పూటకోమాట…!

 

`మాయమాటలు…ఊసరవెల్లి రంగులు?

 `రెండు రోజుల్లో మూడు మాటలు!

`కోమటి రెడ్డి వెంకటరెడ్డికి కాంగ్రెస్‌ షోకాజ్‌ నోటీస్‌

`రాజకీయ దివాళా కోరుతనం అంటున్న జనం…

`ఇంత దగాకోరు మాటలు గతంలో ఎవరూ మాట్లాడలేదంటున్న కాంగ్రెస్‌ శ్రేణులు….

`నేనే పిసిసి అంటాడు….ఈసారికి తమ్ముడిని గెలిపించాలంటాడు…

`కాంగ్రెస్‌ గెలిచేది లేదంటున్నాడు!

`నన్ను నమ్మనప్పుడు పార్టీలో ఎందుకుంచుకుంటున్నారంటాడు…!

`రాజకీయాలనుండి తప్పుకుంటానంటాడు….

`నేనిక్కడే వున్నా నేనెక్కడికి పోలేదన్నాడు…

`రెండు రోజులకు ఆస్ట్రేలియాలో ప్రత్యక్షం…

`ఇన్ని జిత్తుల మారి వేషాలా?

`ప్రజా ప్రతినిధిగా ఇన్ని అబద్దాల?

`ఎన్నికలలో గెలవడానికి నమ్మి నెత్తిన పెట్టుకున్న పార్టీకే వెన్నుపోటా!

`తమ్ముడు కాంట్రాక్టు కోసం…

`అన్న ,తమ్ముడి రాజకీయం కోసం…

`ఓట్లేసిన జనాన్ని వెర్రివెంగలప్పలను చేద్దాం!

`మంటెక్కి వున్న కాంగ్రెస్‌ నేతలు!

`గతంలో డిల్లీలో వుండి సోనియా గాంధీ చేసిన ధర్నాలో పాల్గొనలేదు..!

`రాహుల్‌ గాంధీ జోడో యాత్రకు డుమ్మా కొట్టాడు…!

`నమ్మి మునుగోడు చేతిలో పెడితే నిండా ముంచిన అన్నాదమ్ములు!

హైదరాబాద్‌,నేటిధాత్రి:

 నేను నిజాయితీ పరుడిని…నేను ప్రజల కోసం త్యాగం చేసే నాయకుడిని…ప్రజల ప్రతినిధిని…పేదోళ్లకు అండగా వుండే నాయకుణ్ణి…అని చెప్పుకునే గొప్పలన్నీ ఉత్తవే అని, నమ్మించి మోసం చేయడానికే అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిరూపించుకుంటున్నాడు. ఇంత కాలం ఆయన మాటలు నమ్మిన వారు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఒక నాయకుడు తన స్వార్ధం కోసం కూడా ఇంత కాలం నమ్మించగలడా? ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తన కోసం పనిచేస్తూ, తన ఎదుగుదలకు పార్టీని వాడుకుంటూ, ఇంకా ఆ పార్టీలోనే వుంటూ, ఇంత కాలం పదవులు అనుభవిస్తూ, పార్టీకే గోతులు తవ్వుతూ తమ బ్రాండ్‌ అసలు నిజస్వరూపం ఇప్పుడు చూపిస్తున్నాడు. నిజానికి కాంగ్రెస్‌ పార్టీలో వుండడం వెంకటరెడ్డికి కూడా ఇష్టం లేదు. కాకపోతే ఇప్పటికిప్పుడు తన పదవికి రాజీనామా చేసే ధైర్యం లేదు. తమ్ముడి కోసం త్యాగం చేయాలని వున్నా, అదును కోసం ఎదురుచూస్తున్నాడు. ఒక వేళ రాజగోపాల్‌రెడ్డి మునుగోడులో గెలిస్తే, జంప్‌ అయ్యేందుకు సిద్దంగానే వున్నాడు..లేకుంటే కాంగ్రెస్‌లోనే కొనసాగాలన్న అంతర్మధనంలో వున్నాడు. తనంటత తాను వెళ్లిపోవాలని వున్నా, భవిష్యత్తులో ప్రజలు నమ్మరన్న భయం కూడా ఆయనను వెంటాడుతోంది. అందుకు పార్టీకి నష్టం చేకూర్చే మాటలు మాట్లాడుతూ, తనను బైటకు సాగనంపితే వెళ్ధామని చూస్తున్నాడు…స్వయంగా ఆయనే నన్ను భరించమని ఎవరంటున్నారు… నా ప్రవర్తన నచ్చపోతే పంపించండని పార్టీకి సవాలు విసిరే మాటలు కూడా మాట్లాడాడు. అంటే తనను కాంగ్రెస్‌ పార్టీ బైటకు పంపిస్తే దాన్ని కూడా సానుభూతికింద వినియోగించుకుందామని చూస్తున్నాడు. కాని ప్రజలు అంత అమాయకులా? 

