`ఒకసారి చేయాల్సిన ఆపరేషన్ నాలుగుసార్లు!
`జరిగింది తప్పే అని ముందు ఒప్పుకోవడాలు?
`తర్వాత ప్లేటు పిరాయింపులు?
`ఠాగూర్ సినిమా చూపిస్తున్న ప్రైవేటు ఆసుపత్రులు!
`ఇదే వైద్యం ప్రభుత్వాసుపత్రిలో జరిగి ఫెయిల్ అయితే?
`ఆపరేషన్ వికటించిన వ్యక్తి ఉదయం మరణిస్తే…సాయంత్రం దాకా హైడ్రామా?
`బిల్లు చెల్లించి తీసుకెళ్లమని ఆజ్ఞలు…!
`జనం కదిలితే దిగొచ్చారు…ప్రభుత్వ వైద్యాదికారులు మధ్య వర్తిత్వం చేశారు?
`ప్రాణం పోయినా కేసులేదు…నాలుగు చేతిలో పెట్టి చేతులు దులుపుకున్నారు!
`పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ప్రైవేటు ఆసుపత్రులు…
`కాల్ ఇన్ డాక్టర్లతో ఆపరేషన్లు…
`చనిపోయిన వ్యక్తికి ముగ్గురు ఆడపిల్లలు!
`నమ్మించారు…హోప్ లెస్ అని చేతులెత్తేశారు..!
హైదరాబాద్,నేటిధాత్రి:
సేవ రంగాలన్నీ వ్యాపారాలైపోతున్నాయి. ప్రైవేటు వ్యవస్ధలో వేళ్లూనుకుపోతున్నాయి. విచ్చలవిడి తనాన్ని సంతరించుకుంటున్నాయి. విద్య, వైద్యం ప్రైవేటు పరంలో లెక్కలేని తనాన్ని ప్రదర్శిస్తున్నాయి. అందులో ప్రాణాలు కాపాడాల్సి వైద్య వృత్తి సైతం వ్యాపారమై, ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నాయి. ప్రైవేటు వైద్యం అంటే ఒక నమ్మకం అనుకునే పరిస్ధితి నుంచి బతికితే మా పుణ్యం…లేకుంటే మీ ఖర్మం అన్నట్లు సాగుతోంది. తాజాగా హన్మకొండలో జరిగిన సంఘటనే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. వైద్యం కోసం వచ్చిన సామాన్యులను పీల్చి పిప్పి చేయడమే కాదు, ఠాగూర్ సినిమా వైద్యం కూడా అందిస్తూనే వున్నారు. చనిపోయిన వారికి సైతం వైద్యం చేసినట్లు నటిస్తూ లక్షలు వసూలు చేస్తున్నారు. మానవత్వాన్ని మంటగల్పుతున్నారు. మానవ సమాజంలో వైద్యులంటే దేవుళ్లతో సమానమన్న భావనను వాళ్లే విస్మరిస్తున్నారు. ఏదో ఒక ఆనారోగ్య సమస్యతో వచ్చిన వారికి వైద్యం ఎలా చేయాలన్నదానికన్నా, ఎంత ఖచ్చు చేయించొచ్చు అన్నదే ఎక్కువగా ఆలోచిస్తున్నారన్న మాటలు సర్యత్రా వినిపిస్తున్నాయి. ప్రజలు కూడా ఎంత ఖర్చైనా సరే అన్న ఒకే ఒక్క పదం పట్టుకుంటారు. ఎంత మేలైనవైద్యం చేస్తున్నారన్నది అసలే పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం ఏటా వందలాది కోట్ల రూపాయలు ఖచ్చు చేస్తూ, పేదల కోసం అనేక చర్యలు తీసుకుంటున్నా, ప్రజలు ప్రైవేటు వైద్యం వైపు మొగ్గు చూపడమే వారికి వరంగా మారింది. ఈ మధ్య కాలంలోనే వరంగల్లో వైద్యం వికటించి ఇద్దరు చనిపోయారు. కారణం ఆయా ఆసుపత్రుల్లో సరైన వైద్య సదుపాయాలు లేక…సరైన వైద్యులు పర్యవేక్షణ చేయక…! కాని పైన