`నేటిధాత్రి ఇచ్చే 25 లక్షలు పోలీసు సంక్షేమానికి ఇస్తారా?
`రెవెన్యూ శాఖలో ఉద్యోగుల సంక్షేమం అవసరం లేదా?
`అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో అనే సామెత లాగే లేదా!
`కోర్టు తీర్పు అమలు చేయని వారే, న్యాయం కోసం నోటీసులు పంపడం విడ్డూరం కాదా?
`ప్రజల పక్షాన నిలిచే మీడియాపైనే పెత్తనమా?
`18 సంవత్సరాల అక్షర ప్రయాణం నేటిధాత్రిది…
`సామాన్యుడి గొంతుకై, తెలంగాణ ఉద్యమ పిడికిలై సాగింది.
`తెలంగాణ సాధనలో ముందుండి నడిచింది.
`తెలంగాణ ఉద్యోగులకు జీతాలు, ప్రమోషన్లకు కారణం తెలంగాణ సాధించడం. ఉద్యమానికి తోడు నిలిచిన మీడియాలో నేటిధాత్రి ది ప్రధాన భూమిక.
`అవినీతి అధికారుల బండారం బైటపెట్టింది…
`నిజాయితీ అధికారులను ప్రజలకు మరింత చేరువచేసింది.
`ఆదర్శవంతమైన ఉద్యోగ సమాజ నిర్మాణం కోసం పాటుపడిరది.
`నేటిధాత్రి అక్షరం అంటే నిజానికి ప్రతిరూపం…ప్రజా గళం.
`అడిగితే అధికారులకు కోపాలా!
`మీడియాకు నోటీసులా!?
`ప్రజల పన్నులతో జీతాలు తీసుకుంటూ జనానికి పని చేయకపోతే మీడియా ప్రశ్నించదా?
`ప్రజల పక్షాన వార్తలు అధికారులకు కంటకింపులా? అడ్డంకులా!
`పని చేస్తే ప్రశంసించేది మీడియానే…పని చేయకపోతే ఎండగట్టేది మీడియానే!
`అది తెలిసి కూడా మీడియా మీద బురజల్లితే జనం నవ్వుకుంటారు.
`పని చేసి ప్రశంసలు అందుకోండి…
`ప్రజల చేత శాపనార్థాలు పెట్టించుకోకండి…
`జనం వెతలు, పడుతున్న ఇబ్బందులు తీర్చి శభాష్ అనిపించుకోండి…
`ఏ అధికారికైనా నేటిధాత్రి చెప్పేది ఇదే…
` స్పందన లేకుంటే అక్షరాలు సందించడం మీడియా కర్తవ్యం.
నేటిధాత్రికే నోటీసులా!
హైదరాబాద్,నేటిధాత్రి:
రాష్ట్ర ప్రభుత్వం ఫ్రెండ్లీ గవర్నమెంట్ అనేది కొందరు అధికారులకు అలుసుగా మారిపోయింది. ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటే ప్రభుత్వాధికారులు, ప్రజలతో స్నేహ భావంతో వుండాలన్న అంతరార్థం విస్మరించి, ప్రభుత్వం మాకు అనుకూలంగా వుందనే అపోహలో వుంటున్నారు. కొత్తగా వచ్చిన తెలంగాణలో అభివృద్ధి మీద రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టి, అధికారుల విషయంలో కొంత మెతకవైఖరి అనుసరిస్తోంది. ఇది కొందరు అధికారులకు వరంగా మారిపోయింది. దాంతో అధికారుల విధులు గుర్తు చేసే మీడియాను కూడా బ్లాక్ మెయిల్ చేయొచ్చన్న అపోహలో పడిపోతున్నారు. సరిగ్గా మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలానికి చెందిన తహసీల్దారు తన విధుల నిర్వహించడంలో నిర్లిప్తత, నిర్లక్ష్యం