`భూపాలపల్లి రాజకీయాలలో ఈ లొల్లేమిటి?
`కల్వకుంట్ల కవిత జిల్లా పర్యటనలో ఆ గలాట ఏమిటి?
` అధికార పక్షంలోనే ప్రతిపక్షమేమిటి?
` బిఆర్‌ఎస్ లో ఇరుపక్షాలేమిటి?
`భూపాలపల్లిలో గందరగోళమేమిటి?
`ముసలం పుట్టించడం దేనికి?
`సాఫీగా వున్న చోట కవ్వింపులేమిటి?
` ఆదిపత్య పోరు తెచ్చి సాధించేదేమిటి?
`పార్టీ పరువు బజారుకీడ్చడం దేనికి?
`గత ఎన్నికలలో మూడో స్థానానికి పరిమితమైతిరి?
` వారసుల మూలంగా మొదటికే మోసం తెచ్చుకుంటిరి?
`పదవి లేకుండా వుండలేనని సిఎం కేసిఆర్ కు మొరపెట్టుకుంటిరి!
`దాంతో ముఖ్యమంత్రి కేసిఆర్ ఎమ్మెల్సీని చేసిరి?
` అయినా ఆశ తీరడం లేకుంటిరి?
` ఇప్పుడు మళ్ళీ ‘‘సై’’ అని పార్టీలో కుంపటి పెట్టవడ్తిరి?
` ఉన్నది కాస్త ఊడేదాక చేయాలని చూడవడ్తిరి?
`పార్టీకి గడ్డురోజులు తేవడం కాక మరేమిటి?
`ఎమ్మెల్సీ చేసిన నాడు సిఎం. కేసిఆర్ చెప్పిందేమిటి, ఇప్పుడు మీరు చేస్తున్నదేమిటి?
`భూపాలపల్లిలో పార్టీకే చోటు లేకుండా పోతే భవిష్యత్తుకు దారేది?
హైదరాబాద్,నేటిధాత్రి:
అది భూపాల పల్లి నియోజకవర్గం. భారత రాష్ట్ర సమితికి అత్యంత ప్రతిష్టాత్మకమైన నియోజవకవర్గం. తెలంగాణ రాష్ట్రానికి తొలి స్పీకర్‌ను అందించిన నియోజకవర్గరం. ఒకప్పుడు అభివృద్ధికి ఆమడ దూరంలో వున్న ప్రాంతం. ఇప్పుడు జిల్లాగా అవతరించింది. అభివృద్ధిలో దూసుకుపోతోంది. అక్కడ బిఆర్‌ఎస్ పార్టీ ఎంతో బలంగా వుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ ఉద్యమంలో కీలకభూమికపోషించిన ప్రాంతమది. అలాంటి జిల్లాలో ఇద్దరు ఉద్దండులైన నేతలున్నారు. ఒకరు మాజీ స్పీకర్ సిరికొండ మధుసూధనా చారి…మరొకరు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. ఇద్దరూ ఇద్దేరే…ఇద్దరూ ఉమ్మడి రాష్రంలో కూడా పేరెన్నిక గన్న నేతలే…ప్రజల హృదయాలలో స్ధానం సంపాదించుకున్నవారే..కాకపోతే ఎక్కువ సార్లు ఆ నియోజకవర్గం నుంచి గెలిచింది మాత్రం గండ్ర వెంకటరమణారెడ్డే. ఇద్దరూ ఇప్పుడు బిఆర్‌ఎస్ వున్నారు. కాని నియోజకవర్గంలో మాత్రం ఇద్దరిదీ చెరోదారి కావడంలో నాయకులు, కార్యకర్తలు అయోమయంలో పడుతున్నారు. ఇలాంటి పరిస్ధితికి కారణం మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూధనా చారి పేరునే ఎక్కువగా చెప్పుకుంటున్నారు. కారణాలు ఏవైనా కావొచ్చు కాని పార్టీని ఇబ్బందికరమైన పరిస్ధితులు ఎవరూ తేవొద్దు. పైగా పార్టీ బలోపేతం విషయంలో ఎమ్మెల్సీ మధుసూధనా చారి మీద మరింత బాధ్యత వుందనే చెప్పాలి. ఎందుకంటే ఆయన బిఆర్‌ఎస్ పార్టీ ఏర్పాటులో కీలకభూమిక పోషించిన నాయకుడు. తెలంగాణ ఉద్యమ రచనలో తనదైన పాత్ర పోషించిన నాయకుడు. అలాంటి నాయకుడి వల్లనే ఇప్పుడు భూపాల పల్లిలో ఇబ్బందికరమైన పరిస్ధితులు ఎదురౌతున్నాయన్న మాటలు సర్వత్రా వినిపించడం గమనార్హం. తెలుగుదేశం పార్టీలో కూడా ఒకప్పుడు మంచి పేరున్న మధుసూధనా చారి 1994 ఎన్టీఆర్ ప్రభంజనంలో ఒకసారి శాయం పేట నుంచి గెలుపొందారు.
