బండకేసి కొట్టాల్సిందే!

అధిష్టానం ఆదేశాలను అపహస్యం చేసేలా సీనియర్ల తీరు

` ప్రజల్లోకి వెళుతున్న క్రమంలో మెకాలడ్డే ప్రయత్నం

` హైకమాండ్‌ నిర్ణయాన్ని గౌరవిస్తామంటూనే హద్దుమీరుతున్న వైనం

` పీసీసీ అంటే లెక్కలేని తనం మనుగడకు మంచిదేనా..?

` రేవంత్‌కు అండగా సెకెండ్‌ కేడర్‌

` పనిగట్టుకుని పార్టీని పంగనామాలు పెట్టే ప్రయత్నాలు

` పీసీసీ చీఫ్‌ బండాకు కొడాతనంటూ ప్రకటనతో ఒక్కసారిగా సీనియర్లలో మార్పు

` సంచలన ప్రకటనంటూ సల్లబడ్డ జగ్గారెడ్డి

` మెలికపెట్టబోయి మెత్తబడ్డ వీహెచ్‌

`పార్టీకి కట్టుబడి పనిచేయకపోతే అన్నంత పని చేయాల్సిందేనంటున్న క్యాడర్‌ 

` వివాదాలకు తెరతీయాలనుకున్న ఫలించని విష్ణు విందు రాజకీయం 

` సీనియర్లదంతా ఒంటెద్దు పోకడ ఒదులుకుంటేనే పార్టీ మనుగడ 

`చేరికలతో పార్టీలో కొత్త ఉత్సాహం

 హైదరాబాద్‌,నేటిధాత్రి: 

కాంగ్రెస్‌ పార్టీలో ఎవరికి వారే…యమునా తీరే…ఎవరు ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియదు…ఎవరు ఎటు వైపు నిలుస్తున్నారో తెలుసుకోరు…ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారో వారికే తెలియదు…ఎవరితో కలిసి సాగుతారో…ఎప్పుడూ రాం రాం అనుకుంటారో తెలియదు… గ్రూపులకు కొదవలేదు..ఆ కొట్లాటలకు లెక్కలేదు…యువకులు అంతే…సీనియర్లు అంతే..కొత్తగా చేరిన వారంతే…పోయిన వారు వస్తారంటుంటే వద్దంటున్న వారంతే…రమ్మని కోరుతున్నవారు అంతే…ఎవరికి ఎవరూ తగ్గరు..ఎక్కడా తగ్గరు…ఎవరికీ తలవంచరు…అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు…వారికి ఇష్టమైనట్లు వ్యహరిస్తుంటారు..విందు రాజకీయాలు చేస్తారు…గ్రూపు రాజకీయాలు ప్రోత్సహిస్తుంటారు…గోడమీద నిలబడ్డట్టే వుండారు..వెళ్లలేరు…వుండలేదు…ఎవరికీ ఏమీ కారు…మాకు మేమే…మాకంటే తోపులేరక్కడంతే..అనుకుంటూ వాళ్లను వాళ్లు సముదాయించుకుంటుంటారు…కుంపట్లు రాజేస్తుంటారు…..పక్కవారికి అభద్రతకు గురిచేస్తుంటారు…ఇదంతా కాంగ్రెస్‌ రాజకీయం…అతి ప్రయత్నం…అసలు ప్రభావం…శూన్యవాదం… రిక్తహస్తం…ఆఖరుకు అయ్యో చేజారిపోయేనే…అంటూ ధీర్ఘాలు…ఎత్తిపొడుపులు…వెక్కిరింతలు…ముందు అంతే…తర్వాత అంతే….ఎన్నికల ముందు కలిసి వుండరు…ఎన్నికల తర్వాత కలిసి వుండరు…ఎప్పుడూ కలిసి వుండాలన్న ఆలోచన చేయరు…అందుకే వాళ్లంతా ఒక్కటే అయితే కాంగ్రెస్‌ నేతలెందుకౌతారని సామెత…ఒకరి నొకరు కాళ్లు పట్టుకొని లాగితే గాని రాజకీయాలు చేయలేరు…ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి మందు కాంగ్రెస్‌ రాజకీయాలు అచ్చు ఇలాగే వుండేవి…ఆ తర్వాత కొంత తగ్గాయి…కాని మళ్లీ ఇప్పుడు పుట్టలో నుంచి పాము లేచినట్లు మళ్లీ అదే దోరణి…అదే పద్దతి…ఆ పద్దతే కరక్టు అనుకుంటూ రాజకీయం చేస్తున్నారు. తెలంగాణలో ఎనమిదేళ్లుగా పార్టీ అధికారానికి దూరమైనా, ఇంకా నాయకులు ప్రజల్లో వుంటున్నారంటే, జనంలో కాంగ్రెస్‌ పార్టీపై వున్న నమ్మకం అన్నది వారికి బోధపడడం లేదు…

                             ఇటీవలే కాంగ్రెస్‌ రాజకీయాలు కొద్దిగా దారిన పడుతున్నాయంటే , ఎప్పటికప్పుడు ముదిరి పాకాన పడేయడం వారికి కొత్త కాదు…

అందుకే గతాన్ని మార్చలి…గతంలో కాంగ్రెస్‌ చేసిన రాజకీయాలు మార్చాలి…వర్తమానంలో అసలు సిసలైన రాజకీయాలు చేయాలి…అంటే పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి రూటే కరక్టు…ఎందుకంటే కాంగ్రెస్‌లో దూకుడు మీద వుండే నాయకుడిని దూరం పెడుతుంటారు…వారితో ఎడమొహం పెడమొహంగా వుంటారు….ఎలాగైనా కాళ్లు పట్టుకొని లాగేయాలనుకుంటారు…అదే మెతక వ్యక్తిత్వం వున్న నాయకుడైతే గేలి చేస్తుంటారు… హేళన చేస్తుంటారు…ఇది ఆ పార్టీలో కామన్‌…అందుకే ఆ పార్టీలో అలిగేవారు ఎక్కువే..అరిచే వారు కూడా ఎక్కువే….2014 ఎన్నికల ముందు, తెలంగాణ ప్రకటన కంటే ముందే…భవిష్యత్తును ఊహించుకొని నేనంటే నేనే ముఖ్యమంత్రి అని ప్రకటించుకున్న నేతలు చాలా మందే వున్నారు. అందులో ముఖ్యమైన నాయకుడు జానారెడ్డి…2014 ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ అధినేత కేసిఆర్‌ ముఖ్యమంత్రి అయ్యారు. అదేంటో గాని ఆ ఎన్నికల్లో ముఖ్యమంత్రి పదవి మీద కలలు గన్న నేతల్లో జానారెడ్డి, మాత్రమే గెలిచారు…అదే జిల్లానుంచి కోమటి రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిలు గెలిచారు. అయితే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎలాగూ దక్కని జానారెడ్డి ప్రతిపక్ష నాయకుడయ్యారు. కాని అదే ఆయన రాజకీయ జీవితానికి చరమగీతం పాడినట్లైంది. 

                      మొదటి దఫా తెలంగాణ ప్రభుత్వం దూకుడుగా వుంటే, ప్రతిపక్షం డల్లుగా సాగింది.

 ప్రభుత్వాన్ని ధీటుగా ఎదరుర్కొనేందుకు, అడుగడుగునా ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఎంత ప్రయత్నం చేయాలనుకున్నా, జానారెడ్డి నెమ్మదనం పార్టీ కొంప ముంచింది. ఆయన మెతక వైఖరి కూడా పిరాయింపుదారులను కట్టడి చేయలేకపోయింది. అటు ప్రభుత్వాన్ని ఎదుర్కొలేకపోయింది. ఇటు ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోయింది. పైగా జానారెడ్డి పదే పదే ప్రభుత్వ పధకాలను మెచ్చుకుంటూ పోవడంతో ఆఖరుకు ఆయన కూడా ఓడిపోవడం జరిగింది. అయినా పార్టీలో మార్పు రాలేదు. తర్వాత ఎన్నికలు కూడా ఓడిపోయింది…ఇక వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెవాలంటే, ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా రేవంత్‌ రెడ్డి లాంటి నాయకుడే కరట్టు అని అధిష్టానం నిర్ణయానికి వచ్చింది. ఎందరు అడ్డుకోవాలనుకున్నా అధిష్టానం వినిపించుకోలేదు. తర్వాత కూడా రేవంత్‌కు అడుగడుగునా కాళ్లలో కట్టేలు పెట్టే ప్రయత్నం సీనియర్‌ నాయకులు ఆపలేదు. ఇప్పటికీ ఆపడం లేదు…

                          ఇక మెతక వైఖరి సరైంది కాదని రేవంత్‌ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లున్నారు.

