ముత్తిరెడ్డికంతా వ్యతిరేకమే!?

`పార్టీ శ్రేణులలో గూడుకట్టుకొని వున్న అసంతృప్తి.

`బిఆర్‌ఎస్‌ బలంగా వుంది.

`ముత్తిరెడ్డి నాయకత్వం బలహీనంగా వుంది.

` ప్రతి చోట వివాదమే!

`నియోజకవర్గమంతా ఇబ్బందికరమే!

`ఏ మండల నాయకులను కదిలించినా ఇదే మాట!

`అభ్యర్థిని మార్చితేనే మనుగడ!

`లేకుంటే కష్టమేనట!

`ద్వితీయ శ్రేణిని ఎదగనివ్వని ముత్తిరెడ్డి!

`తాజాగా కడవేర్గులో ముత్తిరెడ్డిని యువకులు నిలదీత!

`చేర్యాల, మద్దూరు, నర్మెట్ట, బచ్చన్నపేట లలో తీవ్ర వ్యతిరేకత.

`జనగామ టౌన్‌ లో అదే పరిస్థితి!

`ఎక్కడ విన్నా ఇదే అనిశ్చితి!

`ఆరు నెలలు కిందటే నేటిధాత్రి హెచ్చరించింది?

`అయినా తీరు మారని ముత్తిరెడ్డి!

`పార్టీ ఆదేశాల మేరకే క్యాడర్‌ సైలెంట్‌ గా వుంది!

`ఎన్నికల నాటికి ఎటు మలుపు తిరుగుతుందో అన్నట్లే వుంది!

`గత ఎన్నికల సమయంలోనే ముత్తిరెడ్డికి వ్యతిరేకంగా గళం.

`పార్టీ ఆదేశాలతో అప్పుడు అందిన సహకారం.

`ఇప్పుడు ససేమిరా…అనేందుకే అందరూ సిద్ధం!

`నిరసన గళం ఎప్పటి నుంచో వినిపిస్తున్నారు!

`జనగామ గెలవాలంటే ముత్తిరెడ్డిని మార్చితే తప్ప అంటున్నారు!!

 హైదరాబాద్‌,నేటిధాత్రి:

జనగామ…ఉమ్మడి ఓరుగల్లు జిల్లాలో పోరుగడ్డ. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి తెలంగాణ తొలి, మలి ఉద్యమాలకు ఊపిరిపోసిన అడ్డా. నిజాం కాలంలో తెలంగాణ విముక్తికోసం తెగించి కొట్లాడిన ప్రాంతం. ఉద్యమ వీరులకు, తెలంగాణ సాయధ పోరాటంలో వీరోచిత యోధులకు పుట్టినిల్లు. అలాంటి ప్రాంతంలో ప్రజా సేవ చేసే నాయకులను గుండెల్లో పెట్టుకొని దీవించే జిల్లా జనగామ. తెలంగాణ ఏర్పాటయ్యాక జిల్లాలు ఏర్పాటు జరిగినప్పుడు కూడా కొట్లాడి జిల్లా సాధించుకున్న మొదటి జిల్లా జనగామ. అలాంటి జిల్లాలో నాయకుల అవినీతి ప్రజల సహించరు. ఆశ్రిప పక్షపాతాన్ని అసలే అంగీకరించరు. అభివృద్ధి నిరోధకులకు స్ధానం కల్పించరు. జనగామ విద్యాపరంగా చైతన్యవంతమైన జిల్లా…అలాంటి జిల్లాలో భారత రాష్ట్ర సమితి బలమైన పార్టీ. ఉద్యమ కాలంలో చంద్రబాబు లాంటి వారికి చుక్కలు చూపించిన ప్రాంతం. అంతగా మమేకమైన ఉద్య మకారులే కాదు, బిఆర్‌ఎస్‌ శ్రేణులు కూడా వున్నాయి. తిరుగులేని శిక్తిగా బిఆర్‌ఎస్‌ వుంది. కాని జిల్లా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే మీద ప్రజల్లోనే కాదు, పార్టీలో కూడా తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందన్నది సర్వత్రా వినిపిస్తున్న మాట. 

ఎమ్మెల్యే ముత్తిరెడ్డిమీద పార్టీ శ్రేణుల్లో చాలా కాలంగా అసంతృప్తి గూడు కట్టుకొని వుందన్న సంగతి అందరికీ తెలుసు. 

