చేశారా? అంటే అదీ లేదు…పైగా సదరు నేత పిఏ…చేయాల్సింత ప్రయత్నం చేశాము…తిరిగాల్సినంత తిరిగాము…డబ్బు రిటన్‌ ఇయ్యమంటే ఎలా? అని రివర్స్‌ ప్రశ్నించినట్లు తెలిసింది…ఆ పిఏ అలా మాట్లాడడంతో అవాక్కవడం వీరి వంతైంది…పెనం మీద నుంచి కాపాడమంటే పొయ్యిలోకి తోసేశారు…ఈ విధంగా చేయడం వల్ల పార్టీ పరువు పోదా? పదవులు కావాలి. అధికారం కావాలి. కానీ పార్టీకి పనికొచ్చే పనులు చేయడం మాత్రం నాయకులకు రాదు…నాయకుల తీరు ఇలా తయారైంది. కనీసం రాజకీయ ప్రయోజనం కోసం నాయకులు ఆలోచించినా బాగుండేదీ…గృహా నిర్మాణ శాఖలో ఒకప్పుడు పని చేసిన ఈ ఉద్యోగులకు ప్రజలతో మంచి సంబంధాలు వున్నాయి. ఇప్పటికీ లబ్ధి దారులు వీరు చెప్పిన మాట వింటారు. అలా గ్రామాలలో కొన్ని వందల కుటుంబాలను వీరు ప్రభావితం చేసే అవకాశం వున్న వాళ్లు…ఇలాంటి వారికి పునరావాసం కింద వారు అడిగిన కొలువులు ఇప్పించి, రాజకీయంగా వారిని వాడుకునే అవకాశం వుంది. అయినా నాయకులకు ఆ శ్రద్ధ లేదు…పార్టీ మీద పట్టింపు లేదు…పైగా పార్టీ పరువు తీస్తున్నారు. ఇప్పటికీ మించి పోలేదు…ఏది ఏమైనా వారి ఆశలన్నీ మంత్రి కేటిఆర్‌ మీదనే….తమకు కేటిఆర్‌ ఎప్పటికైనా న్యాయం చేస్తారన్న నమ్మకంతో వున్నారు…తాము నమ్మిన నాయకులు తమ సమస్యలు మంత్రి కేటిఆర్‌ దృష్టికి తీసుకెళ్తున్నారని అనుకున్నారు. నాయకులు ఈ అభాగ్యులకు చెప్పేదొకటి, చేస్తున్నదొకటి అని అర్థమైంది…ఇక మంత్రి కేటిఆర్‌ దృష్టి పెడితే తప్ప వీరి జీవితాలు ఓ దరికి చేరవు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!