`మంత్రి కేటిఆర్ అన్నట్లు జరనుందా?
`సెస్ ఎన్నికలలో బిజేపి ఎందుకు ఓడిపోయింది.
`రైతుల్లో బిజేపి స్థానం లేదన్నది స్పష్టమైందా?
`బిజేపి అతి విశ్వాసం మొదటికే వస్తుందా?
` టిడిపితో కలిస్తే తప్ప బిజేపికి మనుగడ లేదా?
`సామాన్యుల కష్టాలకు ధరల భారం కారణం కాదా?
`బిజేపి పాలిత రాష్ట్రాలలో ప్రత్యేకంగా అమలౌతున్న పథకం ఏమైనా వుందా?
`తెలంగాణలో అమలౌతున్న పథకం ఒక్కటన్నా బిజేపి అందిస్తోందా?
`సంక్షేమం విస్మరించిన బిజేపిని రాష్ట్రాలలో ప్రజలు నమ్ముతారా?
`టిడిపితో జతకట్టి నిండా మునుగుతారా?
`తెలంగాణ కనీసం సింగిల్ డిజిట్ సీట్లు వచ్చేనా?
`బిఆర్ఎస్ ను ఎదుర్కొనే నాయకులు బిజేపిలో వున్నారా?
హైదరాబాద్,నేటిధాత్రి:
తెలంగాణలోనే కాదు దేశంలో జరిగే అన్ని ఎన్నికలలో బిజేపికి సినిమా కనబడడం తప్పదా? సీనంతా మంత్రి కేటిఆర్ అన్నట్లు జరనుందా? సహజంగా మన దేశంలోనే కాదు, రాష్ట్రాలలో కూడా ఒకటికి, రెండుసార్లు ప్రజలు అధికారం కట్టబెట్టినా, మూడో సారి అధికారం ఇచ్చిన దాఖలాలు తక్కువ. కొన్ని రాష్ట్రాలలో మాత్రమే మూడు సార్లకు పైగా అధికారం ప్రజలిచ్చారు. కేంద్రంలో మాత్రం వరుసగా మూడు సార్లు ఒక్క జవహర్ లాల్ నెహ్రూ కాలంలో మాత్రమే ఇవ్వడం జరిగింది. తర్వాత వరుసగా ఎవరికీ మూడు సార్లు అధికారం ఇవ్వలేదు. ఇందిరాగాంధీకి కూడా ప్రజలు అలాంటి అవకాశం ఇవ్వలేదు. రాజీవ్‌గాంధీ ప్రధాని అయిన తర్వాత జరిగిన ఎన్నికలలో అంతకు ముందు ఎవరికీ ఇవ్వని మెజారిటీ సీట్లు కాంగ్రెస్ కు వచ్చాయి. అయినా తర్వాత జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ ఓడిపోయింది. ఆ తర్వాత కూడా నేషనల్ ఫ్రంట్ లాంటి ప్రభుత్వాలు నిలబడలేదు. తర్వాత పి.వి. నరసింహారావు ప్రభుత్వం కూడా ఐదేళ్లే పరిపాలన చేసింది. వాజ్ పాయ్ ప్రభుత్వం ఏర్పడినా నిలవలేదు. చివరికి భారత్ వెలిగిపోతోందని బిజేపి ఎంత ప్రచారం చేసినా ప్రజలు ఎన్డీయేను ఓడిరచారు. వాజ్ పాయ్ ప్రభుత్వానికి మరో అవకాశం ఇవ్వలేదు. కాకపోతే తర్వాత వచ్చిన యూపిఏ ప్రభుత్వం వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. మొదటి సారి యూపిఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సోనియా గాంధీ ప్రధానమంత్రి అవుతుందని అనుకున్నారు. ప్రజలు కాంగ్రెస్ కు మెజారిటీ సీట్లు ఇచ్చినా మూడ్ ఆప్ నేషన్ దృష్ట్యా సోనియా గాంధీ ప్రధాని కాలేదు. మన్మోహన్ సింగ్ ను ప్రధానిని చేశారు. సోనియా గాంధీ చేసిన త్యాగం రెండోసారి కాంగ్రెస్ గెలవడానికి ఉపయోగపడిరది. సోనియా గాంధీ ప్రధాని కాలేదు. రాహుల్ గాంధీ ని ప్రధానమంత్రిని చేసే అవకాశం వున్నా చేయలేదు. కనీసం రాహుల్ గాంధీని క్యాబినెట్ లోకి కూడా తీసుకోలేదు. అయినా ప్రజలు కాంగ్రెస్ కు మూడోసారి అవకాశం ఇవ్వలేదు. ఇక తాజాగా బిజేపి కన్నా పవర్ పుల్ అయిన ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వానికి ప్రజలు రెండు సార్లు అవకాశం కల్పించారు. అదేంటో గాని ప్రజలు ఆశించిన పాలన, ఊహించిన సంక్షేమం జరగడం లేదన్న అభిప్రాయం అందరిలోనూ వుంది. మొదటి సారి ప్రధాని నరేంద్ర మోడి అధికారంలోకి వచ్చాక ప్రజలు విపరీతమైన ఆశలు పెట్టుకున్నారు. ఏదో అద్భుతం జరుగుతుందని ఆశించారు. ఇంతలో నరేంద్ర మోడీ పెద్ద నోట్ల రద్దు చేశారు. దేశమంతా హర్షించింది. దేశంలో నల్లదనం లేకుండా పోతుందని అనుకున్నారు. అంతే కాకుండా విదేశాలలో దాగి వున్న నల్ల డబ్బు దేశానికి వస్తుందనుకున్నారు. నోట్ల రద్దు మూలంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. యాభై రోజులలో మార్పు చూస్తారని ప్రధానమంత్రి మోడీ చెప్పారు. నిజంగానే ప్రజలు మార్పును చూడడం కాదు సమస్యలు అనుభవిస్తున్నారు. ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇప్పటికీ జనం కోలుకోవడం లేదు. అయినా ప్రజలు భరించారు. మార్పుకు కొంత సమయం పడుతుందని ఎదురుచూశారు. ఇక ఆ తర్వాత దేశమంతా ఒకే పన్ను విధానం వల్ల దేశంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని అనుకున్నారు. అర్థరాత్రి వచ్చిన స్వతంత్రం, లాగా అర్థరాత్రి తెచ్చిన జిఎస్టీ మూలంగా దేశానికి ఎంతో మేలు జరుగుతుందని అనుకున్నారు. కానీ జరిగింది వేరు. నల్ల కుబేరులకు ఏమీ కాలేదు. చిన్న చిన్న పరిశ్రమలు చితికిపోయాయి. మూత బడ్డాయి. ఉపాధి పోయింది. పారిశ్రామిక రంగం కుదేలైంది. లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. అనేక మంది జీవితాలు వీధిన పడ్డాయి. అయినా ఏదో అద్భుతం జరుగుతుందని ప్రజలు అదే ఊహల్లో వుండి, మరోసారి బిజేపిని గెలిపించారు. అప్పుడు గాని పెనం మీద నుండి పొయ్యిలో పడ్డామని ప్రజలకు అర్థం అయ్యింది. పెరుగుతున్న ధరలు సామాన్యుల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. అందుకే బిజేపిలో కూడా కొంత కలవరం మొదలైంది. మళ్ళీ పాత పొత్తులను తెరమీదకు తెచ్చుకునే ప్రయత్నం జరుగుతోంది. అయినా ప్రజలు నమ్ముతారన్న గ్యారంటీ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఇదీ దేశ వ్యాప్తంగా రాజకీయ పార్టీలు వేసుకుంటున్న అంచనా.
ఇక తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ బిఆర్ఎస్ ఎంతో బలమైన పార్టీ.
ప్రజలు ఎంచుకొని, పెంచుకున్న పార్టీ. తెలంగాణ వచ్చిన నుంచి అప్రతిహతంగా సాగుతున్న పార్టీ. ఓటమి అన్నది లేని పార్టీ. అయితే ఈ మధ్య రెండు ఉప ఎన్నికలు బిజేపికి కలిసొచ్చాయి. అవి గెలవటానికి కారణం వేరు. గెలిచిన తీరు వేరు. పోటీ చేసిన అభ్యర్థుల రాజకీయ జీవితం వేరు. అవి కలిసొచ్చి బిజేపి గెలిచింది. అంతే అంతకు మించి ఏమీ లేదు. ఇటీవలే జరిగిన మునుగోడు ఉప ఎన్నికతో తెలంగాణ బిఆర్ఎస్ కు తిరుగు లేదని తేలిపోయింది. మునుగోడు ఉప ఎన్నిక సెమీ ఫైనల్స్ గా అభివర్ణిస్తూ సెస్ ఎన్నికలలో బిజేపి ఎందుకు ఓడిపోయింది. బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రాతినిధ్యం వహించే కరీంనగర్ పార్లమెంటు పరిధిలో బిజేపి పరిస్థితి ఏమిటో అందరికీ తెలుసు. ఇటీవల సిరిసిల్ల సెస్ ఎన్నికలలో బిజేపి ఎక్కడా బిఆర్ఎస్ కు పోటీ ఇవ్వలేదకపోయింది. అంటే చిన్న పిల్లలకు కూడా అర్థమౌతుంది. కానీ బిజేపి నేతలకు అర్థం కావడం లేదు. రైతుల్లో బిజేపికి స్థానం లేదన్నది స్పష్టమైందా?బిజేపి అతి విశ్వాసం మొదటికే వస్తుందా? ఎవరికైనా విశ్వాసం వుండాలి. అతి విశ్వాసం కొంప ముంచుతుంది. బిజేపిలో వ్యక్తి పూజ మరీ ఎక్కువౌతోంది. దేశంలో ఏ పార్టీలో అంత వ్యక్తి పూజ లేదు. ప్రధాని నరేంద్ర మోడీ విషయంలో బండి సంజయ్ మాటలు మరీ విడ్డూరంగా వుంటాయి.