పటారం లోన లొటారం అన్నట్లు ఆకర్షణీయమైన బోర్డులు తగిలించి, హంగూ ఆర్భాటాలు ఏర్పాటు చేసి ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నారు. వైద్యం కోసం వస్తున్నవారి ప్రాణాలంటే లెక్కలేని వైద్యం చేస్తున్నారు. అదే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏదైనా చిన్న సంఘటన జరిగితే చాలు…మీడియా..ప్రజా సంఘాలు…రాజకీయ పార్టీలు వస్తాయి. జరిగిన ఘోరాన్ని బ్రేకింగ్ల పేరుతో వార్తలు వండి వారుస్తాయి. వారికి న్యాయం జరగాలని కొట్లాడతాయి. మరి అదే ప్రైవేటు ఆసుపత్రిలో జరిగే దారుణాలపై రాజకీయ పార్టీలు కనీసం స్పందించవు. పార్టీల పరంగా ఏదైనా సమస్యలో వెనకపడిపోతున్నామన్నప్పుడు మాత్రమే రాజకీయ పార్టీలు కదులుతుంటాయి.
తాజాగా ఈ మధ్య వరంగల్లోని ఓ ఆసుపత్రికి వైద్యం కోసం ఓ వ్యక్తి వచ్చాడు. పేరు పెద్దగా వుంది.
కొత్త ఆసుపత్రి. వైద్యం బాగా చేస్తారనుకున్నాడో ఏమో? కాని వచ్చాడు…ఇక్కడ ఇరుక్కుపోయాడు. సహజంగా ఏదైనా ఆపరేషన్ అంటే మొదటిసారే సక్సెస్కావాలి. అందులోనూ శరీర అంతరభాగాలలో జరిగే ఆపరేషన్లపై డాక్టర్లకుఎంతో అవగాహన వుండాలి. అనుభవం వుండాలి. పట్టుండాలి. అంతే గాని ఏ పేషెంటు వచ్చినా పట్టుకోవడం, ఇతర ఆసుపత్రుల్లోని వైద్యులను పిలించి వైద్యం చేయిచండం కూడా అలవాటు చేసుకున్నారు. ఆసుపత్రికి వచ్చిన వ్యక్తిని నమ్మించి బాగు చేస్తామని నమ్మించి, ఆపరేషన్ చేయాలని ఒప్పించారు. చేశారు. కాని అది వికటించింది. సస్సెస్ కాలేదు. ఆ వ్యక్తి మళ్లీ ఆసుపత్రికి వచ్చాడు. మళ్లీ ఆపరేషన్ చేశారు. అప్పుడైనా సస్సెస్ అయ్యిందా? అదీ లేదు. మళ్లీ ముచ్చటగా మూడోసారి ఆపరేషన్ చేశారు…అదే జరిగింది. ఆపరేషన్ మళ్లీ ఫెయిల్ అయింది. ఇక లాభం లేదనుకొని ఆ వ్యక్తికి ఈసారి హైదరాబాద్ వెళ్లి ఆపరేషన్ చేయించుకుంటానని అన్నాడు. కాని ఆ ఆసుపత్రి యాజమాన్యం ఈసారి ఖచ్చితంగా సక్సెస్ చేస్తామన్నారు. ఆ వ్యక్తి ప్రాణం పోవడానికి కారకులయ్యారు. ఇదేంటని మీడియా ప్రశ్నిస్తే ఆపరేషన్ చేసి డాక్టరు నీళ్లు నమిలాడు. ఒకసారికే విజయంతం కావాల్సిన ఆపరేషన్ నాలుగు సార్లు చేయడం తప్పే అని ఒప్పుకున్నాడు. ఇదిలా వుంటే ఆసుపత్రి యాజమాన్యం, ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకుల అండతో ముందు కాస్త భయపడ్డ ఆసుపత్రి యాజమాన్యం..ప్లేటు పిరాయించింది. ఆ వ్యక్తికుటుంబ సభ్యులు, సామాజికవేత్తలు, విద్యార్ధి సంఘాలు పెద్దఎత్తున ధర్నా చేయడంతో సదరు వ్యక్తికి కొంత ముట్ట జెప్పి,చేతులు దులుపుకున్నారు. ఇక్కడే అసలు నిజాలువెల్లడి కావాల్సివుంది….