వహిస్తూ, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నది నేటిధాత్రి దినపత్రిక కు అందిన సమాచారం. తహసీల్దారు మూలంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న వాళ్లు వారికి ఎదురౌతున్న సమస్యలు నేటిధాత్రి దినపత్రిక దృష్టికి తీసుకొచ్చారు. పైగా ఒక ప్రత్యేకమైన విషయం కూడా నేటిధాత్రి సవివరంగా వివరించడం జరిగింది. ఓ వ్యక్తికి చెందిన భూమి విషయంలో కోర్టు ఉత్తర్వులు అమలు చేయమని సదరు వ్యక్తి తహసీల్దారును రిక్వెస్ట్ చేశారు. హైకోర్టు ఆదేశాలు, వాటి అమలు విషయంలో జిల్లా కలెక్టర్ ఆర్డీవో కు, ఆర్డీవో సంబంధిత తహసీల్దారు కు జారీ చేసిన ఆదేశాలు గుర్తు చేయడం జరిగింది. అయినా ఆ వ్యక్తి వేదన అరణ్య రోధనైంది. ఎన్నో రోజులుగా తహసీల్దారు కార్యాలయం చుట్టూ కాళ్లు జరిగేలా తిరుగుతున్నాడు. అతను ఎన్ని సార్లు తహసీల్దారు ను వేడుకున్నా న్యాయపరంగా కావాల్సిన పని కావడం లేదు. పని గట్టుకొని కక్ష్య కట్టినట్లు తహసీల్దారు కావాలనే సదరు వ్యక్తి పని చేయడం లేదన్నది అతని ప్రధాన అభియోగం. అదే విషయం ఆయన నేటిధాత్రి దినపత్రిక దృష్టికి తెచ్చారు. అతనికి చెందిన భూమిని అప్పగించడంలో తహసీల్దారు చొరవ చూపడం లేదు. ఇప్పటికే ఆ వ్యక్తికి చెందిన భూమిలో అక్రమ నిర్మాణాలు కూడా వెలుస్తున్నాయి. అయినా తహసీల్దారు పట్టించుకోకపోవడంతో విసుగు చెందిన వ్యక్తి నేటిధాత్రిని ఆశ్రయించడం జరిగింది. సమాజంలో ఎవరికి ఎలాంటి సమస్య ఎదురైనా ముందు తమ సమస్యలను మీడియా దృష్టికి తీసుకెళ్లడం ఆనవాయితీ… అంతెందుకు ఉద్యోగులకు సమస్యలు ఎదురైనా ముందు మీడియా దృష్టికి తీసుకొచ్చి, ప్రభుత్వానికి తెలిసేలా చూసుకుంటారు. అలాగే అధికారులు కూడా స్పందించాల్సిన సమయంలో స్పందించకపోయినా, సరైన సమయంలో ప్రజల పనులు చేయకపోయినా, జాప్యం జరిగినా, ఎలాంటి విపత్కర పరిస్థితులను అధికారులు సృష్టించినా ప్రజలు ఆశ్రయించేది మీడియానే…ఈ విషయం తహసీల్దారుకు తెలియంది కాదు…అయినా తహసీల్దారు నేటిధాత్రి దినపత్రిక మీద కూడా బురద జల్లే ప్రయత్నం చేశారు. నేటిధాత్రి దినపత్రికలో వచ్చిన వార్త ఏమిటి? తహసీల్దారు ప్రతిస్పందన ఏమిటి? తహసీల్దారు స్పందనకు పొంతన లేదు. ప్రజలకు మెరుగైన సేవలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలని నేటిధాత్రి దినపత్రిక ఇచ్చిన సూచన మాత్రం తహసీల్దారుకు కనిపించలేదు. అర్థం చేసుకోలేదు. పెడర్థం తీసుకుంటే దానికి నేటిధాత్రి దినపత్రిక బాధ్యత కాదు.
నేటిధాత్రి ఇచ్చే 25 లక్షలు పోలీసు సంక్షేమానికి ఇస్తారా?