 వరంగల్‌ సభ సక్సెస్‌ తర్వాత మంచి దూకుడు మీద వున్నాడు. పార్టీలో కూడా ఊపు తెచ్చాడు. కాకపోతే ఆ మధ్య రెడ్డి రాజకీయం సరిగ్గా సాగితే తప్ప రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాదన్న సంకేతాలను ఆయన పంపాలనుకున్నాడు. కాని సొంత పార్టీయే రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను చిలువలు పలువలు చేయాలని చూసింది. ఒక దశలో చేసింది కూడా…అది అధికార పార్టీకి అస్త్రంగా మారింది. బిజేపికి కూడా రాజకీయంగా ఒక రకంగా రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలు ఉపయోగపడిరది. కాని కాంగ్రెస్‌ పార్టీ క్యాడర్‌ మాత్రం పట్టించుకోలేదు. ఎక్కడా రేవంత్‌ రెడ్డికి వ్యతిరేకంగా పార్టీ శ్రేణులు స్పందించలేదు. నాయకుల వరకే విమర్శలు వినిపించినా, సముద్రంలో వచ్చే సహజమైన ఆటు పోటుగాలో చల్లబడిరది. సీనియర్ల ఆశలకు గండికొట్టింది. ఇక అప్పటినుంచి రేవంత్‌రెడ్డి కూడా మరింత గట్టిగా వుంటే తప్ప, సోకాల్డ్‌ సీనియర్లు దారిలోకి రారని నిర్ణయించుకున్నట్లున్నారు. 

 తాజాగా ఉమ్మడి ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్‌ సిన్హా హైదరాబాద్‌ రావడం, కాంగ్రెస్‌ శ్రేణులను కలవకపోవడం జరిగింది.

 అయితే అంతకు ముందే పిపిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఎవరూ యశ్వంత్‌సిన్హాను కలవడానికి వీలు లేదని హుకూం జరిచేశారు…కాని సీనియర్‌ నాయకుడు వి. హనుమంతరావు ఆ మాటలు పెడచెవిన పెట్టినట్లున్నాడు. యశ్వంత్‌ సిన్హాను కలిశాడు. దాంతో మీడియా ముఖంగా రేవంత్‌ రెడ్డి సీరియస్‌ అయ్యాడు. దాన్ని జీర్ణించుకోలేని జగ్గారెడ్డి మరోసారి రెచ్చిపోయే ప్రయత్నం చేశాడు. కాని రేవంత్‌రెడ్డి వెనక్కి తగ్గకుండా, వదిలేయకుండా తన మాటలు, పార్టీ నిర్ణయాలు ఎవరు బేఖాతరు చేసినా, లెక్కలోకి తీసుకోకపోయినా బండకేసి కొట్టుడే అంటూ సీరియస్‌ అయ్యాడు. ఇక ఉపేక్షించేది లేదని సంకేతాలు పంపారు….దాంతో ఒక్కసారిగా కాంగ్రెస్‌పార్టీలో నిశ్శబద్దం ఆవహంచినట్లైంది. అయితే ఇందులోనూ కొంత అలజడికి శ్రీకారం చుట్టాలని అనుకున్నా వారి పప్పులు ఉడకలేదు…రేవంత్‌ రెడ్డి ఇలా గట్టిగా వుంటే తప్ప పార్టీ గాడిలో పడదంటున్నారు…గో ..హెడ్‌!!అంటున్నారు. రేవంత్‌ గట్టిగానే వుండాలని కార్యకర్తలు నాయకులు కోరుతున్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *