పెంచిన ఇంజనీరింగ్ ఫీజులను తగ్గించాలి

జేరిపోతుల జనార్దన్,ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,తెలంగాణ

సిద్దిపేట జిల్లా: నేటి ధాత్రి
రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఇతర వృతివిద్యా కోర్సుల ఫీజులను వెంటనే తగ్గించాలని, ఫీజులు పెంచుతున్నట్టు ఇచ్చిన జీవోను వెనక్కు తీసుకోవాలని అదే విధంగా ఈ మధ్య జరిగిన గ్రూప్-1 పరీక్షలలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి బాధ్యులపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్ఎఫ్)రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జేరిపోతుల జనార్దన్ అన్నారు.. శుక్రవారం నాడు సిద్దిపేట లోని స్థానిక ఎడ్ల గురువారెడ్డి భవన్ లో ఆయన మాట్లాడారు..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బీటెక్, ఎంటెక్, ఎంబీఏ ఫీజులను గత ఫీజుల కంటే భారీగా పెంచి విద్యార్థులపై మోయలేని భారం మోపిందని విమర్శించారు.. కరోనా తరువాత ఇప్పుడు ఫీజులు పెంచడంతో తమ పిల్లలను ఉన్నత విద్యను అందించలేమని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని అన్నారు..ఈ నేపథ్యంలో ప్రభుత్వం పెంచిన ఫీజుల జీవోలను వెనక్కి తీసుకోవాలన్నారు..ఫీజుల పెంపు ప్రయివేటు కాలేజీలకు కొమ్ముకాసే విధంగా ఉందని మండి పడ్డారు.. రాష్ట్రంలోని 159 ఇంజనీరింగ్ కాలేజీల్లో టిఏఎఫ్ఆర్ సి సిఫారసులతో ప్రభుత్వం ఫీజులు పెంచడం సరికాదన్నారు.. కనీస ఫీజులను సైతం 35 వేల నుండి 45 వేల రూపాయలకు పెంచారని,పెంచిన ఫీజులతో రాష్ట్రంలోని 40 కాలేజీల్లో లక్ష దాటిందని ఆందోళన వ్యక్తం చేశారు.. ఫీజులను పెంచడం ఠీ పేద, మధ్య తరగతి విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యకు దూరం అవుతారని, వెంటనే జీవోలను వెనక్కు తీసుకోవాలన్నారు..
అదే విధంగా ఈ నెల 16 వ తేదీన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలో అవకతవకలు జరిగాయని, రాష్ట్ర వ్యాప్తంగా నిబంధనల ప్రకారం ఉదయం10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించగా హైదరాబాద్ లలాపేట్ శాంతినగర్ లోని సెయింట్ ప్రాన్సిస్ డి సెల్ఫ్ హైస్కూల్ పరీక్ష కేంద్రంలో మాత్రం మధ్యాహ్నం1 గంట నుంచి 3.30 నిర్వహించారని,ఉదయం నిర్వహించాల్సిన పరీక్ష మధ్యాహ్నం నిర్వహించడం ఏంటని వారు ప్రశ్నించారు.. నిబంధనలకు విరుద్ధంగా పరీక్ష నిర్వహించిన ఆయా సెంటర్ లపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు..టిఎస్పీఎస్సీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇలాంటి అవకతవకలు జరిగాయని వారు ఆరోపించారు.. వేలాదిమంది అభ్యర్థుల భవిష్యత్తు పై ఆధారపడిన గ్రూప్-1 పరీక్ష నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరుపై ఉన్నతస్థాయి సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు..
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులు సంగెం మధు,జిల్లా అధ్యక్షులు చిట్యాల శేఖర్ లు ఉన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *