`ఏ మతానికి కొమ్ము కాయలేదు!
`వీడియోలో కొన్ని మాటలు తీసుకొని ఆరోపించడం తగదు.
`క్రిస్మస్ వేడుకలకు వెళ్ళి చెప్పాల్సింది చెప్పాను.
`బిజేపి నేతలకు నచ్చింది చెప్పాలనడం ప్రజాస్వామ్య విరుద్దం.
`నేను హిందువునే…మీకన్నా గొప్ప భక్తుడినే.
`నేను ఎన్నో దేవాలయాల నిర్మాణానికి సహకరించాను.
`నా స్వేచ్చను హరించే హక్కు ఎవరికీ లేదు.
`నాపై అసత్య ఆరోపణలు అసందర్భ ప్రేలాపనలే.
`నా వృత్తి నిబద్దత కరోనా సమయంలో ప్రజలే చూశారు.
`కొత్తగా నేను ఎవరి కోసం ఇప్పుడు నా సచ్చీలత నిరూపించుకోవాల్సిన అవసరం లేదు.
`నాపై వ్యక్తిగత విమర్శలు చేసే హక్కు ఎవరికీ లేదు!
`నా రాజకీయ భవిష్యత్తు గురించి ఎవరికీ ఆందోళన అవసరం లేదు.
నేను చెప్పింది సందేశమే…సర్వమానవాళి సంతోషం కోసమే!: గడల శ్రీనివాస్
హైదరాబాద్,నేటిధాత్రి:
నేను ఏం మాట్లాడాలన్నది నా వ్యక్తిగత విషయం. నేను హిందువునే. సెక్యులర్ వాదినే. నాకు క్రిస్టియన్ మతాన్ని విస్వసిస్తున్న ఎంతో మంది స్నేహితులు, సన్నిహితులు వున్నారు. తమ పండగ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఆ సందర్భంలో నేను మాట్లాడిన మాటలు వేరు. కొందరు రాజకీయం కోసం వక్రీకరించింది వేరు. అని రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్. గడల శ్రీనివాస్ రావు అన్నారు. నేటిధాత్రి తో ఆయన మాట్లాడుతూ తనపై వచ్చిన ఆరోపణలపై వివరణిచ్చారు. ఒక్కసారి నేను మాట్లాడిన విషయాలు పూర్తిగా వింటేనే అసలు విషయం భోదపడుతుంది. అంతే తప్ప తమ రాజకీయ అవసరానికి, నన్ను అబాసుపాలు చేయడానికి అవసరమైన ముక్కను తీసుకొని విమర్శకులు చేయడం అసందర్భ ప్రేలాలపనే అవుతుంది. నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడిన వాళ్లు దయానంద సరస్వతి రెండు వందల సంవత్సరాల క్రితం చెప్పిన వేదాలకు మరలండి. అనే మాట చెప్పే ధైర్యం వుందా? లౌకిక ప్రజాస్వామ్యంలో అన్ని మతాలను గౌరవించడం మన విధి. అయినా క్రిస్మస్ వేడుకలకు వెళ్ళి, ఆ మతాన్ని గురించి మాట్లాడకపోతే లౌకిక స్పూర్తికి అర్థముంటుందా? ఆ మాత్రం కనీస అవగాహన లేకుండా విమర్శలు చేయడం సరైంది కాదు. నేను క్రిస్మస్ వేడుకలకు మాత్రమే హజరయ్యాను. మత ప్రచార సమావేశం కాదు. నేను ఏ మతానికి కొమ్ము కాయలేదు. క్రిస్మస్ వేడుకలకు వెళ్ళి చెప్పాల్సింది చెప్పాను.
బిజేపి నేతలకు నచ్చిందే చెప్పాలనడం నా స్వేచ్చను హరించడమే అవుతుంది. అది ప్రజాస్వామ్య విరుద్దం.నేను హిందువునే…మీకన్నా గొప్ప భక్తుడినే. నా భక్తిని శంకించే హక్కు ఎవరికీ లేదు. నన్ను విమర్శించిన వాళ్లు, ఎన్ని హిందూ దేవాలయాల పరిరక్షణకు పాటుపడ్డారో తెలియదు. నేను మాత్రం ఎన్నో దేవాలయాల నిర్మాణానికి సహకరించాను. హిందువుగా నా ధర్మం అనుకున్నాను. నిర్వర్తించాను.
నా స్వేచ్చను హరించే హక్కు ఎవరికీ లేదు. నాపై అసత్య ఆరోపణలు చేసి, నన్ను టార్గెట్ చేయడానికి నేను రాజకీయాలలో లేను. ఇంకా రాజకీయాలు మొదలుపెట్టలేదు. ఒక వేళ రాజకీయాలు మొదలుపెట్టినా అన్ని కులాల, మతాల ప్రజల ఆశీస్సులు నాకు అవసరం. నాకే కాదు అందరికీ అవసరం. నన్ను విమర్శించిన వాళ్లు ఎన్నికలలో ఇతర మతాల ఓట్లు వద్దనే శక్తి వుందా? ఏ ఒక్కరినీ విబేధించినా అది నీతిమాలిన చర్యే అవుతుంది. ఇక నా వృత్తి విషయంలో కరోనా కాలంలో ప్రాణాలకు తెగించి పని చేశాను. నన్ను విమర్శించిన వాళ్లు ఇళ్ల నుంచి బయటకు రావడానికే భయపడ్డారు. నా వృత్తి నిబద్దత కరోనా సమయంలో ప్రజలే చూశారు.కొత్తగా నేను ఎవరి కోసం ఇప్పుడు నా సచ్చీలత నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నాపై వ్యక్తిగత విమర్శలు చేసే హక్కు ఎవరికీ లేదు! నా రాజకీయ భవిష్యత్తు గురించి ఎవరికీ ఆందోళన అవసరం లేదు. నేను రిటైర్ అయ్యాక ఆలోచించాల్సిన రాజకీయాల గురించి, నా కంటే ఇతరులకే ఎక్కువ ఆసక్తి వున్నట్లు కనిపిస్తోంది. ఇది మాత్రం నాకు బాగానే నాకు నచ్చింది. నేను రాజకీయాలలోకి రావాలని చాలా మంది కోరుకుంటున్నట్లు అర్థమౌతోంది. ప్రజలకు వైద్య పరంగా విసృతమైన సేవలు అందిస్తున్న నాకు, మరింతగా ప్రజా సేవ చేసే అవకాశం రావాలనే కోరుకుంటున్నాను. ఒక ఉద్యోగిగా ఇంత సేవ చేయగలిగినప్పుడు నాయకుడిగా మరింత చేసే అవకాశం వుంటుంది. ఆ అవకాశం రావాలని నేను కోరుకుంటున్నట్లే, చాలా మంది కోరుకుంటున్నట్లు అర్థమైంది. లేకుంటే నన్ను ఇంతగా ట్రోల్ చేయకపోయేవారు. అందుకు ధన్యవాదాలు కూడా. నేనేమిటో, నా నిబద్ధత ఏమిటో పూర్తిగా నన్ను విమర్శించిన వాళ్లకు అర్థమైనట్లుంది. అది నాకు కూడా సంతోషాన్నిచ్చేదే అనిపిస్తోంది.