నేటిధాత్రి తహసీల్దారు వార్తలో పోలీసుల ప్రస్తావన తెచ్చింది లేదు. అక్కడ ప్రస్తావించే అంశం కూడా కనిపించలేదు. కేవలం తహసీల్దారు వరకే వార్తా కథనం పరిమితం. అందులో పోలీసుల మనోభావాలు ఎందుకొచ్చాయో తహసీల్దారే చెప్పాలి. ఇదిలా వుంటే నేటిధాత్రి ఇచ్చే డబ్బు పోలీసు శాఖ సంక్షేమానికి వినియోగిస్తామని చెప్పడంలో ఔచిత్యమేమిటో కూడా తహసీల్దారే చెప్పాలి. రెవెన్యూ వ్యవస్థలో కింద స్థాయి ఉద్యోగులైన విఆర్‌ఓ, విఆర్‌ఏలు చాలీ చాలని జీతాలతో జీవితాలను గడుపుతున్నారు. వాళ్ల మీద తహసీల్దారుకు జాలి లేదని ఒక్క మాటతో తేల్చేశారు. కనీసం మానవత్వం చూపించేందుకు కూడా సోదాహరించలేదు. రెవెన్యూ శాఖలో ఉద్యోగుల సంక్షేమం ఆవశ్యకత తహసీల్దారుకు లేదా?
అయిన వారికి ఆకుల్లో, కాని వారికి కంచాల్లో అనే సామెత లాగే లేదా! రెవెన్యూ శాఖలో ఉద్యోగుల కోసం ఒక తహసీల్దారుగా అండగా నిలబడతానన్న మాట మాట్లాడిన బాగుండేదోమో! చిత్తశుద్ధి, త్రికరణ శుద్ది అనేది అందరిలో వుండదు. ఆ మధ్య సూర్యాపేట జిల్లాకు చెందిన ఓ ఉద్యోగి పదెకరాలకు పైగా సాగు భూమి వున్న రైతులకు రైతుబంధు ఇవ్వొద్దని ప్రభుత్వానికి ఉత్తరం రాశాడు. స్పందన ఇలా వుండాలి. అలా ఆందోళన చేసిన రెవెన్యూ ఉద్యోగుల పక్షాన నస్పూర్ తహసీల్దారు ఏనాడైనా మాట్లాడారా? అయినా ఒక ఉద్యోగిగా బాధితులకు న్యాయం చేయాలని నేటిధాత్రి సూచించింది. అందులో మనోభావాలు దెబ్బతినే అవకాశం ఎక్కడుంది! ఎందుకుంటుంది? నస్పూర్ తహసీల్దారుగా అక్కడ ఎవరున్నా ఇదే నేటిధాత్రి ప్రశ్నిస్తుంది…అంతే తప్ప వ్యక్తిగతమైన ప్రశ్నకు తావెక్కడిది. అనవసరంగా వివాదం పెద్దది చేసుకోవడం, తన కర్తవ్యం విస్మరించడమే అవుతుంది. ఇక్కడ మరో విచిత్రం చోటు చేసుకున్నది. సాక్ష్యాత్తు హైకోర్టు ఉత్తర్వులే నస్పూర్ తహసీల్దారు అమలు చేయడానికి ఇష్టపడడం లేదు. ఒక రకంగా కోర్టు ధిక్కరణ చేస్తున్నారు. ఇతరులు న్యాయం చేయాలని తెచ్చిన తీర్పును పక్కన పెట్టి, తనకు న్యాయం కావాలని కోర్టును తహసీల్దారు ఆశ్రయిస్తున్నారు. అంటే న్యాయం ఎవరికైనా ఒకటే…తనకో న్యాయం, ఇతరులకో న్యాయం వుంటుందా? కోర్టు తీర్పు అమలు చేయని వారే, న్యాయం కోసం నోటీసులు పంపడం విడ్డూరం కాదా?
