ధర్మసాగర్, నేటిధాత్రి:-
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు పంట నష్టాన్ని వెంటనే ప్రకటించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు బండి పర్వతాలు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం బొల్లం సాంబరాజు అధ్యక్షతన శనివారం జరిగగా ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని ప్రసంగించారు. మండల వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారని వందలాది ఎకరాలు వరి పంట, పత్తి పంట, ఇతర పంటలు దెబ్బతిన్నాయని తీవ్రమైన నష్టం రైతులకు వాటిల్లిందని వెంటనే ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ అధికారులతో సర్వే నిర్వహించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. రైతులు పంటలను మార్పిడి చేయడం జరుగుతుండడంతో కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని లేకుంటే భారీ వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందన్నారు. అనంతరం బొల్లం సాంబరాజు మాట్లాడుతూ మండల కేంద్రంలో నిర్వహించబోయే తెలంగాణ రైతు సంఘం మహాసభలను జయప్రదం చేయాలని ఈ మహాసభకు జిల్లా , రాష్ట్ర నాయకులు హాజరవుతున్న నేపథ్యంలో మండలం నుంచి రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిలుక రాఘవులు, లడ్డునూరి సతీష్, సాంబశివుడు, వెంకటయ్య, రాజు పర్శరాములు, సంపత్, తదితరులు పాల్గొన్నారు.