Headlines

మునుగోడులో బిజేపికి ముచ్చెమటలే..నా!?

`మూడో ఉప ఎన్నికలో గెలవాలనే ముచ్చట తీరనిదేనా!?

`రాజగోపాల్‌ రెడ్డి మాట విని బిజేపి పెద్దలు తొందరపడ్డారా?

`చేజేతులా తెలంగాణలో పెరిగిన ఆ కాస్త స్పేస్‌ చెరిపేసుకున్నారా?

`గుట్టుగా వున్న నమ్మకం వమ్ము చేసుకుంటున్నారా?

`అసలు వేడిలో ప్రజల నాడి తెలుసుకొని తలలు పట్టుకుంటున్నారా?

`ప్రచారంలో జనం మాటలు విని బిజేపి నేతలు మోసపోయారా?

`రాష్ట్ర నాయకుల మధ్య సఖ్యత లేమి స్పష్టంగా కనిపిస్తోందా?

`దుబ్బాక వేరు, హుజూరాబాద్‌ ఉప ఎన్నిక వేరన్నది తెలిసొస్తోందా?

`బ్రాండ్‌ అని చెప్పి రాజగోపాల్‌ రెడ్డి ముగ్గులో పడి బిజేపి గిలగిలలాడుతోందా?

`రాజగోపాల్‌ రెడ్డి గెలుపు కష్టమని తెలిసి, బెంబేలెత్తుతోందా?

`టిఆర్‌ఎస్‌ కు కనబడుతున్న ఆదరణ బిజేపి కేంద్ర పెద్దలకు చేరిందా?

`మునుగోడులో పెద్దమనుషుల మాటలు విని బిజేపికి తోచడం లేదా?

`జనం మాట…ప్రచార బాట.

`ఎక్కుడ వింటున్నా గులాబీ పాటే…కారుకు గెలుపు పరిపాటేనా! 

హైదరాబాద్‌,నేటిధాత్రి:

పలకరించిన వాళ్లంతా పక్కింటి వాళ్లు కాదు…ఎదురొచ్చినవాళ్లంతా ఎదిరింటివాళ్లు కాదు..కనిపించినోళ్లంతా కావాల్సిన వాళ్లు కాదు…రాజగోపాల్‌ రెడ్డి ప్రచారానికి వచ్చిన వాళ్లంతా పొద్దుగూకితే చెప్పే సుద్దులు వేరని మునుగోడులో జనం చెప్పుకుంటున్న మాటలు…ఇవన్నీ బిజేపి తెలుసుకోవాలి. ఇన్ని రకాల మాటలు చెప్పి మాయ చేసిన రాజగోపాల్‌ రాజకీయం పార్టీ పెద్దలు అర్దం చేసుకోవాలి. ఈ మాటలంటున్నది ఎవరో కాదు బిజేపి నాయకులే…? రాజగోపాల్‌రెడ్డిని రాజకీయంగా పెంచి పెద్ద పెద్ద చేసి, పదవులిచ్చి పోషించి, గుర్తింపునిచ్చి, ప్రతి ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీ. ఇల్లిల్లూ తిరిగి ఓట్లేయించింది కాంగ్రెస్‌ ఫార్టీ. మునుగోడు నాదే..మునుగోడులోనే వుంటా…చచ్చినా బతికినా, మునుగోడులోనే అని రాజగోపాల్‌రెడ్డి నమ్మించి, జనాన్ని ముంచాడు…పార్టీకి టోకరా ఇచ్చాడు… ఓట్లేసినందుకు జనాన్ని వెర్రివెంగలప్పలను చేశాడు.కాంగ్రెస్‌పై పార్టీపై నిందలేస్తున్నాడు. భవిష్యత్తు కాంగ్రెస్‌కు లేదంటున్నాడు. రాజీనామా చేసి కాషాయతీర్ధం పుచ్చుకున్నాడు. పూటకో మాట చెబుతున్నాడు. అవకాశవాదిగా ఎప్పుడో ఒకనాడు బిజేపికి జెల్లకొట్టడన్న నమ్మకమేముందున్న మాటనే బిజేపి నాయకులు మాట్లాడుతున్నారు. మునుగోడులో బిజేపి అన్న పదమే వినిపించని నాటి నుంచి నేటిదాకా పార్టీకోసం పనిచేసిన వారిని కాదని, రాజగోపాల్‌రెడ్డికి టిక్కెట్టు ఇవ్వడమే ఆ పార్టీ నేతలకు నచ్చడం లేదట!పైగా ఇప్పుడు మొదటినుంచి బిజేపిని నమ్ముకొని రాజకీయం చేసి, ఆ పార్టీ కోసం పనిచేసిన నాయకులను రాజగోపాల్‌రెడ్డి పట్టించుకోవడం లేదట…తన వెంట కాంగ్రెస్‌నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యతనిస్తున్నారని బిజేపి నాయకులే అంటున్నారు. ఇదిలా వుంటే రాజగోపాల్‌రెడ్డి మాటలు నమ్మి మోసపోయే ప్రమాదం వుందా? అన్న మాటలు కూడా బిజేపి పెద్దలు మాట్లాడుకుంటున్నట్లు తెలుస్తోంది. మునుగోడు వ్యవహారంలో జరుగుతున్న ప్రచారం, రాజకీయం అంతా చూస్తున్న బిజేపి పెద్దలు ప్రజలు రాజగోపాల్‌పై పెద్దఎత్తున వ్యతిరేకత కనిపిస్తున్నట్లు తెలిసి మండిపడుతున్నారని చెప్పుకుంటున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌ అనేది బ్రాండ్‌ అంటూ రాజగోపాల్‌రెడ్డి చెప్పిన మాటలు, చేసిన ప్రచారం నమ్మి, ఉప ఎన్నికలు తెచ్చి కోరికోరినష్టాని మూటగట్టుకుంటామా? అన్న ఆందోళనలో బిజేపి పెద్దలున్నట్లు తెలుస్తోంది. రాజగోపాల్‌రెడ్డి చెప్పినంత బలం గ్రౌండ్‌లో లేదని, క్షేత్రస్దాయిలో ఆయన అనుచరులు తప్ప, ప్రజలు ఆయన వైపు లేరన్న విషయం స్పష్టమౌతోందంటున్నారు.

