విద్యార్థులను విద్యకు దూరం చేసేందుకే కుట్ర
పెంచిన బస్ పాస్ చార్జీలను తగ్గించాలి.
ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మన్నె కుమార్
సిద్దిపేట నేటి ధాత్రి
పెంచిన బస్ పాస్ చార్జీలను తగ్గించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్ఎఫ్) జిల్లా కార్యదర్శి మన్నె కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని స్థానిక బస్ డిపోలో అసిస్టెంట్ డిపో మేనేజర్ కి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మన్నె కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన బస్ చార్జీలతో పాటు, బస్ పాస్ చార్జీలను కూడా పెంచడం వలన విద్యార్థులపై పెను భారం మోపడమేనని అన్నారు. బస్ పాస్ చార్జీలు మూడు నుంచి నాలుగు రెట్లు పెంచడం వల్ల పేద, మధ్య తరగతి విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.కోవిడ్ 19 తో విద్యార్థులు గత రెండు సంవత్సరాలుగా కళాశాలలకు వెళ్లి చదువుకునే పరిస్థితి లేక ఇంటి దగ్గరే ఆన్లైన్ క్లాస్ లు వింటూ చదువుకున్నారు. ఈ సంవత్సరం కళాశాలలు, పాఠశాలలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో విచ్చలవిడిగా బస్ పాస్ చార్జీలు పెంచడం వలన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొందన్నారు. గ్రామాల నుంచి ఉన్నత చదువులు కోసం చదువుకునేందుకు పట్టణాలకు వస్తున్న విద్యార్థులపై ఆర్థిక భారం మోపి,పేద విద్యార్థులను విద్యకు దూరం చేసేందుకు చేసే కుట్రలో భాగంగానే బస్ పాస్ చార్జీలు పెంచుతున్నారని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెంచిన బస్ పాస్ చార్జీలను తగ్గించకపోతే అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో విద్యార్థులందరిని ఏకం చేసుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి ఆర్. బాలక్రిష్ణ, జిల్లా నాయకులు అప్పాల కృష్ణ, సాయి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.