ప్రజల పక్షాన నిలిచే మీడియాపైనే పెత్తనం చేయాలని చూడడం బాగా అలవాటైంది.
ఏ మీడియాకైనా వ్యక్తిగత ఇష్టాఇష్టాలు వుండవు. మీడియా అనేది ఒక వ్యవస్థ. ఉద్యోగిలాగా వ్యక్తిగతమైనది కాదు. మీడియాలో ఏక వ్యక్తి స్వామ్యం వుండదు. సమిష్టి వ్యవహారం…ప్రజల పక్షాన అక్షర సమరం… 18 సంవత్సరాల అక్షర ప్రయాణం నేటిధాత్రిది…సామాన్యుడి గొంతుకై, తెలంగాణ ఉద్యమ పిడికిలై సాగింది. తెలంగాణ సాధనలో ముందుండి నడిచింది. తెలంగాణ ఉద్యోగులకు జీతాలు, ప్రమోషన్లకు కారణం తెలంగాణ సాధించడం. తెలంగాణ ఉద్యమానికి తోడు నిలిచిన మీడియాలో నేటిధాత్రి ప్రధాన భూమిక పోషించింది. ఉద్యోగులకు ఫిట్ మెంటు ఇవ్వడం స్వాగతించింది. అలా అని అధికారులు తప్పు చేస్తే చూస్తూ ఊరుకోదు. అనేక సందర్భాలలో అవినీతి అధికారుల బండారం బైటపెట్టింది…నిజాయితీ అధికారులను ప్రజలకు మరింత చేరువచేసింది. ఆదర్శవంతమైన ఉద్యోగ సమాజ నిర్మాణం కోసం పాటుపడిరది. అధికారుల మెరుగైన సేవల కోసం కృషి చేసింది. అదీ నేటిధాత్రి విశ్వసనీయత. ప్రజల పక్షాన నిలవడమే నేటిధాత్రికి తెలుసు. నేటిధాత్రి అక్షరం అంటే నిజానికి ప్రతిరూపం…ప్రజా గళం. ప్రజలకు సేవ చేయడానికి కుర్చీలో కూర్చున్న వాళ్లు మనోభావాల పేరుతో చేయాల్సిన పనిని తప్పించుకునే ప్రయత్నం చేయడం అసంబద్ధమైనది. హై కోర్టు తీర్పు కూడా అమలుచేయకపోతే మీడియా ప్రశ్నించదా? అడిగితే అధికారులకు కోపాలా!
మీడియాకు నోటీసులా!? నేటిధాత్రికి ఇలాంటి నోటీసులు కొత్త కాదు…
ప్రజల పన్నులతో జీతాలు తీసుకుంటూ జనానికి పని చేయకపోతే మీడియాగా ప్రశ్నించడం నేటిధాత్రి హక్కు.. ప్రజల పక్షాన వార్తలు అధికారులకు కంటకింపులా? నేటిధాత్రికి నోటీసులు పంపడం అంటేనే తమ కర్తవ్యం నుంచి పక్కకు తప్పుకోవడం… పని చేస్తే ప్రశంసించేది మీడియానే…పని చేయకపోతే ఎండగట్టేది మీడియానే!
అది తెలిసి కూడా మీడియా మీద బురజల్లితే జనం నవ్వుకుంటారు.
పని చేసి ప్రశంసలు అందుకోండి…ఇదే నేటిధాత్రి ఎప్పుడూ చెప్పేది… ప్రజల చేత శాపనార్థాలు పెట్టించుకోకండి…అని మంచి మాటలే నేటిధాత్రి చెబుతుంది. జనం వెతలు, పడుతున్న ఇబ్బందులు తీర్చి శభాష్ అనిపించుకోండి…అని సూచనలు చేస్తుంది.. ఏ అధికారికైనా నేటిధాత్రి చెప్పేది ఇదే…అయినా స్పందన లేకుంటే అక్షరాలు సందించడం మీడియా కర్తవ్యం.