 గతంలో ఎన్నడూ వెంకటరెడ్డి వంటి నాయకులను చూడలేదన్నది రాజకీయాలు తెలిసిన వారు అంటున్న మాట.

 ఎందుకంటే సుదీర్ఘ రాజకీయ అనుబంధం వున్న పార్టీని ఇంత కాలం తన స్వలాభం కోసమే వెంకటరెడ్డి వినియోగించుకున్నాడన్నది నిజం. ఆయన అసలు స్వరూపం తెలిసిపోయింది. ఆయన నిజ స్వరూపం చూపించుకున్నాడు. అంతటి సీనియర్‌ నాయకుడు పూటకో మాట…గంటకో తిరకాసు రాజకీయం చేయడం అన్నది ఎక్కడా చూడలేదు… రెండు రోజుల్లో మూడు రకాలైన మాటలు మాట్లాడి, తనకు నాలుక మడతెట్టడం చాలా సులువు అని నిరూపించుకున్నాడు. జనం వెర్రి వెంగలప్పలని చెప్పకనే చెబుతున్నాడు. రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా చేసిన నాటి నుంచి చూస్తుంటే కూడా వెంకటరెడ్డి మాట్లాడే మాటలు వెగటుపుట్టిస్తున్నాయి. చండూరు సభలో అద్దంకి దయాకర్‌ మాటలు తనను గాయపర్చాయని చెప్పి కొంత కాలం సాగదీశాడు…తాను ఎంతో మనస్తాపానికి గురయ్యానని చెప్పుకొచ్చాడు. తనకు క్షమాపణచెప్పాలన్నాడు. అద్దంకిని పార్టీనుంచి పంపించేయాలన్నాడు. తర్వాత ఏదో సందర్భంలో రేవంత్‌ రెడ్డి ఐపిఎస్‌, హోంగార్డుల మాటలు పట్టుకొని దాన్ని పెద్ద రాద్దాంతం చేశాడు…అలా కొంత కాలం గడిపాడు…ఆఖరుకు అద్దంకి దయాకర్‌తోపాటు, రేవంత్‌రెడ్డి కూడా క్షమాపణలు చెప్పారు…అబ్బే…నా మనసు కరగలేదన్నాడు. రేవంత్‌రెడ్డి క్షమాపణ చెబితే మునుగోడు ప్రచారం గురించి ఆలోచిస్తానన్నాడు. తీరా రేవంత్‌ క్షమాపణ చెప్పాక తూచ్‌ అన్నాడు. నాకు మనస్తాపం ఇంకా తగ్గలేదన్నాడు. సీనియర్లందరి చేత పట్టుబట్టించి పాల్వాయి స్రవంతికి టిక్కెట్టు వచ్చేలా రాజకీయం చేశాడు… రేవంత్‌ను అలా దెబ్బకొట్టాడు…గాంధీ భవన్‌లో పాల్వాయి స్రవంతిని దీవించి, మళ్లీ తూచ్‌ అన్నాడు…తమ్ముడి కోసం సెల్‌ఫోన్‌ ప్రచారం మొదలు పెట్టాడు…అదేంటని మీడియా ప్రశ్నిస్తే ఆ ఆడియా ఇప్పటిది కాదని తప్పించుకునే ప్రయత్నం చేశాడు… పార్టీ మీ మీద గుర్రుగా వుందని మీడియా ప్రశ్నిస్తే ఎందుకు ఎవరు భరించమంటున్నారంటూ పార్టీని ప్రశ్నించాడు…ఆఖరుకు ఆస్ట్రేలియా వెళ్లి, నాకు రాజకీయాలంటేనే ఇష్టం లేదన్నాడు. ఇంకా ఎంత కాలం రాజకీయాలు చేస్తానన్నాడు. మునుగోడు ఫలితం వచ్చే దాకా వెంకటరెడ్డి ఇండియాకు రాకపోవచ్చు…వచ్చి అప్పుడేం చెబుతాన్నది ఆసక్తి కరంగా మారింది. 

గత మూడు నాలుగు నెలల కాలం నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక్కమాట మీద నిలబడే నాయకుడు కాదని తనకు తానే నిరూపించుకుంటూ వస్తున్నాడు.