తర్వాత పరిణామాలలో ఆయన చంద్రబాబుకు దూరమయ్యారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కాకపోతే ముఖ్యమంత్రి కేసిఆర్ తెలంగాణ ఉద్యమ రచన సాగించిన సమయం నుంచి ఆయన ఉద్యమానికి తోడుగా నిలుస్తూ వచ్చాడు. కాని ఆ తర్వాత ఎన్నికల్లో ఆయన గెలవలేదు. మళ్లీ తెలంగాణ వచ్చాక 2014లో భూపాలపల్లి నియోజకవర్గం నుంచి గెలిచి, తెలంగాణ తొలి స్పీకర్ అయ్యాడు. 2018లో జరిగిన ఎన్నికల్లో బిఆర్‌ఎస్ ప్రభంజనం సృష్టించింది. 2014 ఎన్నికలంటే ఎక్కువ సీట్లు సాధించింది. స్పీకర్ మధుసూధనా చారి ఓడిపోయారు. భూపాల పల్లినుంచి గండ్ర గెలిచారు. అదే నియోజకవర్గం నుంచి సిరికొండ మీద గెలిచిన గండ్రవెంకటరమణారెడ్డి బిఆర్‌ఎస్‌లో చేరారు. బిఆర్‌ఎస్ భూపాల పల్లిలో తిరుగులేని శక్తిగా మారేందుకు గండ్ర దోహదపడ్డాడు. ఆ తర్వాత వచ్చిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు తిరుగులేని విజయం కట్టబెట్టడంలో వెంకటరమణారెడ్డి కీలక భూమిక పోషించారు. భూపాల పల్లిలో ప్రతిపక్షం అనేది లేకుండా చేయగలిగారు.ఇదే సమయంలో మధుసూధనా చారికి పదవి లేకపోవడం ఒక లోటుగా తోచింది. దాంతో ముఖ్యమంత్రి కేసిఆర్‌కు తనకు పదవి లేకపోవడం ఇబ్బంది కరంగా వుందని చెప్పడంలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అది ఇంకా ఐదేళ్లు వుంది. మధుసధనా చారికి ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడే ముఖ్యమంత్రి కేసిఆర్ భూపాలపల్లి నియోజకవర్గంలో ఎలాంటి రాజకీయ జోక్యాలు చేసుకోవద్దని…ఇబ్బందికరమైన పరిస్ధితులు రావొద్దని సూచించారు. అంతే కాకుండా ఎమ్మెల్యే గండ్రవెంకటరమణారెడ్డిని ఒప్పించి, మధుసూధనా చారి భూపాల పల్లి రాజకీయాల్లో ఎలాంటి జోక్యం వుండదని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఓ ఆరు నెలల పాటు ఎలాంటి సమస్యలేదు. కాని ఆ తర్వాత భూపాల పల్లి నియోజకవర్గంలో ముసలం మొదలౌతూ వచ్చింది. గత కొంత కాలంగా నివురుగప్పిన నిప్పులా ఆధిపత్య పోరు సాగుతూనే వుంది. అయినా అవి పెద్దగా వెలుగులోకి రాలేదు. ఎమ్మెల్యే గండ్ర కూడా వాటిని పట్టించుకోలేదు. పెద్ద మనిషి తరహాగానే సిరికొండను చూస్తూ వస్తున్నారు. ఇటీవల ఎమెల్సీ కల్వకుంట్ల కవిత జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు సిరికొండ, గండ్ర వర్గీయులు బాహాబాహీకి దిగినంత పనిచేశారు. దాంతో కవిత కూడా అక్కడి పరిస్ధితులపై అసహనం వ్యక్తం చేశారు. నిజానికి జిల్లాలో అత్యంత సీనియర్ నాయకుడిగా వున్న సిరికొండ మూలంగా సమస్యలు ఎదురుకావడం అన్నది సరైంది కాదని, పార్టీలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో సిరికొండ మూడో స్ధానంలో నిలిచారు. వెంకటరమణారెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. అయినా ఇద్దరూ ఇప్పుడు ఒకే పార్టీలో వున్నారు. పిట్టపోరు, పిట్టపోరు పిల్లితీర్చినట్లు అసలు ప్రతిపక్షానికి స్ధానం