 

అందుకే రాష్ట్ర నాయకులు కూడా ఈ విషయం చెప్పకుండా దాచి, పార్టీని మోసం చేస్తున్నారా? అని కేంద్ర పెద్దలు రాష్ట్ర బిజేపి నాయకులపై గుర్రుగా వున్నట్లు చెప్పుకుంటున్నారు. హుజూరాబాద్‌కు మునుగోడుకు పోలికే లేదు…ఉప ఎన్నికలను ఓసారి బాగా పరిశీలిస్తే రెండు ఉప ఎన్నికలు మాత్రం ప్రత్యేకం… అవి బిజేపి ఖాతాలో వేసుకోవాల్సినవి కాదు…బిజేపి బలంతో గెలిచినవి కాదు… అవి వారి వారి వ్యక్తిగత సానుభూతి తప్ప, బిజేపిని చూసి జనం ఓట్లేయలేదు. ఓ వైపు పెరుగుతున్న ధరలు…నానాటికీ దిగజారుగుతున్న ఆర్ధిక వ్యవస్ధ, ఉపాధి లేక యువత పడుతున్న ఇబ్బందులు, నిత్యం పెరిగే డీసెల్‌, పెట్రోల్‌ ధరలు, మూడిరతలు పెరిగిన గ్యాస్‌ ధరతోపాటు, ఏడాదికి మూడు సిలిండర్లు చాలవా? కేంద్ర పెద్దలు చెప్పే మాటలపై ప్రజలు ఆగ్రహంతో వున్నారు. దుబ్బాక, హుజూరాబాద్‌లో గెలుపులు చూసుకొని, పార్టీ బలమనుకుంటే పొరపాటు అని బిజేపి శ్రేణులే చెబుతున్నాయి. తెలంగాణ ఉద్యమ కారుడిగా ప్రజలకు పరిచయం వున్న రఘనందన్‌ రావు పలు మార్లు పోటీ చేసి, ఓడిపోవడంతో, ఈసారైనా గెలిపించండి అంటూ ఆయన వేడుకోవడంతో దుబ్బాక ప్రజలు గెలిపించారు. అంతే తప్ప దుబ్బాకలో రఘనందన్‌ గెలుపు బిజేపిది కాదు. ఇక హుజూరాబాద్‌లో ఈటెల రాజేందర్‌ గెలుపు అన్నది పూర్తిగా ఆయన వ్యక్తిగత విజయమే… అంతే కాదు ఎన్నికల సమయంలో ఆయన జై మోడీ అన్నది లేదు…జై బిజేపి అని చెప్పుకున్నదిలేదు. ఎక్కడికెళ్లినా ఒంటరి ప్రచారం తప్ప, బిజేపి నేతలను వెంటబెట్టుకుపోయింది లేదు. ఆయన ప్రచారమంతా ఒక్కడే చేసుకున్నాడు. తన విజయం తన ఖాతాలోనే వేసుకున్నాడు. కాని బిజేపి తన గెలపని ప్రచారం చేసుకుంటుంటే ఈటెల అనుచరులే నవ్వుకుంటున్నారు. ఇలాంటి పరిస్ధితులను చూసి, ఇక బిజేపిలో చేరితే చాలని, కాంట్రాక్టులు సొంతమౌతాయని ఆశించి రాజగోపాల్‌రెడ్డి బిజేపిలో చేరిండన్నది ముమ్మాటికీ నిజమన్నది మునుగోడు ప్రజలే చెప్పుకుంటున్న మాట…ఒక్కసారి రాజగోపాల్‌రెడ్డి గతంలో చెప్పిన మాటలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.