దేవుడన్నా మన మోడీ…పేదల దేవుడన్నా మన మోడీ అని కీర్తిస్తుంటాడు. వ్యక్తి గతంగా ప్రధాని మోడీ మీద బండి సంజయ్ కి ఎనలేని అభిమానం వుండొచ్చు. అయినా అది ప్రధాని కుర్చీలో మోడీ వుండడం వల్లనే అన్నది ఆయన మాటల్లో తొనికే భావన. నిజానికి ప్రధాని పీఠం మీద ఎవరున్నా బండి సంజయ్ వ్యాఖ్యలు అలాగే వుంటాయి. అంతే తప్ప అది మోడీ మీద వున్న ప్రేమ కాదని తేలిపోతోంది. అసలు సామాన్యులు బతకలేని పరిస్థితి సృష్టిస్తూ పేదల దేవుడు అని ఎలా కీర్తిస్తున్నారో అర్థం కాదు. అది వాళ్ల పార్టీ అంతర్గత వ్యవహారం అనుకున్నా, వ్యక్తి పూజ ప్రజాస్వామ్య రాజకీయాలలో సరైంది కాదు.
టిడిపితో కలిస్తే తప్ప మనుగడ బిజేపికి మనుగడ లేదా?
తెలంగాణలో ఒంటరి పోరాటం చేయలేదు. ఎన్నికల బరిలో దిగలేదు. ఉమ్మడి రాష్ట్రంలోనైనా ఇప్పుడైనా తెలుగు దేశంతో జత కడితే తప్ప మనుగడ లేదు. ఆంద్రప్రదేశ్ లో కూడా అంతే. 2014లో టిడిపితో కలిసి పోటీ చేయడం వల్లనే ఓ ఐదు సీట్లు వచ్చాయి. తర్వాత ఒంటరి పోరుకు పోయి, బిజేపి బొక్కబోర్లా పడిరది. రాష్ట్ర రాజకీయాలలో కొన్ని అనూహ్య మార్పులే రెండు సీట్లు గెల్చుకోవడానికి కారణం. అంతే తప్ప అది బిజేపి బలం కాదు. ఆ పార్టీకి బలగం లేదు. క్షేత్ర స్థాయి యంత్రాంగం అసలే లేదు. వున్న నాలుగు జుట్లలో సఖ్యత లేదు. ఒకరికొకరు సహకారం లేదు. ఇవన్నీ ఇలా వుంటే తెలంగాణలో అమలౌతున్న ఏ ఒక్క పథకం బిజేపి పాలిత రాష్ట్రాలలో అమలు చేయడం లేదు. అధికారంలోకి వస్తున్నాం…వస్తాం అనుకుంటే సరిపోతుందా? దేశంలోని బిజేపి పాలిత రాష్ట్రాలలో తెలంగాణ లో అమలయ్యే పథకాలకంటే ఒక్క మంచి, కొత్త పథకం ఏదైనా వుందా? అసలు ఏ రాష్ట్రంలోనూ తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ఆసరా పెన్షన్లు ఎక్కడా ఇవ్వడం లేదు. ఇక్కడ ఇచ్చినంత ఇతర రాష్ట్రాలలో బిజేపి ఎందుకు ఇవ్వడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఇంత తక్కువ సమయంలో కట్టిన నీటి పారుదల ప్రాజెక్టులు ఏ రాష్ట్రంలోనైనా కట్టారా? కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు వున్నాయా? ఏ ఒక్కటీ చెప్పుకోవడానికి లేదు. పైగా సంక్షేమ కార్యక్రమాల అమలును ఉచితాలుగా అవహేళన చేయడాన్ని ప్రజలు సమర్థిస్తారా? ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు దానం చేయడం ప్రజలకు తీరని అన్యాయం చేయడం కాదా? పేదలకు ఇచ్చిన చిన్న చిన్న రుణాలు మాఫీ చేయడానికి చేతులు రాని, కేంద్రం బడా బాబులకు పది లక్షల కోట్లు మాఫీ చేయడాన్ని ప్రజలు ఎలా ఆహ్వానిస్తారు. అధికారంలో వున్న బిజేపి సంక్షేమం విస్తరించింది. అలాంటి పార్టీని ఆయా రాష్ట్రాలలోనే కాదు తెలంగాణ ప్రజలు నమ్ముతారా? టిడిపితో జతకట్టి నిండా మునుగుతారా?తెలంగాణ కనీసం సింగిల్ డిజిట్ సీట్లు వచ్చేనా? బిఆర్ఎస్ ను ఎదుర్కొనే నాయకులు బిజేపిలో వున్నారా? అన్న అనుమానం అందరిలో వుంది. ఆ పార్టీలో కూడా వుంది. కాకపోతే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. పగటి కలలుకంటోంది. ఇదే విషయం మంత్రి కేటిఆర్ చెబుతోంది…వినబడుతుందా!!