లేని చోట ఇద్దరు నేతల దూరం పెరగడంతో ప్రతిపక్షానికి తావిచ్చినట్లౌతుందని బిఆర్‌ఎస్ నేతలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటిదాకా అసలు ప్రతిపక్షమనేది లేకుండా ఎమ్మెల్యే గండ్ర చూసుకుంటూ వచ్చారు. ఇప్పుడు స్వపక్షంలోనే విపక్షం తయారు కావడం జిల్లా రాజకీయాల మీద తీవ్ర ప్రభావం పడే అవకాశం వుంది. అంతే కాకుండా ఇటీవల మీడియాలో కూడా మధుసూధనా చారి మళ్లీ భూపాల పల్లి నుంచి పోటీ చేస్తారన్న వార్తలు రావడంతో కార్యకర్తల్లో అయోమయం నెలకొన్నది. ఎవరు ఎటు వైపు నిలవాలన్నదానిపై పెద్దఎత్తున మల్లగుల్లాలు పడాల్సివస్తోంది. అంతేకాకుండా భూపాల పల్లిలో ఎలాంటి స్ధానం లేని చోట ప్రతిపక్షానికి అవకాశమిచ్చట్లైతుంది. ఈ విషయం సిరికొండకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్పీకర్‌గా పనిచేసిన సమయంలో మధుసూధనా చారి కూడా అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీపడలేదు. స్పీకర్‌గా వున్నప్పటికీ ప్రజల్లోనే వుంటూ వచ్చారు. రాష్ట్రమంతా బిఆర్‌ఎస్ ప్రభంజనం కొనసాగినా సిరికొండ ఓటమిపాలయ్యారు. అంటే ఆయనపై ప్రజల్లో వ్యతిరేకత వున్నట్లే…పైగా ఆయన ఎన్నికల ఫలితాలలో మూడోస్ధానంలో నిలిచారు.
ఇప్పుడు బిఆర్‌ఎస్‌లో ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. అలాంటప్పుడు జిల్లా రాజకీయాలలో మరొకరు వేలుపెట్టకుండా, ప్రతిపక్షాలకు తావు లేకుండా, అభివృద్ధి విషయంలో అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం వుంది. పైగా పార్టీలోని నాయకులు ఎవరైనా ఇబ్బందికరమైన పరిస్ధితులు సృష్టిస్తే మందలించే స్ధానంలో వున్న మధుసూధనా చారి వల్లనే పార్టీలో ఇబ్బందికరమైన పరిస్ధితులు ఎదురుకావడం పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. పైగా ఈ విషయాలు ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టికి కూడా వెళ్లినట్లు తెలుస్తోంంది. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసిఆర్ సిట్టింగులకే సీట్లు అన్నది తేల్చేశారు. భూపాల పల్లిలో ఎమ్మెల్యే గండ్ర నాయకత్వం బలంగానే వుంది. జిల్లాలో పట్టున్న సీనియర్ నాయకుడు. అలాంటి నియోజకవర్గంలో లేని పోని చిచ్చు పెట్టుకుంటే, బిఆర్‌ఎస్‌కే నష్టం జరుగుతుంది. ఇప్పుడు పార్టీ అధికారంలో వుంది. భూపాల పల్లిలో బలంగా వుంది. ఇలాంటి సమయంలో సఖ్యతతో, మరింత సమర్ధవంతగా పార్టీని కాపాడుకుంటూ, అభివృద్ధి విషయంలో రాజీ లేకుండా ఇరు నేతలు పెద్దఎత్తున జిల్లాను అభివృద్ధి చేయొచ్చు. కాని నిత్యం కీచులాడుకునే పరిస్ధితి వస్తే అభివృద్ది అన్నది పక్కకు వెళ్తుంది…రాజకీయం రాజ్యమేలుతుంది. అధిపత్యం అడుగడుగునా పార్టీకి నష్టం చేకూర్చుతుంది. ఇప్పటికైనా సిరికొండ మధుసూదనా చారి పెద్ద మనిషిగా, పెద్దన్న పాత్ర పోషిస్తే బాగుంటుందనే అందరూ కోరుతున్నారు. మరి భవిష్యత్తు కాలం ఎలా వుంటుందో చూడాలి.