ఆయా సందర్బాలలో రాజగోపాల్‌రెడ్డి ఇచ్చిన ఇంటర్వూలలో మాటలను జత చేసి, తెరాస చేస్తున్న ప్రచారానికి ప్రజలనుంచి విపరీతమైన స్పందన కూడా వస్తోంది. వాటిని గురించి ఓసారి పరిశీలిస్తే తమది చిన్న వ్యాపారం అన్నాడు. అప్పులు చేసి, వ్యాపారాలు చేస్తామన్నాడు రాజగోపాల్‌రెడ్డి. అంతే కాదు ఇరవై కోట్లకు ఎన్ని సున్నాలుంటాయో కూడా తనకు తెలియదన్నాడు. ఇప్పుడు 18వేల కోట్ల ప్రాజెక్టు దక్కించుకున్నాడు. తామకున్న సంపాదనకు, ఆస్ధికి కారులో కాదు , హెలీకాప్టర్‌లో తిరగాలంటున్నాడు. కోటికి ఎన్ని సున్నాలుంటాయో తెలియదన్నాడు… ఏడు కోట్లు పెట్టికారు ఎలా కొన్నారంటే తనది కాదు…తన కొడుకుదన్నాడు. ఇప్పుడు చిన్న వ్యాపారులం కాదంటున్నాడు. మునుగోడు ప్రజల కోసమే రాజీనామా చేశానని గతంలో అన్నాడు. ఇప్పుడు 18వేల కోట్ల ప్రాజెక్టు ఇచ్చిన పార్టీకి రుణం తీర్చుకుంటున్నాడు. ఇలా పూటకో మాట చెప్పి రాజకీయం చేస్తున్న రాజగోపాల్‌రెడ్డిని నమ్మమని ప్రజలే చెబుతున్నారు. మునుగోడులో పెద్ద వయసున్న వాళ్లు చెబుతున్న మాటలు ఎంతో ఆసక్తిగా వుంటున్నాయి.ఎందుకంటే వాళ్లు తెలంగాణలో గోస చూశారు…నీటి గోసలు ఎదుర్కొన్నారు..కరంటులేని బతుకులు చూశారు…సాగుకు నీరందని రోజులు చూశారు… ఏటా ఎండిపోయిన పంటలు చూశారు…చిమ్మచీకట్లు చూశారు…కరంటు లేక చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోలేకపోయారు…రూపాయి సంపాదన లేక కూలీలై బతికిన రోజులు చూశారు…ఫ్లోరైడ్‌ మూలంగా ఎదురైన అనార్యోగాలు చూశారు… అన్ని చూసిన కళ్లతో నేడు కళకళలాడుతున్న పల్లెలు చూస్తున్నారు. వెలుగుతున్న చిన్న చిన్న పట్టణాలు చూస్తున్నారు. ఇరవై నాలుగుగంటల కరంటు చూస్తున్నారు…ఏటా పండుతున్నపంటలు చూస్తున్నారు… కరువులు లేని కాలం చూస్తున్నారు…ఇంటింటికీ మంచినీరు చూస్తున్నారు. తమ పిల్లలు చూసుకోకున్నా, తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ఆసరా ఫించన్లతో జీవనం సాగిస్తున్నారు. కేసిఆర్‌ను పెద్ద కొడుకొని మురిసిపోతున్నారు…గత ఎన్నికల ముందు తెలంగాణలో కంటి పరీక్షలు చేసి, చూపు చెప్పించిన దేవుడని పెద్ద మనుషులు కొలుస్తున్నారు…ఎన్నికల సమయంలో టిఆర్‌ఎస్‌ను దీవిస్తున్నారు. ఇదీ ఇప్పుడు మునుగోడులో కనిపిస్తున్న దృష్యం… మునుగోడులో టిఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో సాగుతున్న ప్రచారంలో వింతలు చోటు చేసుకుంటున్నాయి. విశేషాలు కనిపిస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే టిఆర్‌ఎస్‌నాయకులకు ఊపునిస్తున్నాయి. గురువారం మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆసక్తికరమైన సంఘటనను ఎదుర్కొన్నారు. ఆ నియోజకవర్గానికి చెందిన ఓ ఓటరు ఆయన వద్దకు వచ్చి ప్రజలు ఆలోచనల తీరును ఆవిష్కరించారు. టిఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమని చెప్పారు. తన బంధువుల చెందిన వివిధ గ్రామాల్లోనూ అదే పరిస్ధితి వుందన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ పాలనపై ప్రజలు సంతోషంగా వున్నారని ఆ పెద్ద మనిషి చెప్పడంతో టిఆర్‌ఎస్‌ శ్రేణుల్లో మరింత ఉత్సాహం కనిపించింది. అంతేకాదు అభివృద్ధి చేసిన కేసిఆర్‌ వైపే ప్రజలు నిలబడతారని, ప్రతిపక్షాలు చేసే అసత్య ప్రచారాలు ఎవరూ నమ్మరని ఆ పెద్దాయన చెప్పడం కొసమెరుపు. ఇక మరో మహిళ చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్‌ మీడియాలో సర్కిళ్లలో పెద్ద ఎత్తున వైరల్‌ అవుతున్నాయి. తనకు కళ్లు బాగు కావడానికి కారణం కేసిఆర్‌ అంటూ, తన మద్దతు టిఆర్‌ఎస్‌కే అంటూ చెప్పడం గమనార్హం. ఇలా నిత్యం ప్రచారంలో అనేక పదనిసలు కనిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!