 పదే పదే అబద్దాలు చెబుతూ వస్తున్నాడు. అందర్నీ నమ్మిస్తూనే , పార్టీని నిండా ముంచుతున్నాడు. పార్టీకి తీరని ద్రోహం చేస్తున్నాడు. తన తమ్ముడికోసం పార్టీని శ్రేణులను అమోయయానికి గురిచేస్తున్నాడు. పార్టీ శ్రేణులకు ఆశ చూపించి ఓట్లేయించుకునేందుకు విదేశాలనుంచి స్కెచ్‌ వేస్తున్నాడు. ఇన్ని మాటలు మాట్లాడుతున్న వెంకటరెడ్డి వ్యవహార శైలితో విసిగిపోయిన కాంగ్రెస్‌ ఫార్టీ షోకాజ్‌ నోటీస్‌ ఇచ్చింది. అందుకు పది రోజుల గడువు పెట్టింది. ఈ లోపు పుణ్య కాలం వెళ్లిపోతుంది. మునుగోడు ఉప ఎన్నిక ఫలితం కూడా తేలిపోతుంది. అప్పుడు మళ్లీ వెంకటరెడ్డి ఏ రాగం అందుకుంటాడో అని అంటున్నారు. ఇంత దగా కోరు మాటలు గతంలో ఏ నాయకుడు మాట్లాడలేదని కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులే అంటున్నాయి. ఈ మధ్య తనకు తెలసిన కాంగ్రెస్‌ నాయకులకు ఫోన్‌ చేసి, ఈ ఒక్కసారి రాజగోపాల్‌రెడ్డికి ఓటు వేయమని అడిగాడు. మంచికీ, చెడుకు పనికొచ్చేది మేమే అంటూ చెప్పాడు. అదేంటని మీడియా, పార్టీ ప్రశ్నిస్తే అది ఇప్పటిదికాదని తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కాని ఎవరూ నమ్మలేదు. అది ఈ మధ్య మాట్లాడిన మాటలే అని తేటతెల్లమయ్యాయి. అంతే కాదు ఫోన్‌లోనే తానే పిసిసి ప్రెసిడెంటునౌతానని చెప్పాడు. ఇలా రెండు నాలుకల మాటలు అనడం కన్నా, ఊసరవెళ్లి రంగులు అని చెప్పడం కరక్టుగా వుంటుందని రాజకీయ పార్టీలంటున్నాయి. 

   నిజానికి వెంకటరెడ్డి కాంగ్రెస్‌కు ఎప్పటినుంచో దూరంగా వుంటున్నాడు.

 ఎందుకంటే పిపిసి అధ్యక్షుడిని నేనే అని కలలు గన్న వెంకటరెడ్డికి అధిష్టానం షాక్‌ ఇచ్చింది. రేవంత్‌ను పిసిసి చేసింది. దాంతో అప్పటినుంచి అక్కసు మొదలై, పార్టీకి దూరమయ్యేందుకే చూస్తున్నాడు. రేవంత్‌రెడ్డి రూ.50 కోట్లుపెట్టి పిసిపి కొనుక్కున్నాడని అన్నాడు. ఇక గాంధీభవన్‌ మెట్లు ఎక్కనన్నాడు. కాని ఏ మాట మీద ఆయన నిలబడలేదు. రేవంత్‌తో కలసి ముచ్చట్లు బాగానే వుంటాయి…తర్వాత పక్కకు జరగ్గానే విమర్శలు అంతే విధంగా వుంటాయి. ఆ మధ్య సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీపై ఈడీ విచారణ జరిగింది. ఆ సమయంలో సోనియాగాంధీ ప్రభుత్వం తీరును నిరసిస్తూ ర్యాలీ జరిపారు. అలాగే అన్ని రాష్ట్రాల్లోనూ ఏక కాలంలో కాంగ్రెస్‌ పార్టీ ర్యాలీలు జరిగాయి. అదే సమయంలో వెంకటరెడ్డి పార్లమెంటులో వున్నాడు. తమ్ముడు రాజగోపాల్‌రెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో మంతనాలు జరిపారు. ఇక తాజాగా రాష్ట్రంలో రాహుల్‌గాంధీ జోడో యాత్ర జరుగుతోంది. కాని వెంకటరెడ్డి ఆస్ట్రేలియాలో వున్నాడు. ఇంతకన్నా నయ వంచన ఏదైనా వుంటుందా? పార్టీ ఎంపిగా వుంటూ, పార్టీ కార్యక్రమాలలో పాల్గొనకుండా, కోవర్టు రాజకీయాలు చేయడాన్ని ఎవరూ స్వాగతించడం లేదు. పార్టీ నమ్మి మునుగోడు చేతిలో పెడితే తమ్ముడు నిండా ముంచి పోయాడు…నల్లగొండ రాజకీయాలు అన్న వెంకటరెడ్డి చేతిలో పెడితే పార్టీనే నామరూపాలు లేకుండా చేస్తున్నాడు…! నైతికతకు అర్ధాలు మార్చుతున్నాడు…నమ్మక ద్రోహానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నాడని కాంగ్రెస్‌ శ్రేణులు మండిపడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!