Mobile Phones Distributed to Anganwadi Workers
*గ్రామీణ స్థాయిలో పోషణ సేవల బాధ్యత అంగన్వాడీలదే.!*
అంగన్వాడీలకు డిజిటల్ దిక్సూచి
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి.
గీసుగొండ–సంగెం మండలాల కార్యకర్తలకు మొబైల్ ఫోన్ల పంపిణీ
కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, కలెక్టర్ డాక్టర్ సత్య శారద
పోషణ సేవలు, డిజిటల్ పర్యవేక్షణ మరింత వేగవంతం
జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
నేటిధాత్రి ప్రతినిధి, నర్సంపేట/ వరంగల్ జిల్లా:
మహిళలు, పిల్లల సంక్షేమానికి ఆశాకిరణాలు
అంగన్వాడీ టీచర్లు. గ్రామీణ స్థాయిలో పోషణ సేవలను ప్రజలకు చేరవేసే కీలక భూమిక వారిదే అని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పేర్కొన్నారు. గీసుగొండ, సంగెం మండలాలకు చెందిన అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లకు మొబైల్ ఫోన్ల పంపిణీ జరగడం సంతోషకరమని అన్నారు.
గీసుగొండ–సంగెం మండలాల అంగన్వాడీ కార్యకర్తలకు గీసుగొండ కొనైమాకుల రైతువేదికలో మొబైల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ముఖ్య అతిథులుగా హాజరై మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లు.. మహిళలు, పిల్లల సంక్షేమానికి ఆశాకిరణాలు. గ్రామీణ స్థాయిలో పోషణ సేవలను ప్రజలకు చేరవేసే కీలక భూమిక వారిదే అని పేర్కొన్నారు.జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ, మహిళలు దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ఈ మొబైల్ ఫోన్ల ద్వారా పోషణ ట్రాకర్ యాప్, ఎన్‌హెచ్‌టీఎస్ యాప్, ఎఫ్ఆర్ఎస్ హాజరు నమోదు, అంగన్వాడీ కేంద్రాల ప్రారంభ స్థితి, లొకేషన్ ట్రాకింగ్, పిల్లల ఎదుగుదల పర్యవేక్షణ వంటి సేవలను వేగవంతంగా, ఖచ్చితంగా నిర్వహించవచ్చని వివరించారు. పిల్లల ఎత్తు, బరువు వివరాలను సకాలంలో నమోదు చేయడం ద్వారా పోషకాహార లోపాన్ని త్వరగా గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవచ్చని తెలిపారు. ఈ డిజిటల్ సదుపాయాలు ఫీల్డ్ స్థాయిలో డేటా నాణ్యతను పెంచడంతో పాటు సేవల పర్యవేక్షణను బలోపేతం చేస్తాయని చెప్పారు.ఈ కార్యక్రమంలో గీసుగొండ, సంగెం మండలాలకు చెందిన మొత్తం 119 మంది అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లకు సామ్సంగ్ మొబైల్ ఫోన్లు, బ్యాక్ కవర్లు, వాటర్ & డస్ట్ ప్రూఫ్ పౌచ్‌లు, 25 డబ్ల్యూ ఛార్జర్లు అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి శ్రీమతి రాజమణి, సీడీపీఓ డెబోరా, సూపర్వైజర్లు, శాఖ అధికారులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. జిల్లాలోని మొత్తం 874 మంది అంగన్వాడీ టీచర్లు మరియు సూపర్వైజర్లకు దశలవారీగా మొబైల్ ఫోన్ల పంపిణీ చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