గత ఎన్నికల సమయంలోనే ఆయనకు వ్యతిరేకంగా జిల్లాలోని సీనియర్‌ నాయకులెంతో మంది ఎక్కడికక్కడ సమావేశమై, టిక్కెట్టు ఇవ్వొద్దని కూడా గళమెత్తారు. కాకపోతే అప్పటి పరిస్ధితులను దృష్టిలో పెట్టుకొని ఎంత అసంతృప్తి వున్నా పార్టీ శ్రేణులు అంగీకరించాయి. ఎంతో సహకరించాయి. ప్రజలు కూడా కేవలం కేసిఆర్‌ నాయక్వమే చూశారు..అందుతున్న సంక్షేమ ఫలాలను చూసి బిఆర్‌ఎస్‌కు ఓట్లేశారు. దాంతో ముత్తిరెడ్డి గెలుపు నల్లేరు మీద నడకే అయ్యింది. అయినా ఆయన తీరులో మార్పు రాలేదన్నది చాలా మంది చెప్పే మాట. తొలిసారి ఎమ్మెల్యే అయినప్పుడే ఆయన అధికార యంత్రాంగంతోపాటు, కొంత మంది పార్టీ నాయకులతో కూడా వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. అప్పటి కలెక్టర్‌ విషయంలో ఆయన అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. పట్టణ సందర్శన సమయంలో నెక్కర్‌ మీద వెళ్లడం సర్వత్రా వివాదం ముసిరింది. ఆ తర్వాత ఓ మహిళా విఆర్‌ఓ విషయంలో బెదిరింపులకు దిగినట్లు వార్తలు వచ్చాయి. అవి అప్పటికప్పుడు సర్ధుమణిగినా ఎన్నికల సమయంలో మళ్లీ తెరమీదకు రావడం జరుగుతుంది. ఇక జనగామలో దుర్గమ్మ గుడి స్థల వివాదంపై పెద్ద రచ్చనే జరిగింది. ఇక పేదలు వేసుకున్న గుడిసెల తొలగింపు, డబుల్‌ బెడ్‌ రూంల ఇండ్ల కేటాయింపు కూడా ముత్తిరెడ్డిమీద జనం కోపంతోనే వున్నారు. ఇక చెరువుల కబ్జాలపై జనగామలో, చేర్యాలలో ఎంతగా వివాదాలు ముసిరాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఓట్లేయలేదని ఓ గ్రామానికి చెందిన చెరువులో నీళ్లు నింపడానికి అంగీకరించడకపోవడం కూడ వివాదాస్పదమైంది. కొమరవెళ్లి మల్లన్న గుడి వివాదంలో అందరూ ముత్తిరెడ్డిని వేలెత్తి చూపిన సంగతి తెలిసిందే…ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఈ విషయంలో ముత్తిరెడ్డి బాగానే మందలించినట్లు కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక బచ్చన్న పేట మండలంలోని ఓ గ్రామంలో మహిళలు కూడా ఓసారి ముత్తిరెడ్డిని నిలదీసిన సందర్భం వుంది. తాజాగా కడవేర్గు అనే గ్రామంలో ముత్తిరెడ్డిని యువకులు అడ్డుకున్నారన్న వార్తలు పెద్దఎత్తున వైరల్‌ అయ్యాయి. 

జనగామ నియోజకవర్గంలో బిఆర్‌ఎస్‌ ఎంతో బలంగా వుంది. 

గ్రామాలకు గ్రామాలు పూర్తిగా బిఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులే వున్నాయి. అయినా ముత్తిరెడ్డి మీద వారికి నమ్మకం లేదు. ఆయన నాయకత్వం మీద విశ్వాసం లేదన్న మాటలే సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ విషయం నేటిధాత్రి గత ఆరు నెలల క్రితమే హెచ్చరించింది. జనగామలో ముత్తిరెడ్డికి వ్యతరేకంగా జనం విపరీతంగా చర్చించుకుంటున్నట్లు కూడా చెప్పడం జరిగింది. అదే సమయంలో జిల్లాలో కొంత ప్రజలతో సఖ్యత కనబర్చుతున్న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి నాయకుడుగా రావాలని కోరుకుంటున్నారన్న సంగతిని చెప్పడం జరిగింది. అయితే శ్రీనివాస్‌రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి, ముత్తిరెడ్డి నాయకత్వాన్ని బలపర్చుతున్నట్లు ప్రకటించారు. కాని ఇప్పుడు ప్రజల్లో ముత్తిరెడ్డి మీద పెరుగుతున్న వ్యతిరేకతపై శ్రేణులు ఏం చెప్పుకుంటున్నాయో శ్రీనివాస్‌రెడ్డి తెలుసుకుంటే మంచిదని కూడా నేటిధాత్రితో చెబుతున్నారంటే అర్ధం చేసుకోవచ్చు. జనగామ నియోజకవర్గంలోని దాదాపు అన్ని గ్రామాల ప్రజలతో నేటిధాత్రి ప్రతినిధులు తమ అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. బిఆర్‌ఎస్‌ మీద, ముఖ్య మంత్రి కేసిఆర్‌ నాయకత్వం మీద ప్రజలు ఎంతో నమ్మకంతో వున్నారు. సంతోషం కూడా వ్యక్తం చేస్తున్నారు. బిఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. అదే సమయంలో ఈసారి ముత్తిరెడ్డికి టిక్కెట్టు ఇస్తే మాత్రం కష్టమౌతుందని అంటున్నారు. అంటే ముత్తిరెడ్డి మీద ప్రజల్లో ఎంత తీవ్ర వ్యతిరేక వుందోఅర్ధం చేసుకోవచ్చు. 

