Kathanpalli Politics: Development Depends on Congress Support?
క్యాతన్ పల్లి అభివృద్ధికి అధికార కాంగ్రెస్ పార్టీ సహకరించేనా…?
చైర్మెన్ పీఠం కైవసం చేసుకున్న బిఆర్ఎస్, సిపిఐ కూటమికి పెద్ద సవాలేనా…?
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
క్యాతన్ పల్లి మున్సిపాలిటీ ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపధ్యంలో ఎట్టకేలకు
మున్సిపాలిటీ లో నూతనంగా బిఆర్ఎస్ సీపీఐ కూటమి పదవి బాధ్యతలు చేపట్టింది.నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లకు మునిసిపాలిటీ అభివృద్ధి పెద్ద సవాలు గానే నిలిచే అవకాశం లేకపోలేదు.వివరాల్లోకి వెళితే.. తెలంగాణ రాష్ట్రంలో కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ తో జత కలిస్తే అందుకు భిన్నంగా క్యాతన పల్లి మునిసిపాలిటీలో బిఆర్ఎస్ పార్టీ తో జతకట్టి విజయం సాధించి 50 రోజుల నిరీక్షణానంతరం చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకున్నారు. ఈ ప్రాంతంలో అధికార కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు నియోజక వర్గంలో ఈ మున్సిపాలిటీ ఉండటంతో అభివృద్ధికి మంత్రి వివేక్ సహకరించి నిధులు కేటాయిస్తారా..? లేదా అని వేచి చూడాల్సిందే. అందుకు నిదర్శనమే ఇప్పటికే గెలిచిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు తమ వార్డుల్లో అభివృద్ధి పనుల్లో పాల్గొంటున్నప్పటికీ పోటీ చేసి ఓడిన కౌన్సిలర్ అభ్యర్థులు సైతం తమ వార్డుల్లో తామే కౌన్సిలర్లుగా భావించి అభివృద్ధి పనుల్లో కలుగచేసుకుంటు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఇక రానున్న రోజుల్లో వారే ఆధిపత్యం కొనసాగిస్తారేమో అనే సందేహాలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొందరు కాంగ్రెస్ పెద్దలు చైర్మన్ పీఠం దక్కించుకున్న కౌన్సిలర్లకు డ్రైనేజ్ కాలువలు తీయించే పని తప్ప అభివృద్ధి పనుల్లో వారికి పనేం ఉండదు అంటూ ఎద్దేవా చేస్తూ మునిసిపాలిటీలో ప్రచారం చేస్తుండడం అందుకు బలం చేకూరుస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.ఏదేమైనా క్యాతన్ పల్లి మున్సిపాలిటీ అభివృద్ధి జరగాలంటే కింది స్థాయిలో ఉన్న నాయకులు మంత్రిని తప్పుదోవ పట్టించకుండా ఉంటే మంత్రి వివేక్ వెంకటస్వామి సైతం మున్సిపల్ అభివృద్ధికి సహకరిస్తారనే ఆశాభావం ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.