సంఘటన జరిగిన ఆసుపత్రికి పోలీసులు వచ్చారు.
అందరితోనూ చర్చించారు. కాని కేసు నమోదు చేయలేదని సమాచారం. ఆసుపత్రి మీద చర్యలకు ఉప క్రమించలేదు. ఆసుపత్రి ముందు ఆందోళన చూశారు. పిర్యాధు చేస్తేనే వచ్చిన పోలీసులు, ఏ కేసు నమోదు చేయకుండానే వెళ్లిపోయారు. ఇక ప్రైవేటు ఆసుపత్రిలో జరిగిన సంఘటన తెలుసుకున్న ప్రభుత్వ జిల్లా ఉప వైద్యాధికారి కూడా వచ్చాడు. చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులతో ఎలాంటి రిపోర్టు తీసుకున్నాడో ఏమో! కాని అందరూ కలిసి ఆ కుటుంబం చేత లెటర్ రాయించుకున్నారు. చేతులు దులుపుకున్నారు. అసలు ప్రభుత్వ వైద్యాధికారి ఎవరిని కాపాడినట్లు? పోలీసులు వచ్చి ఏం చేసినట్లు? జరిగిన తంతును చూసేందుకు వచ్చారా? మృతుని కుటుంబ సభ్యుల వల్ల లాండ్ ప్రాబ్లం వస్తుందని వచ్చారా? లేక నష్టపోయిన కుటుంబానికి న్యాయం చేయడానికి వచ్చారా? అన్నది తెలియాల్సివుంది. వైద్యం కోసం వచ్చి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తికి ముగ్గురు కుమార్తెలు. వారి జీవితాలు ఆగం కాలేదా? వారి భవిష్యత్తు అంధకారం చేయలేదా? ఏంతొ కొంత ఇచ్చి చేతులు దులుపుకుంటే వారి జీవితాలు బాగుపడతాయా? కొండంత అండలాంటి తండ్రి లేకుండా చేసిన వారిపై చర్యలుండవా? రాజకీయ నాయకుల అండతో, అనుభవం లేని వైద్యులతో వైద్యం చేస్తూ, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆసుపత్రులపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి.
ప్రభుత్వాసుపత్రిలో ఎలుక కనిపించినా సంచలనమే…
ఆసుపత్రి ఆవరణలో ఏదైనా విషపురుగు సంచరించినా గందరగోళమే…కాని ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యులే ప్రజల ప్రాణాలు తీస్తుంటే మాత్రం పట్టించుకునేవారు లేరు. అదే ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం వికటిస్తే ఆ క్షణమే ఆ వైద్యుల మీద చర్యలు, బాదిత కుటుంబాలకు వెంటనే నష్టపరిహారాలు, ఉద్యోగాలు, ఆ కుటుంబానికి భరోసా కల్పిస్తారు. అలా వారికి న్యాయం జరగాలి. కాని ప్రైవేటు లో ఇలాంటి దారుణాలు జరిగితే అదే ప్రభుత్వ అధికారులు ఆసుపత్రులకు వంత పాడుతారు. ఆగమైనకుటుంబాలను గాలికి వదిలేస్తారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తారు… ప్రభుత్వం ఇప్పటికైనా ఇలాంటి ఆసుపత్రులపై దృష్టిపెట్టాలి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆసుపత్రుల లైసెన్సులు రద్దు చేయాలి.
వైద్యంకోసం వచ్చిన వ్యక్తికి వైద్యం చేయలేక, ప్రాణాలతో లేకుండా చేసిన ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాకం మీద సంచనల నిజాలు రేపటి నేటిధాత్రిలో…