ముత్తిరెడ్డిమీద జనగామ జిల్లా కేంద్రంతోపాటు, మద్దూరు, నర్మెట్ట, చేర్యాల, కొమరవెళ్లి జిల్లాలో మాత్రం పూర్తి వ్యతిరేకత వ్యక్తమౌతోంది.

 అందుకు తాజాగా కడవేర్గులో జరిగిన సంఘటనే చెప్పుకోవచ్చు. ఇక చేర్యాల విషయంలో చెరువు వివాదం ఎంతో కాలం సాగుతున్నదే. ఏకంగా పోలీసు రక్షణతోనే స్థలానికి ఫెన్సింగ్‌ వేయించారన్న అపవాదు వుండనే వున్నది. ఇక చేర్యాల రెవిన్యూ డివిజన్‌ విషయంలో పార్టీలకు అతీతంగా పోరాటాలు సాగుతున్నాయి. అయినా ముత్తిరెడ్డి స్పందన కనబర్చడం లేదన్నది బిఆర్‌ఎస్‌ నేతలే అంటున్న మాట. అంతే కాదు గతంలో జిల్లా ఏర్పాటు విషయంలో పార్టీ శ్రేణులు చేసినంత ఒత్తిడి, ఏనాడు ముత్తిరెడ్డి చేయలేదని, ప్రజాసంఘాలే ముందుండి జిల్లాను సాధించుకున్నాయన్న సంగతి తెలిసిందే. జిల్లా ఏర్పాటులో ముత్తిరెడ్డి పాత్ర ఎంత అని అనేక మంది నాయకులను నేటిధాత్రి ప్రశ్నిస్తే నవ్వి…ఇదే సమాధనం అంటున్నారంటే ఆయన నాయకత్వం మీద పార్టీ శ్రేణులకు ఎంత నమ్మకం వుందో అర్ధమౌతోంది.                       

జనగామ జిల్లాలో ముత్తిరెడ్డి ద్వితీయశ్రేణిని ఎదగనీయకుండా చేశారు. 

జనగామలో తనంత స్ధాయి నేత లేకుండా చూసుకున్నాడు. దాంతో స్ధానిక నేతలు తము బరిలోవుంటామని గాని,పోరులో వుంటామని చెప్పకుండా ఎవరైనా బలమైన మరో నేత వస్తే చాలన్న మాటలు చెబుతున్నారు. ఈసారి ముత్తిరెడ్డికి కాకుండా ఎవరికి టిక్కెట్టు ఇచ్చినా, గెలిపించుకుంటామంటున్నారు. ఒక వేళ పార్టీ ముత్తిరెడ్డిని బలవంతంతా బరిలో దింపినా, పార్టీ పరంగా ఎంత సపోర్టు చేసినా, ప్రజల్లో వున్న వ్యతిరేకత మాత్రం ఎవరూ ఆపలేరని అంటున్నారు. ప్రజల్లో ముత్తిరెడ్డి మీద కనబడుతున్న వ్యతిరేకత కేవలం ఆయన వ్యక్తిగతమైందే తప్ప, పార్టీకి దానికి సంబంధం లేదంటున్నారు. అందుకే బలంగా వున్న జనగామలో ముత్తిరెడ్డికి తప్ప…ఎవరికి టిక్కెట్టు ఇచ్చినా సరే అన్న మాటలే సర్వత్రా వినిపిస్తన్నాయి. ఇలాంటి నియోజకవర్గంలో అభ్యర్ధిలను మార్చితే తప్ప లాభం లేదు. గెలిచేస్ధానాలలో ప్రజా విశ్వసం లేని నాయకుల మూలాంగా సీట్లు కోల్పోవాల్సివస్తుందనేమో అని పార్టీ శ్రేణులు అందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ముత్తిరెడ్డి ప్రజలకు చేరువౌతాడా…తాజాగా మంత్రి కేటిఆర్‌ ఎన్నికలు సమీపిస్తున్న తరుణం గురించి ఎమ్మెల్యేలందరికీ చేసిన సూచనల ప్రచారం వచ్చే ఏడెనమిది నెలలు ప్రజల్లో ముత్తిరెడ్డి వుంటాడా? వేచి చూడాలి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!