Anti-Drug Awareness Rally in Bhupalpally
యువత వ్యసనాలకు బానిసలై భవిష్యత్ నాశనం చేసుకోవద్దు
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి నేటిధాత్రి
ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మాదకద్రవ్యాల నివారణపై అవగాహన కల్పించేందుకు శనివారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌక్ నుండి డా బిఆర్ అంబేడ్కర్ సర్కిల్ వరకు భారీ ర్యాలీలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ డ్రగ్స్ సమస్య సమాజానికి పెద్ద ముప్పుగా మారిందని పేర్కొన్నారు. ముఖ్యంగా యువత డ్రగ్స్‌కు బానిసలై తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ బానిసల కోసం ప్రభుత్వం ప్రత్యేక డీ-అడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. మన జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిలో డీ-అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేయబడుతుందని వెల్లడించారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న హెల్త్ వీక్‌లో ఆరో రోజు మాదకద్రవ్యాల నివారణపై ఈ ర్యాలీ నిర్వహించబడిందన్నారు. డ్రగ్స్ రవాణా, విక్రయం, వినియోగంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. చదువుకున్న యువత చెడు అలవాట్లకు లోనవకుండా తమ జీవితాలను సవ్యంగా మలుచుకోవాలని సూచించారు. ఎవరైనా డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు తెలిసినా వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాజంలో డ్రగ్స్ నివారణలో యువత పాత్ర అత్యంత కీలకమని తెలిపారు. ప్రభుత్వం డ్రగ్స్ నియంత్రణ కోసం ప్రత్యేకంగా “ఈగల్ టీం” ఏర్పాటు చేసిందని, ఎవరినీ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ మాట్లాడుతూ డ్రగ్స్ నివారణకు పోలీసు శాఖ ద్వారా గ్రామ గ్రామాన అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందని. జిల్లాలో గంజాయి రవాణా దారులు గంజాయి విక్రేతలపై కేసులు నమోదు చేయడం జరిగిందని అన్నారు. యువత డ్రగ్స్ పై అవగాహన లేకుండా సరదా కోసం తీసుకుంటూ కొద్దికొద్దిగా ఆ రొంపిలోకి దిగుతున్నారని వారికి అవగాహన వచ్చేసరికి జీవితాలు నాశనం చేసుకుంటున్నారని అన్నారు. జిల్లాలో డ్రగ్స్ నివారణకు పోలీస్ శాఖ తరపున పటిష్ట నిగా ఏర్పాటు చేయడం జరిగిందని ఎలాంటి సమాచారం ఉన్న ప్రజలు భాధ్యతగా పోలీసులకు అందజేయాలని ఎస్పీ స్పష్టం చేశారు. ప్రజల సహకారంతో డ్రగ్స్ రహిత సమాజం సాధ్యమవుతుందని అన్నారు.
అనంతరం 2 కే రన్ లో విజేతలకు ప్రశంషా పత్రాలు అందచేశారు.
ఈ ర్యాలీలో మున్సిపల్ చైర్మన్ బుర్రా కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.మధుసూదన్, డ్రగ్ ఇన్స్పెక్టర్ పావని, కౌన్సిలర్లు, అధికారులు, విద్యార్థులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
